logo

కోటి ఆశల కర్నాటకం...

స్వాతంత్య్రమే అంతిశ్వాసగా.. గర్జించిన నేల దాస్యశృంఖలాల విముక్తికి ఎలుగెత్తిన కలాలు, గళాలు తెల్లదొరల గుండెల్లో గునపమై నిలిచిన వేళ.. ఏడున్నర దశాబ్దాల స్వేచ్ఛా కర్ణాటకంలో.. కన్పిస్తున్నాయా?..ప్రగతి కాంతులు

Published : 15 Aug 2022 02:48 IST

వజ్రసంకల్పం పూనుదాం.. భవితకు బాటలువేద్దాం!

స్వాతంత్య్రమే అంతిశ్వాసగా.. గర్జించిన నేల దాస్యశృంఖలాల విముక్తికి ఎలుగెత్తిన కలాలు, గళాలు తెల్లదొరల గుండెల్లో గునపమై నిలిచిన వేళ.. ఏడున్నర దశాబ్దాల స్వేచ్ఛా కర్ణాటకంలో.. కన్పిస్తున్నాయా?..ప్రగతి కాంతులు

ఇప్పటికింకానా...
రూపుమాపని పేదరికపు ఛాయలు భవితను చిదిమే ఆత్మహత్యలు.. కొలువు దక్కని యువత నిరాశలు సేద్యం గిట్టుబాటుకాని కర్షకుల కళ్లలో నీళ్లు సమసిపోని సామాజిక కట్టుబాట్ల చీకట్లు చందన సీమలో మేట వేసిన సమస్యలు సాంకేతిక నగరిలోనూ వీడని చిక్కుముడులు పంద్రాగస్టు రోజున ప్రతినబూనుదాం మనసుంటే జనపదం నుంచి నగరం దాకా.. ప్రగతిపూలు పూయిద్దాం.. అవినీతిపై సమరశంఖం పూరిద్దాం అమృతమహోత్సవ వేళ..త్రివర్ణపతాకం సాక్షిగా.. కొత్త బంగారు లోకం సాధనకు శ్రీకారం చుడదాం


ఈవీలో దూకుడు
విద్యుత్తు వాహన తయారీలో జోరు

విద్యుత్తు వాహనం (ఈవీ) ఉత్పాదన, కొనుగోళ్లలో కర్ణాటక సాధిస్తున్న ప్రగతి అనన్యం. 2021 ఏడాదిలో రాష్ట్రం లక్ష ఈవీ కొనుగోలు స్థాయికి చేరుకుంది. సంఖ్యా పరంగా రాష్ట్రం మూడవ స్థానంలో ఉన్నా ఒక ఏడాది సగటు కొనుగోళ్లలో రాష్ట్రం మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉంది. 2019లో కేవలం 9 వేల ఈవీ వాహనాల కొనుగోలు నమోదు కాగా ఈ సంఖ్య 2021 నాటికి 33 వేలు, 2022 తొలి నాలుగు నెలల్లో 20 వేలకు పైగా నమోదు కావటం రాష్ట్రం దేశ ఈవీ రంగంలో అగ్రగామి కాగలదన్న విశ్వాసాన్ని పెంచుతోంది. ఇప్పటి వరకు రాష్ట్రం ఈవీ రాయితీలు అమలు చేయకున్నా ఈస్థాయి కొనుగోళ్లు నమోదయ్యాయి. త్వరలో ప్రకటించే ప్రోత్సాహకాలు రాష్ట్రాన్ని ఈవీలో రారాజుగా మార్చలగలదు.


హరిత ఇంధనంతో..


హరిత ఇంధనంలో అగ్రగామి  కావాలన్నదే లక్ష్యం

ఇంధన రంగంలో స్వావలంబన దిశగా సాగుతున్న రాష్ట్రం 2021లో రాష్ట్ర ఇంధన ఉత్పాదనలో రూ.800 కోట్లను విక్రయాలతో సాధించింది. సంప్రదాయ ఇంధన వినియోగం నుంచి క్రమంగా దారి మళ్లిన రాష్ట్రం సంప్రదాయేతర, హరిత ఇంధన ఉత్పాదనకు పదేళ్ల ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం 33వేల మెగావాట్ల సంప్రదాయేతర ఇంధన ఉత్పాదన సామర్థ్యాన్ని సౌర, హైడ్రోజన్‌ ఇంధన వనరులతో 2025 నాటికి 10గిగావాట్లను సాధించాలని లక్ష్యంగా ఎంచుకుంది. ఇందు కోసం రూ.50 వేల కోట్ల న్యూరీన్యూ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా దోహదపడగలవు.


ఐటీలో ఉజ్వల భవిష్యత్తు


ఐటీ-అంకుర విధానం

2025నాటికి రూ.50 వేల కోట్ల ఐటీ ఉత్పాదన లక్ష్యంలో ఇప్పటికే 70 శాతం చేరుకున్న రాష్ట్ర ఐటీ రంగం దేశ ఐటీ ఉత్పాదనలో 43శాతం భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. బియాండ్‌ ద బెంగళూరు కార్యక్రమంతో ద్వితీయ శ్రేణి నగరాలు కూడా ఐటీ హబ్‌లుగా మార్చే ప్రక్రియ 2025 నాటికి ఫలితాల వైపు చేర్చగలదు. వీటికి అంకుర రంగం కూడా తోడవటంతో 2047 నాటికి రాష్ట్రంలో ఐటీ, అంకుర ఉత్పాదన సామర్థ్యం అక్షరాల లక్ష కోట్లకు పైగా చేర్చగలదు. 2023 నాటికి అత్యధిక యూనికార్న్‌లున్న రాష్ట్రం కర్ణాటక అని ఇటీవలి ఇండియా ఇన్నోవేషన్‌ ఇండెక్స్‌ సమీక్ష వెల్లడించటంతో రాష్ట్ర ఐటీ- అంకుర ఉత్పాదన మరింత వేగం కాగలదు.


ప్రజా రవాణా మరింత వేగం


ప్రజా రవాణా మరింత వేగవంతం

బెంగళూరులో సబర్బన్‌ రైళ్లు, నగరమంతా మెట్రో పథకాలు ప్రజా రవాణా వ్యవస్థను విస్తృతం చేయనుంది. ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారంగా రూపొందుతున్న నగరోత్థాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, 6వలయ రహదారులు, 5వేల కి.మీల జాతీయ, 15వేల కి.మీల జిల్లా, గ్రామీణ రహదారి ప్రాజెక్టులు రాష్ట్ర మౌలిక సదుపాయాలకే కాదు ప్రజా రవాణా వ్యవస్థను సుస్థిరం చేసేందుకు దోహదపడనున్నాయి. బెంగళూరులో 15వేల ఈవీ బస్సులు అటు పర్యావరణాన్నే కాదు ప్రజల ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి.

బెంగళూరు-చెన్నై, బెంగళూరు- బెళగావి- ముంబయ్‌ వంటి జాతీయ పారిశ్రామిక కారిడార్లు, కేఐఈడీబీ చేపట్టే తుమకూరు, రామనగర, గౌరిబిదనూరు, మధుగిరి, జక్కసంద్ర, హాసన, యాదగిరి, హరోహళ్లి, కోలార, మండ్య, ఓబలాపుర పారిశ్రామిక వాడల అభివృద్ధి ప్రాజెక్టులు రానున్న 10 ఏళ్లలో పూర్తి కానున్నాయి. వీటికి అనుసంధానంగా రహదారుల అభివృద్ధి కూడా రాష్ట్ర పరిశ్రమల ప్రగతిని 25 ఏళ్లలో విస్తృతం చేయగలదు.

అంతరిక్షంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యంతో రాష్ట్ర అంతరిక్ష, వైమానిక, రక్షణ ఉత్పాదనను భారీగా పెంచనుంది. దేశ అంతరిక్ష, వైమానిక, రక్షణ రంగ ఉత్పాదనలో 65 శాతం భాగస్వామ్యం కర్ణాటక సాధించగా, రానున్న గగన్‌యాన్‌, ఆదిత్య, చంద్రయాన్‌-3 ప్రాజెక్టులు 2025 నాటికి పూర్తి కానుండగా, వీటి ద్వారా అంతరిక్షంలో ప్రైవేటు భాగస్వామ్యం మరింత పెరిగి పరిశ్రమల ఉత్పాదనకు దోహదకారి కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని