logo

బల్దియాల్లో సన్నద్ధం

ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ఏటా హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతుంది.. పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఈఏడాది హరితహారం ఏవిధంగా చేపట్టాలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది.

Published : 04 Jun 2023 05:03 IST

హరితహారంలో 7,21,817 మొక్కల లక్ష్యం

కోరుట్ల నర్సరీలో ఏపుగా పెరిగిన మొక్కలు

న్యూస్‌టుడే, కోరుట్ల: ప్రభుత్వం రాష్ట్రాన్ని హరిత తెలంగాణగా మార్చేందుకు ఏటా హరితహారం కార్యక్రమాన్ని పకడ్బందీగా చేపడుతుంది.. పట్టణాల్లో పచ్చదనం పెంపునకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశాలున్నాయి. జిల్లాలో ఈఏడాది హరితహారం ఏవిధంగా చేపట్టాలో అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్ధం చేస్తుంది. ఇందులో భాగంగా జిల్లాలోని పట్టణాల్లో ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నారు. పట్టణాల్లో ఏ ప్రదేశాల్లో మొక్కలు నాటాలి, ఇళ్లలో ప్రజలతో ఎలాంటి మొక్కల నాటించాలని బల్దియా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రోడ్లకిరువైపులా, ప్రభుత్వ స్థలాల్లో, పాఠశాలల్లో, కార్యాలయాల్లో, ఇతర చోట్ల మొక్కలు నాటేందుకు స్థలాలను గుర్తిస్తున్నారు. రోడ్లకిరువైపులా గతేడాది నాటిన మొక్కలు ఎండిపోతే వాటిస్థానంలో నూతనంగా మొక్కలు నాటించనున్నారు. పట్టణ ప్రకృతి వనంలో మరిన్ని మొక్కలు నాటేందుకు చర్యలు చేపడుతున్నారు. పట్టణ ప్రగతిలో అభివృద్ధి చేసిన సీసీరోడ్లు, విస్తరించిన రోడ్ల కిరువైపులా మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.

పట్టణ నర్సరీల్లో పెంపకం

మూడేళ్లుగా పట్టణాల్లోనే ప్రత్యేకంగా నర్సరీలను ఏర్పాటు చేసి వివిధ రకాల మొక్కల పెంపకం చేపట్టారు. పట్టణాల్లో నాటేందుకు, ఇళ్లల్లో ప్రజలతో నాటించేందుకు కావాల్సిన మొక్కలు ఎన్నో ముందుగానే అంచనా రూపొందించి పట్టణ నర్సరీల్లో పెంచుతున్నారు. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులను వెచ్చించి శాశ్వత నర్సరీలను నెలకొల్పారు. నర్సరీల చుట్టూ గోడలు, కంచెలను నిర్మించి నీటి, నీడ సౌకర్యం ఏర్పాటు చేశారు. మొక్కల పెంపకం కోసం నాణ్యమైన మట్టి, విత్తనాలను తెప్పించి ప్రత్యేకంగా సిబ్బందిని నియమించారు. పట్టణ నర్సరీల్లో మొక్కలు త్వరగా ఎదిగేందుకు సేంద్రియ ఎరువుల వినియోగం, ఇతర అన్ని రకాల జాగ్రత్తలను తీసుకోవడంతో మొక్కలు పెరిగి అందుబాటులో ఉన్నాయి.

ఇంటింటికీ 2 నుంచి 5

జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయిల్‌ పట్టణంలోని నర్సరీల్లో నాటేందుకు కావాల్సిన అన్ని రకాల మొక్కలను పెంచి సిద్ధంగా ఉంచారు. నివాస ప్రాంతాల్లో, ఇళ్లలో ప్రజలతో మొక్కలు నాటిచేందుకు ఇంటికి 2 నుంచి 5 పూల, పండ్ల మొక్కలు పంపిణీ చేయనున్నారు. పట్టణ నర్సరీలో పెంచుతున్న మొక్కలు సరిపోకపోతే ప్రైవేటు నర్సరీల నుంచి తెప్పించే ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణ నర్సరీల్లో గులాబీ, మల్లెపువ్వు, మందార, గోరింటా, చామంతి, తులసీ, పారిజాతం, చామంతి, కోనోకార్పస్‌, జామ, ఉసిరి, నిమ్మ, దానిమ్మ, సీతాఫలం, అల్లనేరేడు, చింత, వేప, గుల్‌మోహర్‌, కోనెకార్పస్‌, చైనాబాదం, వాటర్‌ ఆపిల్‌, కానుగ, బాదాం, మారేడు, ఎర్రచందనం, శ్రీగంధం, బాహినియా, కదంబం, సెల్టోఫాం, టేకొమా, టేకు, స్పాథొడియా, నెమలినార, నీలగిరి ఇలా సుమారు 35 రకాల మొక్కలను పెంచారు.

గులాబీ మొక్కలు అందిస్తాం..

మున్సిపల్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పట్టణ నర్సరీలో ఏడాది నుంచి మొక్కలు పెంచుతున్నాం. 6 అడుగుల వరకు పెరిగిన మొక్కలను నాటడంతో తొందరగా నాటుకుని ఎదుగుతున్నాయి. గతంలో మొక్కల సేకరణకు తీవ్రంగా శ్రమించేవాళ్లం. ప్రస్తుతం పట్టణ నర్సరీల ద్వారా నాణ్యమైన మొక్కలు అందుబాటులోకి వచ్చాయి. ఈ ఏడాది కోరుట్ల పట్టణంలో గలాబీ మొక్కలను ఇంటింటికీ పంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం.

అయాజ్‌, కమిషనర్‌

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు