logo

వేర్వేరు చోట్ల ముగ్గురు విద్యార్థుల బలవన్మరణం

ఆ విద్యార్థిని కాలికి చిన్న గాయమైందని కళాశాలకు వెళ్లలేదు. తండ్రి మందలించడంతో ప్రాణాలు తీసుకుంది. ఇంకో ఘటనలో బడికి వెళ్లకుండా పడుకున్న కొడుకును తల్లి నిద్ర లేపింది.. ఈ మాత్రానికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Published : 07 Feb 2023 06:03 IST

కోరుట్ల గ్రామీణం, సిరిసిల్ల గ్రామీణం, హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: ఆ విద్యార్థిని కాలికి చిన్న గాయమైందని కళాశాలకు వెళ్లలేదు. తండ్రి మందలించడంతో ప్రాణాలు తీసుకుంది. ఇంకో ఘటనలో బడికి వెళ్లకుండా పడుకున్న కొడుకును తల్లి నిద్ర లేపింది.. ఈ మాత్రానికే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో చోట మార్కులు తక్కువ వచ్చాయని విద్యార్థిని బలవన్మరణం చెందింది. కోరుట్ల మండలం, సిరిసిల్ల, జమ్మికుంట పట్టణాల్లో చోటుచేసుకున్న ఈ ఘటనలు కన్నవారికి పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చాయి.

కోరుట్ల మండలానికి చెందిన విద్యార్థిని(17) మెట్‌పల్లిలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మూడు రోజుల కిందట కాలికి గాయం కావడంతో ఇంటికి వచ్చింది. స్వల్ప గాయానికే కళాశాల మానేయడంపై తండ్రి మందలించాడు. దీంతో మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సిరిసిల్ల బీవై నగర్‌కు చెందిన విద్యార్థి(18) తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. తండ్రి రెండేళ్ల కిందట అనారోగ్యంతో మృతి చెందాడు. తల్లి కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. విద్యార్థి స్కూల్‌కు వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం పాఠశాలకు వెళ్లమంటూ తల్లి నిద్ర లేపింది. అనంతరం అతడు గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో తల్లి ఇంట్లోనే పని చేసుకుంటోంది. జమ్మికుంట శివాలయం వీధికి చెందిన విద్యార్థిని(16) పదో తరగతి చదువుతోంది. ఇటీవల జరిగిన ప్రీఫైనల్‌ పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో మనస్తాపానికి గురైంది. ఆదివారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు చున్నీతో ఉరి వేసుకుంది. తల్లిదండ్రులు చూసే సరికి కొన ఊపిరితో ఉంది. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని