logo

భాజపాతో పోటీ.. హామీలు గ్యారంటీ

కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్‌ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్‌ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది.

Published : 18 Apr 2024 02:56 IST

రాహుల్‌గాంధీ సభల్లో ఉత్సాహం
యువత ఉపాధికి కాంగ్రెస్‌ భరోసా

మాలూరులో కాంగ్రెస్‌ సభను ప్రారంభిస్తున్న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,
మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తదితరులు

ఈనాడు, బెంగళూరు : కర్ణాటకలో గ్యారంటీలను సజావుగా అమలు చేశామన్న ధీమాతో కాంగ్రెస్‌ దేశప్రజలకు అదే స్థాయి హామీలిచ్చింది. ఇప్పటికే 25 గ్యారంటీలతో ఎన్నికల ప్రణాళిక ప్రకటించిన కాంగ్రెస్‌ వాటిపై రాష్ట్ర ప్రచారంలో మరింత వివరణ ఇచ్చింది. ఆ పార్టీ ఎంపీ, అగ్రనేత రాహుల్‌గాంధీ బుధవారం రాష్ట్రంలో ప్రచారం చేసిన సందర్భంగా వీటిపై వివరణ ఇచ్చారు. మండ్య, కోలారు జిల్లా మాలూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన రాష్ట్ర గ్యారంటీలు ఎలా ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నాయో విడమరచి చెప్పారు. ఇదే సందర్భంగా భాజపా దేశ విభజనతో పాటు రాజ్యాంగ సవరణకు పాల్పడనుందని నిప్పులు చెరిగారు. ఈ సమావేశానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌..ఇతర కీలక నేతలంతా హాజరయ్యారు..

రాష్ట్రంలో గృహలక్ష్మి, గృహజ్యోతి, యువనిధి గ్యారంటీల అమలుపై వివరణ ఇచ్చిన రాహుల్‌గాంధీ- ఇదే సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దేశంలోని నిరుద్యోగ యువతకు డిగ్రీ పూర్తి కాగానే తొలి ఉద్యోగాన్ని ఇస్తామని హామీ ఇచ్చారు. అధికార ఏర్పాటుకు అవకాశమిస్తే ‘పెహలి నౌకరి పక్కీ’ని భారతీయ చరిత్రలో నిలిచిపోయే పథకంగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే విద్యాహక్కు చట్టాన్ని తెచ్చిన నేపథ్యంలో ఉపాధి కూడా ఓ హక్కుగా మారుస్తామన్నారు. డిగ్రీ, డిప్లొమాలు పూర్తి చేసిన వెంటనే వారికి నిరుద్యోగ భృతిని రాష్ట్రంలో ఇచ్చినట్లే దేశంలోనూ ఉపాధి అందిస్తామన్నారు. ఇదే సందర్భంగా రైతులకు మద్దతు ధర గ్యారంటీని అందిస్తామని ఆయన ఈ వేదిక నుంచి ప్రకటించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతి సారీ రైతులు లక్షాదికారులు కావాలని ప్రకటన చేస్తుంటారని, పదేళ్లలో ఆయన రూ.16 లక్షల కోట్ల విలువైన రుణాలను కేవలం 25 మంది ధనవంతుల కోసం మాఫీ చేశారని ఆరోపించారు. ఈ సొమ్ముతో జాతీయ ఉపాధి హామీ ద్వారా 24 ఏళ్ల పాటు పేదలకు అందించగలమన్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో భాజపా అక్రమాలను అడ్డుకొని, ప్రమాదంలో ఉన్న ప్రజాస్వామ్య వ్యవస్థ, రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు సిద్ధమైనట్లు వివరించారు. ఈ ఎన్నికలు ఈ రెండు భిన్నమైన వర్గాలకు జరుగుతున్న పోరాటంగా రాహుల్‌గాంధీ అభివర్ణించారు.

మండ్యలో కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట రమణేగౌడను సభకు పరిచయం చేస్తున్న రాహుల్‌గాంధీ

ఆ కలలు కల్ల..

ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ సర్కారు కూలిపోతుందని ఎన్‌డీఏ కూటమి పగటికలలు కంటోందని, వారి కలలు నెరవేరవని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హెచ్చరించారు. కేవలం ఓడిపోతామన్న భయంతోనే భాజపా.. జేడీఎస్‌తో చేయి కలిపిందన్నారు. మాజీ ప్రధానమంత్రి హెచ్‌.డి.దేవేగౌడ, ఆయన కుమారుడు కుమారస్వామి.. భాజపాపై చేయని ఆరోపణలు లేవన్నారు. మళ్లీ మోదీ ప్రధాని అయితే దేశాన్ని విడిచిపోతానని దేవేగౌడ అన్నారని, వచ్చే జన్మలో ముస్లింలా పుడతానని కూడా అన్నారని గతాన్ని గుర్తుచేశారు. నేడు అదే ముస్లింలను ద్వేషించే భాజపాతో కలసి సాగుతున్నారని ఆరోపించారు. వీరిద్దరూ నైతికతను మరచి ఒకటయ్యారని ధ్వజమెత్తారు. పదేపదే మోదీని కొనియాడుతుంటారని, వీరి అవకాశవాద రాజకీయాలకు ఈ ఎన్నికలు ముగింపు పలుకుతాయని సిద్ధరామయ్య హెచ్చరించారు. నేరచరిత్ర ఉన్న పార్టీతో చేయి కలిపిన జేడీఎస్‌ తన లౌకికవాదాన్ని బలిచేసిందన్నారు. భాజపా రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎప్పుడు ఎన్నికల హామీలిచ్చినా వాటిని 90 శాతం నెరవేర్చదన్నారు. కాంగ్రెస్‌ మాత్రం 99 శాతం నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. అందుకు బలమైన సాక్ష్యమే ఐదు గ్యారంటీలని ఆయన విశ్లేషించారు. ఇదే సందర్భంగా ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ మాట్లాడుతూ గత ఎన్నికల్లో జేడీస్‌.. భాజపా బీ టీం అంటూ రాహుల్‌గాంధీ ప్రకటించారని, ఈసారి అది వందశాతం నిజమని ఈ రెండు పార్టీలూ నిరూపించాయన్నారు. అసలు మండ్యకు కుమారస్వామి ఏం చేశారని టికెట్‌ ఇచ్చారో తెలియదన్నారు. ఆయనకంటే కార్యకర్తలే మండ్య కోసం శ్రమించారని వివరించారు. వారికి కాకుండా కుమారస్వామికి టికెట్‌ ఇవ్వడం ఆ పార్టీకి మోసం చేసినట్లేనని డీకే అన్నారు. ఆయనకు మహిళలంటే కనీస గౌరవం లేదన్నారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచే గ్యారంటీ పథకాలను విమర్శించే క్రమంలో మహిళలను కించపరచిన కుమారస్వామి నైజం ఏమిటో బయటపడిందన్నారు. ఇక కోలారు గురించి మాట్లాడిన డీకే శివకుమార్‌.. ఇక్కడ యోగ్యుడైన అభ్యర్థిని నిలబెట్టామని, అతనిని గెలిపించేందుకు అన్ని వర్గాల ప్రజలు శ్రమించాలని కోరారు.

మాలూరు సభకు కదలివచ్చిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులు

తడబడిన రాహుల్‌

కోలారులో ప్రచారం సందర్భంగా రాహుల్‌గాంధీ డీకే శివకుమార్‌ను ముఖ్యమంత్రి అంటూ సంబోధించారు. ఇదే క్రమంలో సిద్ధరామయ్యను కేపీసీసీ అధ్యక్షుడు.. అంటూ తన ప్రసంగాన్ని ప్రారంభించడంతో కాంగ్రెస్‌ నేతలంతా ఒక్కసారి అవాక్కయ్యారు. తర్వాత సవరించుకున్న రాహుల్‌గాంధీ నవ్వి ఊరుకున్నారు. రాహుల్‌గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమ ప్రసంగాల తర్వాత తరలి వెళ్లారు. వీరిద్దరు లేకుండానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రసంగించటం గమనార్హం. ఈ ప్రచారాల్లో మండ్య అభ్యర్థి వెంకటరామేగౌడ, కోలారు అభ్యర్థి గౌతమ్‌ పాల్గొనగా, ఆయా ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని