logo

ఓట్లు కొల్లగొట్టి.. దిల్లీ తలుపుతట్టి

ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు.

Published : 19 Apr 2024 04:32 IST

అత్యధిక ఆధిక్యంతో గెలుపు బాట

న్యూస్‌టుడే, గోదావరిఖని: ఉమ్మడి జిల్లాలో కొంత మంది నేతలు అత్యధిక ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రికార్డు స్థాయిలో ఓట్లు సంపాదించి ప్రత్యర్థులకు అందనంత దూరంలో నిలిచారు. ఇందుకు భిన్నంగా తక్కువ మెజారిటీతో గెలుపొందిన వారూ ఉన్నారు. ఇప్పటివరకు పెద్దపల్లి లోక్‌సభా స్థానం నుంచి 2014లో గెలుపొందిన బాల్క సుమన్‌ అత్యధిక మెజారిటీ పొందగా, 1967లో కరీంనగర్‌ నుంచి ఎన్నికైన జె.రమాపతిరావు పేరిట స్వల్ప ఆధిక్యం నమోదైంది.

  • 2014లో పెద్దపల్లి లోక్‌సభ స్థానంలో తెరాస అభ్యర్థి బాల్క సుమన్‌ సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి జి.వివేక్‌పై 2,91,158 ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో అప్పటికే ఉద్యమంలో చురుగ్గా పాల్గొని ఉండటంతో ప్రజాదరణ చూరగొన్నారు.
  • 2004 ఎన్నికల్లో పెద్దపల్లిలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జి.వెంకటస్వామి సమీప ప్రత్యర్థి చెలిమెల సుగుణకుమారి(తెదేపా)పై 2,63,115 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. అంతకుముందు ఒక ఉప ఎన్నిక, సాధారణ ఎన్నికల్లో ఆమె చేతిలో ఓడిపోయిన వెంకటస్వామి ఈసారి భారీ మెజారిటీతో గెలుపొందారు.
  • 2014లో కరీంనగర్‌ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన బి.వినోద్‌కుమార్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి పొన్నం ప్రభాకర్‌పై 2,05,007 ఓట్ల ఆధిక్యంతో విజయాన్ని నమోదు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో ఉద్యమ పార్టీని ప్రజలు ఆదరించారు.

  • 2004లో కరీంనగర్‌ నుంచి పోటీ చేసిన తెరాస అధినేత కేసీఆర్‌ రెండేళ్లకు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక జరిగింది. 2006 ఉప ఎన్నికల్లో 2,01,582 ఓట్ల ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి టి.జీవన్‌రెడ్డిపై ఆయన గెలుపొందారు. సాధారణ ఎన్నికల్లో భాజపా అభ్యర్థి సీహెచ్‌.విద్యాసాగర్‌రావుపై విజయం సాధించిన కేసీఆర్‌ ఉద్యమ నేపథ్యంలో పదవిని వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

ఆ ఇద్దరికి స్వల్ప మెజారిటీ

  • ఇప్పటివరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు అతి తక్కువ మెజారిటీతో లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు.
  • 1967లో కరీంనగర్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన జె.రమాపతిరావు కేవలం 2,176 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో స్వతంత్ర అభ్యర్థి వి.ఈశ్వరయ్యపై గెలుపొందారు.
  • 1998లో పెద్దపల్లి నుంచి తెదేపా తరఫున పోటీ చేసిన చెలిమెల సుగుణకుమారి 6,174 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో కాంగ్రెస్‌ అభ్యర్థి జి.వెంకటస్వామిపై విజయం సాధించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని