logo

నవచైతన్యంతో కరోనాపై పోరు

‘కరోనా నియంత్రణలో కర్ణాటక విజయం సాధించింది. ప్రపంచం మొత్తం కొవిడ్‌ను నియంత్రించేందుకు సతమతమవుతున్న సమయంలోనే మనం కొవిడ్‌కు వ్యతిరేకంగా అత్యంత గట్టి పోరాటం చేశాం’ అని గవర్నర్‌ థావర్‌

Published : 27 Jan 2022 00:39 IST

గణతంత్ర వేడుకల వేదికపై గవర్నర్‌ ప్రకటన


 పరేడ్‌ మైదానంలో మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేస్తున్న
గవర్నర్‌ థావర్‌చంద్‌ గహ్లోత్‌

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడే : ‘కరోనా నియంత్రణలో కర్ణాటక విజయం సాధించింది. ప్రపంచం మొత్తం కొవిడ్‌ను నియంత్రించేందుకు సతమతమవుతున్న సమయంలోనే మనం కొవిడ్‌కు వ్యతిరేకంగా అత్యంత గట్టి పోరాటం చేశాం’ అని గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ ప్రకటించారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో పోల్చితే కర్ణాటకలో కొవిడ్‌ మరణాలు తక్కువేనని చెప్పారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మానిక్‌షా పరేడ్‌ మైదానంలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి, వివిధ దళాల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు. రోగులకు చికిత్స అందించడంలో శ్రమించిన ఫ్రంట్ లైన్‌ వారియర్లు, వైద్యులు, వైద్యేతర సిబ్బంది అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకున్నామని గుర్తు చేశారు. కొవిడ్‌ సమయంలోనే మన సామర్థ్యాన్ని పెంచేలా ఆరోగ్య మౌలిక సదుపాయాలు, ఆక్సిజన్‌ సిలిండర్లు, వెంటిలేటర్ల ఉత్పాదనను పెంచుకున్నామని చెప్పారు. వార్‌ రూమ్‌ల నిర్వహణ, టెలిమెడిసిన్‌ తదితరాలకు సాంకేతిక సంపద సహకరించినట్లు చెప్పారు. ఈ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గుర్తించి పురస్కారాన్ని ఇచ్చిందన్నారు. లాక్‌డౌన్‌లో ఇబ్బందులు ఎదుర్కొన్న పేదలకు ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు అండగా నిలిచాయని ప్రశంసించారు. నవ చైతన్యం, కొత్త ఆశలతో 2022లో అడుగు పెట్టామని ప్రకటించారు.


 బెంగళూరు పరేడ్‌ మైదానంలో వివిధ దళాల కవాతు 

* దేశంలో ప్రగతిపథంలో వెళుతున్న రాష్ట్రాల్లో కర్ణాటక ఒకటని గవర్నర్‌ గహ్లోత్‌ పేర్కొన్నారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని అమృత గ్రామపంచాయతీల్లో అమృత రైతు, అమృత గ్రామీణ గృహ నిర్మాణ పథకం, అమృత నిర్మల, అమృత శాల మౌలిక సదుపాయాల కార్యక్రమం, అమృత అంగన్‌ వాడీ కేంద్రాలు తదితర 14 కార్యక్రమాలను 2023 ఆగస్టు 15 నాటికి విజయవంతంగా నిర్వహిస్తామని వివరించారు. వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చేందుకు జలాశయాల అభివృద్ధికి 2021-22 ఏడాదిలో ప్రభుత్వం రూ.1,472 కోట్లను కేటాయించి, పనులు చేస్తుందని తెలిపారు. మొబైల్, సాంకేతిక ఆధారిత పంట సమీక్షను గ్రామ స్థాయిలో యువత సాయంతో అమలులోకి తీసుకు వచ్చామని చెప్పారు. పంట సమీక్షలకు 12.76 లక్షల మంది రైతులు పేర్లు నమోదు చేసుకోగా, 256.95 లక్షల హెక్టార్ల ప్రదేశాన్ని ఈ సమీక్ష పరిధిలోకి తీసుకు వచ్చామన్నారు. రైతుల కుటుంబాల్లోని విద్యార్థులను ప్రోత్సహించేందుకు రూ.4.41 కోట్లను 16,176 మంది విద్యార్థుల ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. ఆరోగ్య శాఖలో ఆరు నెలల్లోనే 746 మంది సాంకేతికనిపుణులు, 1,048 మంది వైద్యులను నియమించినటన్లు వివరించారు. కార్మికులు, అసంఘటిత కార్మిక వలయాలకు చెందిన 26.73 లక్షల కార్మికులకు రూ.1,136.05 కోట్ల సహాయ ధనాన్ని తమ ప్రభుత్వం విడుదల చేసిందని చెప్పారు. రెండో లాక్‌డౌన్‌ సమయంలో 11.82 లక్షల మంది కార్మికులకు తలా రూ.2 వేల చొప్పున రూ.236.46 కోట్లు చెల్లించామని తెలిపారు. దేశంలో ఉద్యాన శాఖ సాధనల్లో కర్ణాటక మొదటి స్థానంలో ఉందన్నారు. ఉద్యాన శాఖకు అందిస్తున్న ప్రోత్సాహకాలతో 20,634 మంది రైతులకు లబ్ధి చేకూరిందని వివరించారు. పోలీసులు అత్యాధునిక ఆయుధాలు కొనుగోలు చేసుకునేందుకు కేంద్ర రూ.14.23 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.13.39 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. వైర్‌లెస్‌ పరికరాల కొనుగోలుకు రూ.15.23 కోట్లు విడుదల చేశామని వివరించారు. వెనుకబడిన వర్గాలు, మహిళలు, బాలింతలు, బాలల సంక్షేమానికి విడుదల చేసిన నిధులను గవర్నర్‌ విశ్లేషించారు.


 ఓపెన్‌ టాప్‌ జీపులో వెళుతూ గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్న గవర్నర్‌ 

* మానిక్‌షా పరేడ్‌ మైదానంలో గవర్నర్‌ థావర్‌ చంద్‌ గహ్లోత్‌ బులెట్ ఫ్రూఫ్‌ గ్లాస్‌ లేకుండానే బుధవారం ప్రసంగించారు. తాను ప్రసంగించే సమయంలో బులెట్ ఫ్రూఫ్‌ గ్లాస్‌ లేకుండా చూడాలని అధికారులకు ఆయన ముందుగానే సూచించారు. పరేడ్‌ మైదానంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవాల సందర్భంలో ముఖ్యమంత్రి, గవర్నర్‌ ఇతర ప్రముఖులు ప్రసంగించే సమయంలో భద్రత కోసం బులెట్ ప్రూఫ్‌ గ్లాస్‌ను అడ్డుగా ఉంచడం తరచుగా కొనసాగుతున్న ప్రక్రియ.
* రెండు దశకాలుగా గణతంత్ర వేడుకలకు వ్యాఖ్యాతలుగా శంకర్‌ ప్రకాశ్, అపర్ణ వ్యవహరించేవారు. తనకు అవకాశం ఇవ్వడం లేదని కొద్ది రోజుల కిందట మరో మహిళా వ్యాఖ్యాత డాక్టర్‌ గిరిజ ముఖ్యమంత్రి నివాసం వద్ద ధర్నాకు దిగారు. దీంతో.. ఈసారి ఆమెకు వ్యాఖ్యాతగా అవకాశం కల్పించారు. 
* కొవిడ్‌ నిబంధనలు జారీలో ఉండడంతో మైదానంలో నిర్వహించవలసిన అన్ని సాంస్కృతిక కార్యక్రమాలను రద్దు చేశారు. ప్రముఖులు మినహాయించి, పౌరులకు మైదానంలోకి వెళ్లేందుకు అవకాశం కల్పించలేదు. 


విధానసౌధ వద్ద పోలీసుల ఆనంద హేల 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని