logo

‘సొంత బలంతోనే అధికారంలోకి వస్తాం’

కాంగ్రెస్‌ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు.

Updated : 30 Mar 2023 06:34 IST

మైసూరు సమీపంలోని బిలుగాలి వద్ద డా.బి.ఆర్‌. అంబేడ్కర్‌ విగ్రహావిష్కరణకు వచ్చిన
మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు స్వాగతం పలుకుతున్న అభిమానులు

మైసూరు, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వస్తుందని విపక్ష నాయకుడు సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. తమకు కనీసం 120-130 సీట్లు వస్తాయన్న నమ్మకం ఉందన్నారు. మైసూరులో బుధవారం తనను కలుసుకున్న విలేకరులతో మాట్లాడారు. మంగళవారం నంజనగూడు, బుధవారం వరుణకు వ్యక్తిగత పనులపై వెళ్లి వచ్చానని తెలిపారు. హెలికాఫ్టర్‌లో రోజుకు నాలుగు చోట్ల ఎన్నికల ప్రచారాన్ని చేస్తానని చెప్పారు. ప్రజాధ్వని బస్సు యాత్రలో 60 నియోజకవర్గాలలో ప్రచారం పోటీ చేశానని గుర్తు చేశారు. డీకే శివకుమార్‌ అన్ని నియోజవకర్గాలలో ప్రచారాన్ని చేస్తున్నారని, ఆయన ప్రచారానికీ చక్కని స్పందన వస్తుందని తెలిపారు. కాంగ్రెస్‌కు తక్కువ సీట్లు వస్తే జనతాదళ్‌- భాజపా కలిసి పోయే అవకాశం ఉందని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. వరుణ తాను పుట్టిన ప్రాoతమని గుర్తు చేశారు. తాలూకా బోర్డుకు 1978లో మొదటిసారి అక్కడి నుంచి పోటీ చేసి గెలిచానని, 2008, 2013లో అక్కడ గెలిచానని తెలిపారు. గత ఎన్నికలలో అక్కడి నుంచి ఓడిపోయినా, ఈసారి ఘన విజయాన్ని సాధిస్తానని పేర్కొన్నారు. పార్టీ అధిష్ఠానం అనుమతిస్తే కోలారు నుంచీ పోటీ చేస్తానన్నారు. ఎన్నికలలో అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్నికల కమిషన్‌ నిఘాను మరింత తీవ్రం చేయాలని కోరారు. అధికారంలో ఉన్న పార్టీ అక్రమాలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలన్నారు.


వాళ్లే వస్తున్నారు

బెంగళూరు(యశ్వంతపుర),న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ టిక్కెట్‌ కోసం ఇతర పార్టీల శాసనసభ్యులు తమపై ఒత్తిడి తెస్తున్నారని, తాము వారిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించలేదని కేపీసీసీ అధ్యక్షుడు డీకేశివకుమార్‌ తెలిపారు. బుధవారం ఇక్కడ కాంగ్రెస్‌భవన్‌లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటికే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టిక్కెట్‌ కేటాయింపు కష్టంగా మారిందన్నారు. అనేక మంది శాసనసభ్యులు ఇతర పార్టీల నుంచి వచ్చేందుకు సిద్ధమవుతున్నారని, కాని వారికి టిక్కెట్‌ ఇస్తామనే హామీ ఇవ్వడం లేదన్నారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ శాసనసభ్యులను భాజపా చేర్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేశారన్న విషయాన్ని భాజపా నేతలు ప్రధానంగా ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై మరిచిపోకూడదన్నారు. అన్నివర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారని, భాజపా ప్రభుత్వాన్ని ఇంటికి పంపించే రోజులు దగ్గర పడ్డాయని తెలిపారు. ఏ ఆధారంగా రిజర్వేషన్లను వర్గీకరించారని ప్రశ్నించారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు న్యాయస్థానంలో నిలవబోవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని