logo

అనుబంధాలే ఆలంబన

రాజకీయాల్లో అందరి మన్ననలూ పొందుతూ సుధీర్ఘకాలం రాణించటం అంతసులువు కాదు. అలాంటిది అందర్నీ కలుపుకొని తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బోసురాజు.

Published : 28 May 2023 02:02 IST

అమాత్యగిరిపై బోసురాజు
చందనసీమలో తెలుగు వెలుగు!

ఎన్‌ఎస్‌ బోసురాజు

మాన్వి, న్యూస్‌టుడే : రాజకీయాల్లో అందరి మన్ననలూ పొందుతూ సుధీర్ఘకాలం రాణించటం అంతసులువు కాదు. అలాంటిది అందర్నీ కలుపుకొని తనదైనశైలిలో దూసుకెళ్తున్నారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బోసురాజు. తెలుగు మూలాలున్న ఆయన కన్నడ రాజకీయాలపై తనదైన ముద్రవేశారు. మాన్వి కేంద్రంగా రోజు వారి దినచర్యను కోడికూత వినపడకముందే ప్రారంభించి అర్ధరాత్రి వరకు ప్రజా క్షేత్రంలోనే గడపటం రాజుకు అలవాటు. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఏం చెప్పినా దాన్ని కచ్చితంగా అమలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు సాధించారు. జాతీయ స్థాయి నాయకుల వద్ద పేరు గడించారు. పార్టీలో సామాన్య కార్యకర్త స్థాయి నుంచి.. తాజాగా మంత్రి పదవి దక్కించుకునే దాకా ఎన్నో కష్టనష్టాలు ఎదుర్కొన్నారు. రాయచూరు జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీకి గట్టి పునాదులు వేసిన ఘనత ఆయనకే దక్కుతుంది. మాజీ ఎంపీ దివంగత నాయకురాలు బసవరాజేశ్వరి, హెచ్‌.జి.రాములుని బోసురాజుకి రాజకీయ గురువులుగా చెబుతారు.

* ఎన్నికల సమయంలో పలు జిల్లాలకు కీలక బాధ్యతలు చేపట్టారు. నీటి పారుదల వ్యవస్థపై ఆయనకు అపార అనుభవముంది. ఫలితంగా రెండు సార్లు ‘కాడా’ అధ్యక్షుడయ్యారు. అప్పటి ముఖ్యమంత్రి ఎస్‌.బంగారప్ప చొరవతో గణేకల్‌ రిజర్వాయర్‌ మంజూరు చేయగా దాని నిర్మాణ బాధ్యతలను పూర్తిగా తన అనుభవంతోనే ఇంజినీర్లతో నిమిత్తం లేకుండా పూర్తి చేయడం గమనార్హం.

* రాయచూరు జిల్లా మాన్వి నియోజకవర్గం నుంచి 1985లో జరిగిన ఎన్నికల్లో బసవరాజ్‌ పాటిల్‌ అన్వరి చేతుల్లో ఓటమి పాలయ్యారు. దీన్ని సవాల్‌గా తీసుకున్న బోసురాజు రాజకీయంగా వ్యూహాలకు పదునుపెట్టారు. తనదంటూ ఓ బృందాన్ని ఏర్పరుచుకున్నారు. 1999, 2004లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు విజయం సాధించి నియోజకవర్గంలో రికార్డు సృష్టించారు. తర్వాత రాజకీయంగా రాజు వెనక్కితిరిగి చూడలేదు. కల్యాణ కర్ణాటక ప్రాంతంలో భారత్‌ జోడో యాత్ర పూర్తి బాధ్యతలను బోసురాజే తీసుకుని విజయవంతం చేశారు. ఈక్రమంలో ఆయన పనితీరును అధినాయకుడు రాహుల్‌గాంధీ మెచ్చుకుని సహకారం అందించారు. మొన్నటి ఎన్నికల్లో బోసురాజు రాయచూరు నుంచి పోటీ చేయాలని మునిగాళ్లపై నిలిచారు. అక్కడ మైనార్టీల ప్రాబల్యాన్ని గుర్తించి అధిష్ఠానం వెనక్కి తగ్గమనడంతో రాజు తలవంచారు. పీసీసీ సూచించిన అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేశారు. పార్టీలో ఆయనకు అన్ని స్థాయిల్లోనూ చక్కని సంబంధాలున్నాయి. అవి ఇప్పుడు బోసురాజు మంత్రి కావటానికి తోడ్పడ్డాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు