logo

17 ఎన్నికలు.. ఒక్కసారే అతివకు అవకాశం

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది.

Updated : 19 Apr 2024 05:28 IST

నిజామాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గానికి సాధారణ, ఉప ఎన్నికలతో కలిపి ఇప్పటివరకు 17 సార్లు ఎన్నికలు జరగగా ఒక్కసారే మహిళకు అవకాశం లభించింది. 1952 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో 1967లో మాత్రమే స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కాంగ్రెస్‌ 11 సార్లు, తెదేపా 3 సార్లు, తెరాస(ప్రస్తుత భారాస) ఒకసారి, భాజపా ఒకసారి విజయం సాధించాయి. 2014లో తెరాస అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఎన్నికయ్యారు. మొదటి నుంచి ఈ నియోజకవర్గ పరిధి నిజామాబాద్‌ జిల్లాలోనే ఉండగా 2004లో పునర్విభజన అనంతరం జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలు కరీంనగర్‌ నుంచి వచ్చి చేరాయి.

న్యూస్‌టుడే, జగిత్యాల ధరూర్‌క్యాంపు


మాజీ ముఖ్యమంత్రికీ తప్పని ఓటమి

న్యూస్‌టుడే, కరీంనగర్‌ పట్టణం 

రాష్ట్రంలోనే రాజకీయ చైతన్యానికి కేంద్ర బిందువుగా ఉన్న కరీంనగర్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంతో మంది ఉద్ధండులు పార్లమెంటుకు వెళ్లారు. దిగ్గజ నేతలు గెలుపొందిన గడ్డ ఇది. పలుమార్లు ఎన్నికల్లో అనూహ్య, ఆసక్తికర ఫలితాలు వెలువడ్డాయి. ఇక్కడ పోటీ చేసి ఓడిపోయిన వారిలో రాష్ట్ర స్థాయి కీలక నేతలు కూడా ఉన్నారు. 1984 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి చొక్కారావుపై మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా (తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు మద్దతుతో) పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో చెన్నారెడ్డి ఓడిపోయారు. అలాగే సిరిసిల్ల, వేములవాడ ప్రాంతాల్లో జనశక్తి విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహించేది. 1989 శాసనసభ ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ సంస్థ(సీపీఐఎంఎల్‌ జనశక్తి) ముఖ్య నేత ఎన్‌.వి.కృష్ణయ్య స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. 1991 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి కాంగ్రెస్‌ అభ్యర్థి చొక్కారావు చేతిలో ఓడిపోయారు. కరీంనగర్‌ లోక్‌సభా స్థానంలో రాష్ట్ర స్థాయిలో ముఖ్య నేతలు మర్రి చెన్నారెడ్డి, ఎన్‌.వి.కృష్ణయ్యలు ఓటమి పాలవడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని