logo

గనినాడుకు మంత్రి పదవి దక్కేనా?

రాష్ట్రంలో పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బళ్లారి జిల్లాకు మంత్రి స్థానం లభించేనా..లేదా? అనే దానిపై పార్టీ నేతల్లో చర్చలు ప్రారంభమయ్యాయి.

Published : 15 May 2023 03:57 IST

నాగేంద్ర, తుకారామ్‌లకు అవకాశం

బి.నాగేంద్ర, ఇ.తుకారామ్‌

బళ్లారి, న్యూస్‌టుడే: రాష్ట్రంలో పూర్తి ఆధిక్యంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బళ్లారి జిల్లాకు మంత్రి స్థానం లభించేనా..లేదా? అనే దానిపై పార్టీ నేతల్లో చర్చలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని ఐదు విధానసభ క్షేత్రాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలుపొందారు. వారిలో బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రంలో మంత్రి బి.శ్రీరాములుపై గెలుపొందిన కాంగ్రెస్‌ అభ్యర్థి బి.నాగేంద్ర, సండూరు క్షేత్రం నుంచి ఇ.తుకారామ్‌లు వరుసగా నాలుగు సార్లు శాసనసభ్యులుగా గెలుపొందారు. ఇద్దరూ బెంగళూరుకు చేరుకుని మంత్రి పదవి కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు ప్రారంభించారు.

నాగేంద్రకే అవకాశాలు?

వాల్మీకి వర్గంలో బలమైన నేత..ఉప ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన మాజీ మంత్రి బి.శ్రీరాములుపై బి.నాగేంద్ర గెలుపొందారు. ఆయనకే మంత్రి పదవి దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేపీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్‌, అగ్రనేత రాహుల్‌గాంధీతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి. 2008లో నియోజకవర్గాల పునర్విభజనతో కూడ్లిగి విధానసభ క్షేత్రం నుంచి భాజపా అభ్యర్థిగా బి.నాగేంద్ర పోటీ చేసి గెలుపొందారు. 2013లో భాజపాకు దూరమై అదే క్షేత్రం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా గెలుపొందారు. 2018 విధానసభ ఎన్నికలకు ముందు హొసపేటెలో జరిగిన కాంగ్రెస్‌ సమావేశంలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ గూటికి చేరుకున్నారు. 2018 విధానసభ ఎన్నికల్లో బళ్లారి గ్రామీణ విధానసభ క్షేత్రం నుంచి లోక్‌సభ మాజీ సభ్యుడు, భాజపా అభ్యర్థి సణ్ణ పక్కీరప్పపై నాగేంద్ర గెలుపొందారు. రాష్ట్రంలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంయుక్త ప్రభుత్వంలో బి.నాగేంద్రకు మంత్రి పదవి వస్తుందని అందరూ ఆశించారు. చివరి క్షణంలో సండూరు శాసనసభ్యుడు ఇ.తుకారామ్‌కు మంత్రి పదవి వరించింది. ఈ ఎన్నికల్లో హైవోల్టేజ్‌గా పేరు పొందిన బళ్లారి గ్రామీణ క్షేత్రం భాజపా అభ్యర్థి బి.శ్రీరాములుపై నాగేంద్ర 29,300 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

తుకారామ్‌కు వస్తుందా?

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి కంచుకోటగా మారిన సండూరు విధానసభ క్షేత్రం నుంచి ఇ.తుకారామ్‌ వరుసగా నాలుగోసారి శాసనసభ్యుడిగా గెలుపొందారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో సండూరు ఎస్టీకి రిజర్వు చేశారు. 2008 మాజీ మంత్రి సంతోష్‌ ఎస్‌.లాడ్‌, అనిల్‌ హెచ్‌.లాడ్‌ సహకారంతో ఈ క్షేత్రం నుంచి తుకారామ్‌ కాంగ్రెస్‌ తరఫున గెలుపొందారు. 2008లో జిల్లాలో భాజపా ప్రభావం, గాలి జనార్దన్‌రెడ్డి హవా ఉండేది. అప్పట్లో జిల్లాలో మొత్తం భాజపా అభ్యర్థులే సండూరులో కాంగ్రెస్‌ తరఫున తుకారామ్‌ గెలుపొంది రికార్డ్‌ సృష్టించారు. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు అత్యంత ఆప్తుడిగా ఉంటున్నారు. ఈ ఎన్నికల్లో భాజపా అగ్రనేతలు ప్రచారం చేసినా.. తుకారామ్‌ భాజపా అభ్యర్థి శిల్పా పాటీల్‌పై 35,522 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని