logo
Published : 20 May 2022 02:13 IST

దంచికొట్టిన వర్షం.. వణికిన జనం!

లోతట్టు ప్రాంతాలు జలమయం

ప్రజాజీవనం అస్తవ్యస్తం

బళ్లారి: రూపనగుడి కాలనీలో ఇళ్ల్ల మధ్య నిలిచిన మురుగునీరు

బళ్లారి, న్యూస్‌టుడే: బళ్లారి జిల్లా వ్యాప్తంగా బుధవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఈ ఏడాదిలో ఇదే పెద్ద వర్షం కావడంతో రైతులు ఖరీఫ్‌ పనులు ప్రారంభించడానికి సన్నద్ధమవుతున్నారు. ఎడతెరిపి లేని వానతో వాగులు, వంకలు ఉప్పొంగాయి. బళ్లారి నగరంలో పలు లోతట్టు ప్రదేశాల్లోకి వర్షపునీటితో కలిసి మురుగునీరు చేరడంతో స్థానిక ప్రజలు రాత్రంతా జాగారం చేశారు. బుధవారం రాత్రి 9 గంటలకు ప్రారంభమైన వర్షం ఏకధాటిగా ఉరుములు, మెరుపులతో బీభత్సం సృష్టించింది. రహదారులపై నీరు పరుగులు తీసింది. నగరం రూపనగుడి రహదారిలోని కట్టకింద కాలనీ, తదితర ప్రాంతాల్లో రాజ కాలువలో వర్షపునీరు, మురుగు సమీపంలోని కాలనీలోని ఇళ్లలోకి చేరడంతో వస్తువులు, ఆహార సామగ్రి తడిసిముద్దయ్యాయి. రాజు కాలువల్లో ఉన్న వ్యర్థాలను శుభ్రం చేయక పోవడంతో చెత్తాచెదారం అడ్డుపడి నీరంతా ఇళ్లలోకి చేరినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానిక ప్రజలు ఆందోళన చేయడంతో పాలికె అధికారులు అక్కడికి చేరుకొని మురుగునీటిని మళ్లించారు. బండిమోట, కౌల్‌బజార్‌లోని ఆశ్రయ కాలనీ, మిలర్‌పేటెలోకి పలు కాలనీలు, హౌసింగ్‌ బోర్డు ప్రాంతాల్లోకి వర్షపునీరు చేరి ఇబ్బందులు పడ్డారు. డీసీ కార్యాలయం, రిజిస్ట్రార్‌ కార్యాలయం ప్రభుత్వ మున్సిపల్‌ ఉన్నత పాఠశాల, బాలికల పాఠశాల తదితర ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచింది. సత్యనారాయణ పేటె, దుర్గమ్మ గుడి, రంగమందిరం వద్ద ఉన్న రైల్వే వంతెనల కింద నిలిచిన వర్షపునీటితో రాకపోకలకు ఆటంకం కలిగింది. కురుగోడు, సండూరు, సిరుగుప్ప తాలూకాల్లోనూ భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 37 ఇళ్లు పాక్షికంగా దెబ్బతినగా ఆరు గొర్రెలు మృత్యువాత పడ్డాయి.

సిరుగుప్ప: తాలూకా వ్యాప్తంగా బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. రారావి హగరినది, కరూరు, హగలూరు, తదితర గ్రామాల పరిధిలో వాగులు నిండుగా ప్రవహిస్తున్నాయి. వర్షాలకు పలు గ్రామాల్లో ఇళ్లు కూలిపోయినట్లు తహసీల్దార్‌ మంజునాథ స్వామి తెలిపారు.

కంప్లి: కంప్లి తాలూకాలో బుధవారం రాత్రి 38.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఎమ్మిగనూరు, హంపాదేవనహళ్లి, శ్రీరామ రంగాపురం, సుగ్గేనహళ్లి గ్రామాల్లో ఒక్కో ఇల్లు పడిపోయినట్లు తహసీల్దార్‌ గౌసియా బేగం తెలిపారు.

హొసపేటె: ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రముఖ పర్యాటక క్షేత్రం హంపీలోని పలు స్మారకాలు జలమయమయ్యాయి. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కురిసిన వర్షాలతో హంపీలో జనజీవనం స్తంభించింది.కృష్ణ ఆలయం, సాలు మంటపాలు, కృష్ణ బజార్‌, విజయవిఠల ఆలయాలను నీరు చుట్టుముట్టింది. భూగర్భ శివాలయం చెరువులా మారింది.

సింధనూరు : రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వానతో సింధనూరు తాలూకాలోని గ్రామాలు అతలాకుతలమయ్యాయి. తాలూకాలోని మస్కి అసెంబ్లీ క్షేత్ర పరిధి గ్రామాల్లో నష్టం వాటిల్లింది. అనేక విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్ని గ్రామాల్లో గురువారం సాయంత్రం వరకూ చీకటి రాజ్యమేలింది.

రైల్వే వంతెన కిందకు చేరిన వర్షపునీరు

సిరుగుప్ప: పాఠశాల ఆవరణలో నిలిచిన నీటిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే సోమలింగప్ప

కురుగోడు తాలుకాలో పడిపోయిన ఇల్లు

హంపీలో మునిగిన కృష్ణ ఆలయ ప్రాంగణం

సింధనూరు : తిడగోళ-కోళబాళ గ్రామాల మధ్య వాగు

Read latest Karnataka News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts