logo

ఆశలన్నీ.. పెద్దపద్దు పైనే...!

పార్లమెంటులో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశ పెట్టనున్న పెద్దపద్దు ఎలా ఉంటుంది..? ఏయే వర్గాలకు మేలు చేసేలా వరాలుంటాయి అన్న ఆశ అందరి మదిలో మెదులుతోంది.

Updated : 01 Feb 2023 06:05 IST

ఈనాడు, కరీంనగర్‌

పార్లమెంటులో నేడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశ పెట్టనున్న పెద్దపద్దు ఎలా ఉంటుంది..? ఏయే వర్గాలకు మేలు చేసేలా వరాలుంటాయి అన్న ఆశ అందరి మదిలో మెదులుతోంది. మూడేళ్ల కిందట కరోనా విజృంభణతో వివిధ రంగాలు అతలాకుతలమయ్యాయి.. గత బడ్జెట్‌లలో పెద్ద ప్రాజెక్టుల కల నెరవేరేలా ఉమ్మడి జిల్లాకు కాసులు కురవలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాజా పద్దుపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. దక్కాల్సిన వాటా పెరగాలన్న ఆకాంక్ష అన్ని వర్గాల్లో వ్యక్తమవుతోంది..


దారుల దశ తిరిగేనా!

రీంనగర్‌, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి వివిధ జిల్లాలకు అనుసంధానంగా ఉన్న పలు జాతీయ రహదారులకు నిధులు రావాల్సి ఉంది. దేశ ప్రధాని స్వయంగా గతేడాది నవంబరు 12న గోదావరిఖని బహిరంగ సభలోనే జిల్లాలోని కీలకమైన జాతీయ రహదారి నిర్మాణానికి వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. కరీంనగర్‌ లోక్‌సభ స్థానం పరిధిలోని ఎల్కతుర్తి - సిద్దిపేట జాతీయ రహదారి విస్తరణకు రూ.578.85 కోట్ల ప్రాజెక్ట్‌కు పచ్చజెండా ఊపారు. ఈ బడ్జెట్‌లో ఆ నిధులు మంజూరవడంతోపాటు కీలకమైన వరంగల్‌- కరీంనగర్‌లోని 68 కి.మీ.లకు రూ.2,146.86 కోట్లు, కరీంనగర్‌- జగిత్యాల మార్గంలో 59 కి.మీ దారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ఇదివరకే మంజూరు చేసిన రూ.2151.63 కోట్లను ఈ బడ్జెట్‌లో అందించాల్సి ఉంది. ఇవే కాకుండా.. కరీంనగర్‌- సిరిసిల్ల- పిట్లం, సిరిసిల్ల- సిద్దిపేట - జనగాం, జగిత్యాల- మెట్‌పల్లి- నిజామాబాద్‌, నిర్మల్‌- ఖానాపూర్‌- జగిత్యాల, కరీంనగర్‌- మానకొండూర్‌- వీణవంక- భూపాలపల్లి, రాయపట్నం- కరీంనగర్‌- కోదాడ మార్గాలను భారత్‌మాల పథకం కింద అభివృద్ధి పరుస్తామన్న ప్రకటనలు నెరవేరే నిర్ణయాలు వస్తే ఉమ్మడి జిల్లాలో రోడ్లు విస్తరిస్తాయి. రవాణా మెరుగుపడుతుంది.


పథకాలు ప్రయోజనమనేలా..

రైతులు, యువత, మహిళలు, కార్మికులకు మేలు చేసేలా ఉన్న కొన్ని కీలకమైన కేంద్ర ప్రభుత్వ పథకాలకు దండిగా నిధులను కేటాయిస్తే జిల్లాలకు మేలు జరగనుంది. ముఖ్యంగా వ్యవసాయాధారిత జిల్లాలో కర్షకులకు బీమా వర్తింపు సహా సేంద్రియ సాగుకు ఊతమిచ్చే నిర్ణయాలు, కిసాన్‌ కార్డులు, ఆధునిక యంత్రాల ఊరట లాంటి పలు ప్రయోజనాలు పార్లమెంటు వేదికగా వెలువడాల్సి ఉంది. వ్యవసాయ మార్కెట్‌లోని ఈ-నామ్‌ వ్యవస్థ గాడిలో పడాల్సిన అవసరముంది. జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్‌ సమావేశం(దిశ)లోని దాదాపు 42 కేంద్ర పథకాలకు సంబంధించిన నిధుల విడుదల జాప్యం తీరేలా కేటాయింపులు ఘనంగా ఉండాలి. ఆస్పత్రులకు పెద్ద దిక్కుగా నిలుస్తున్న నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ ద్వారా కాసుల మూటలు అంది వైద్య సేవలు మరింత మెరుగుపడాలి. ముఖ్యంగా కరీంనగర్‌ స్మార్ట్‌సిటీకి రావాల్సిన కేంద్ర వాటా నిధులు పూర్తిగా అందితే అభివృద్ధికి దోహదపడనున్నాయి. నేషనల్‌ రూరల్‌ లైవ్‌హుడ్‌ మిషన్‌, రూర్బన్‌ పథకం, రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన, పోషణ్‌ అభియాన్‌, సుగమ్య భారత్‌ అభియాన్‌, బేటీ బచావో- బేటీ పడావో, ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన, స్వచ్ఛభారత్‌ మిషన్‌, ప్రధానమంత్రి సడక్‌ యోజన, దీన్‌దయాళ్‌ గ్రామీణ విద్యుదీకరణ యోజనలో జిల్లాకు పెద్ద వాటా అందితే మేలు కలగనుంది.


రైల్వే ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటో?

పలు రైల్వే ప్రాజెక్ట్‌లకు ఈ బడ్జెట్‌లోనైనా ఆశించినన్ని కాసులు అందితే అభివృద్ధికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా మనోహరాబాద్‌- కొత్తపల్లి మార్గానికి రూ.400 కోట్ల వరకు కేటాయింపులు ఉంటేనే.. ఈసారి సిరిసిల్ల జిల్లా వరకు రైల్వే ట్రాక్‌ నిర్మాణం జరిగే వీలుంటుంది. కరీంనగర్‌- మానకొండూర్‌- కాజీపేట  కొత్త మార్గం కోసం పెట్టిన ప్రతిపాదనలు ఆమోదిస్తే ప్రయాణ సౌకర్యం మెరుగవనుంది. వందేభారత్‌ రైళ్లను పలు మార్గాల్లో పొడిగిస్తామనే నిర్ణయాల్లో భాగంగా కొత్త మార్గాల ప్రకటనలో జమ్మికుంట- రామగుండం మార్గం ఉంటే కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాలు దిల్లీకి దగ్గరి దారిగా మారే వీలుంటుంది. కొత్త రైళ్ల కేటాయింపులు, ఎక్స్‌ప్రెస్‌ల నిలుపుదల, ఆర్వోబీల నిర్మాణాలు, ట్రాక్‌ల పునరుద్ధరణ, స్టేషన్‌ల ఆధునికీకరణలాంటి మంచి పనులకు మోక్షం లభించాలని ఉమ్మడి జిల్లావాసులు కోరుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని