logo

స్వశక్తి.. ప్రజాస్వామ్య స్ఫూర్తి

అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు.

Published : 19 Apr 2024 04:27 IST

సంఘాల సమావేశాల్లో మహిళలకు ఓటు చైతన్యం
ఇంటింటికీ ప్రాముఖ్యం తెలిపేలా అధికారుల కార్యాచరణ

కాల్వశ్రీరాంపూర్‌ సమావేశంలో పాల్గొన్న స్వశక్తి మహిళలు

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: అన్నింటా ముందుంటున్న అతివలు ప్రతి ఎన్నికల్లో అధిక సంఖ్యలో ఓటు వేయడంలోనూ పైచేయి సాధిస్తున్నారు. ప్రజాస్వామ్యం కల్పించిన వజ్రాయుధాన్ని తప్పనిసరిగా వినియోగించుకొంటూ స్ఫూర్తి నింపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈసారి మహిళల పోలింగ్‌ శాతం రెట్టింపు చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. ఈ నెల 8 నుంచి స్వయం సహాయక సంఘాల సభ్యుల్లో ఓటు చైతన్యం కల్పించడానికి అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నారు. సంఘం సమావేశాల్లో ఓటరు నమోదు, ఓటు ప్రాముఖ్యం తదితర అంశాలను చర్చిస్తున్నారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, రెవెన్యూ శాఖల అధికారులు సంయుక్తంగా అవగాహన కల్పిస్తున్నారు.

సంపూర్ణ అవగాహన

మహిళా సంఘాలు, గ్రామ, మండల, జిల్లా సమాఖ్య సంఘాలకు క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రుణాలు, కిస్తుల చెల్లింపులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై చర్చిస్తున్నారు. సంఘంలో ఒక్కరికి ఆపదొచ్చినా అందరూ కలిసి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మహిళల్లో ఐక్యత కనిపిస్తోంది. సమావేశాల్లో ఓటు హక్కు వినియోగం, సమర్థులకే పట్టం కట్టాలనే అంశాలను సభ్యులకు వివరిస్తున్నారు. అభివృద్ధికి బాటలు వేసే వారికే ప్రాధాన్యం కల్పించాలని సూచిస్తున్నారు. ఊరంతా ఓటు వేసేలా సంపూర్ణంగా అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. ఒక్క సభ్యురాలికి ఓటు ప్రాముఖ్యం తెలిస్తే ఆమె ఇంట్లోని అందరినీ పోలింగ్‌ కేంద్రానికి రప్పించవచ్చన్న భావనతో అధికారులు కార్యాచరణ చేపట్టారు.

ఆలోచన రేకెత్తించేలా..

ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి ఓట్లు రాబట్టుకోవడానికి యత్నిస్తారు. ఈ క్రమంలో తాయిలాలకు ఆశ పడొద్దని, ‘ఓటు అమ్ముకుంటే మన భవిష్యత్తును మనమే తాకట్టు పెట్టినట్టే’నంటూ అధికారులు సభ్యుల్లో ఆలోచన రేకెత్తిస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులైన సభ్యులకు అర్థమయ్యేలా వివరిస్తున్నారు. సంఘాల్లో చర్చించిన ప్రతి అంశాన్నీ గ్రామంలోని మిగతా మహిళలకు తెలియజెప్పేలా సభ్యులను సిద్ధం చేస్తున్నారు. నిజాయతీగా ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ వివరిస్తున్నారు. సెర్ప్‌ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ అధికారులు సమావేశాల్లో పాల్గొంటూ మహిళలను చైతన్యం చేయడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.

ఫలిస్తున్న ప్రయత్నం

ఉమ్మడి జిల్లాలో 58 మండల సమాఖ్యలు, 1,955 గ్రామైక్య, 49,440 స్వశక్తి సంఘాలుండగా మొత్తం 5,46,953 మంది మహిళలు సభ్యులుగా కొనసాగుతున్నారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ఓటుహక్కు వినియోగంలో మహిళల భాగస్వామ్యం పెంచడానికి అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. దీంతో ఏటా ఓటింగ్‌ శాతం పెరుగుతోంది. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లోనూ మహిళలు భారీగా ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం తగ్గడంతో ఈసారి అలా కాకూడదని ప్రతి ఊరిలో ఓటు ప్రాముఖ్యంపై వివరిస్తున్నారు. సంఘాల్లోని సభ్యులందరూ గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి నైతిక ఓటింగ్‌ సందేశాన్ని చేరవేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని