logo

ఇరుపక్షాలకూ అసమ్మతి సెగ

దేశంలోనే కీలకమైన హసన లోక్‌సభ నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ నేతల కుటుంబీకులు పోటీపడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి రెట్టింపయ్యింది.

Updated : 17 Apr 2024 06:46 IST

ఇరుపక్షాలకూ అసమ్మతి సెగ

హాసనకే తలమానికం.. రాడార్‌ నిర్వహణ కేంద్రం

బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్‌టుడే : దేశంలోనే కీలకమైన హసన లోక్‌సభ నియోజకవర్గంలో ప్రముఖ రాజకీయ నేతల కుటుంబీకులు పోటీపడుతుండటంతో అందరిలోనూ ఆసక్తి రెట్టింపయ్యింది. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవెగౌడ మనుమడు ప్రజ్వల్‌ రేవణ్ణ (జేడీఎస్‌), మాజీ మంత్రి పుట్టస్వామిగౌడ మనుమడు శ్రేయస్‌ పటేల్‌ (కాంగ్రెస్‌) పోటీ పడుతున్నారు. నియోజకవర్గంలో జేడీఎస్‌, కాంగ్రెస్‌లో అంతర్గత పోరు తీవ్రంగా ఉంది. అది ఏపార్టీ అభ్యర్థిని ముంచుతుందో తెలియని స్థితి నెలకొంది. జేడీఎస్‌- భాజపా కూటమి ఏర్పడినా- హాసన నగరంలో మాత్రం భాజపా విభిన్నంగా వ్యవహరిస్తోంది. జేడీఎస్‌ అభ్యర్థి ప్రజ్వల్‌ రేవణ్ణకు వ్యతిరేకంగా స్థానిక భాజపా నేతలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారనేది బహిరంగ సత్యం. నరేంద్రమోదీ మరోసారి ప్రధానమంత్రి కావాలన్నది తమ ప్రధాన నినాదమని మాజీ ఎమ్మెల్యే ప్రీతంగౌడ ప్రకటించారు. కాంగ్రెస్‌కు చెందిన మాజీ మంత్రి బి.శివరాం బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ అసమ్మతి నేతలతో సమావేశమై పరిస్థితులను చక్కపెట్టారు. స్థానిక భాజపా నేతల సహాయ నిరాకరణ జేడీఎస్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. హాసనలో పట్టు నిలుపుకొనేందుకు మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ కుటుంబ సభ్యులు శ్రమిస్తున్నారు. మరోవైపు మాజీ ప్రధాని వారం పాటు హాసనలో మకాం వేసి ప్రచారం చేయనున్నారు. ఇప్పటికే మొదటి విడత ప్రచారాన్ని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ ఓట్ల వేట దిగ్విజయంగా చేపట్టారు. రాష్ట్రంలోని 28 లోక్‌సభ నియోజకవర్గాల్లో హాసన తప్ప మిగిలిన చోట్ల జేడీఎస్‌ నామరూపాలు లేకుండా పోయింది. హాసనలో ఎదురే లేదని నిరూపించుకుంది. 1991లో తొలిసారిగా హాసనలోనే దేవేగౌడ లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఇక్కడే ఐదుసార్లు గెలుపు సాధించారు. 1999లో కాంగ్రెస్‌ అభ్యర్థి పుట్టస్వామిగౌడ చేతిలో ఓడిపోయారు. 1957 నుంచి 1962 వరకు హెచ్‌.సిద్ధనంజప్ప, 1967 నుంచి 1971 వరకు ఎన్‌.శివప్ప, 1974లో హెచ్‌.ఆర్‌.లక్ష్మణ్‌, 1977లో జనతాపార్టీ అభ్యర్థి నంజేగౌడ గెలుపొందారు. 1980, 1984 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి హెచ్‌.ఎన్‌.నంజేగౌడ విజయం సాధించారు. ఈసారి ఇద్దరు కురువృద్ధ నేతల కుటుంబీకులు పోటీని రసవత్తరంగా మార్చారు. రెండు కీలక పార్టీలకూ ప్రతిష్ఠాత్మకంగా మారింది. తాజా లోక్‌సభ సభ్యుడిగా ప్రజ్వల్‌ రేవణ్ణ అనర్హుడు అనే అంశంపై సర్వోన్నత న్యాయస్థానం విచారణ పూర్తి చేసి తీర్పు రిజర్వు చేసింది. తీర్పు ఏవిధంగా వస్తుందో తెలియని పరిస్థితి. ఆ భయాందోళన దళ్‌ అభ్యర్థిలో నెలకొన్న క్రమంలో ఇపుడీ ఎన్నికకు వేదిక సిద్ధమైంది.

  • విధానసభ సెగ్మెంట్లు : కడూరు, శ్రావణబెళగొళ, అరిసికెరె, బేలూరు, హొళెనరసిపుర, అర్కలగూడు, సకలేశపుర, హాసన.
  • ఓటర్లు : 17,24,908 మంది, పురుషులు- 8,58,661 మంది, మహిళలు- 8,66,206, ఇతరులు- 41 మంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని