logo

అమ్మాయిలకు అండ.. తల్లిదండ్రులకు ధీమా

తపాలా శాఖ ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అత్యధిక ఖాతాలను తెరిపించేందుకు గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా ‘సుకన్య సమృద్ధి యోజన మహోత్సవ్‌’ నిర్వహించనున్నారు.

Published : 09 Feb 2023 05:24 IST

నేడు, రేపు సుకన్య సమృద్ధి యోజన మహోత్సవ్‌

సుకన్య సమృద్ధి యోజన ప్రచార పత్రం

న్యూస్‌టుడే, ఫెర్టిలైజర్‌ సిటీ: తపాలా శాఖ ప్రవేశపెట్టిన ‘సుకన్య సమృద్ధి యోజన’పై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ అత్యధిక ఖాతాలను తెరిపించేందుకు గురు, శుక్రవారాల్లో దేశవ్యాప్తంగా ‘సుకన్య సమృద్ధి యోజన మహోత్సవ్‌’ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే పథకంపై ప్రజల్లో అవగాహన కల్పించేలా తపాలాశాఖ ఉద్యోగులు ర్యాలీలు నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. గురు, శుక్రవారాల్లో అన్ని తపాలా కార్యాలయాల్లో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరిపించేందుకు ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. తపాలా శాఖ ప్రవేశపెట్టిన వివిధ పథకాల అమలులో పెద్దపల్లి డివిజన్‌ ప్రథమ స్థానంలో ఉండగా ప్రత్యేక మేళాలో సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను సైతం అత్యధికంగా తెరిపించేలా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పెద్దపల్లి డివిజన్‌లో ఇప్పటికే 40,029 ఖాతాలు ఉన్నాయి.

పదేళ్ల లోపు వారే అర్హులు

పదేళ్ల లోపు అమ్మాయిలకు మాత్రమే ‘సుకన్య సమృద్ది యోజన’ ఖాతా తెరిచే అవకాశముంటుంది. కనీసంగా రూ.250 చెల్లించి ఖాతాను తీసుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి నెల వీలైనంత మేరకు జమ చేయవచ్చు. ఏడాదికి రూ.1.5 లక్షల వరకు 15 సంవత్సరాల వరకు జమ చేసుకునే అవకాశముంటుంది. అనంతరం ఆరు సంవత్సరాల తర్వాత వడ్డీ జమ కట్టి 21 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత పూర్తిగా చెల్లిస్తారు. ఈ మధ్యలో అమ్మాయి చదువుల కోసం వడ్డీతో కలిపి 50 శాతం, వివాహం కోసం పూర్తి మొత్తాన్ని తీసుకునే అవకాశముంటుంది. ఖాతా తీసుకునేందుకు తల్లిదండ్రుల మూడు ఫొటోలు, ఆధార్‌ కార్డుతో పాటు అమ్మాయి జనన ధ్రువీకరణ పత్రం తప్పని సరి. అమ్మాయిల భవిష్యత్తుకు భరోసాగా ఉండే ఈ పథకాన్ని వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని తపాలా శాఖ పెద్దపల్లి సూపరింటెండెంట్‌ కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని