logo

కరకట్ట.. కష్టాలకు అడ్డుకట్ట

సీఎం ప్రకటన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి  దిగారు. ఇంజినీరింగ్‌ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేస్తున్నారు. పరివాహకంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలున్నాయి. ఏ మేరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలి

Updated : 12 Aug 2022 06:26 IST

సీతమ్మ సాగర్‌ ఎగువన కొనసాగుతున్న నిర్మాణం


దుమ్ముగూడెం మండలంలో చురుగ్గా సాగుతున్న పనులు

‘వరద ముంపు సమస్య లేకుండా శాశ్వత చర్యలు తీసుకుంటాం. గత ప్రభుత్వాలు తాత్కాలిక నిర్మాణాలే చేపట్టాయి. భద్రాద్రి రామాలయం చుట్టూ కరకట్ట అభివృద్ధికి, బూర్గంపాడు వైపు నిర్మాణానికి, ముంపు సమస్యల శాశ్వత పరిష్కారానికి రూ.వేయి కోట్లు కేటాయిస్తాం.’

-భద్రాచలం ఇటీవల సీఎం కేసీఆర్‌ అన్న మాటలు ఇవి.


సీఎం ప్రకటన నేపథ్యంలో జలవనరుల శాఖ అధికారులు రంగంలోకి  దిగారు. ఇంజినీరింగ్‌ అధికారులు ముంపు ప్రాంతాల్లో పర్యటించి సర్వే చేస్తున్నారు. పరివాహకంలో ఎక్కడెక్కడ ముంపు సమస్యలున్నాయి. ఏ మేరకు కరకట్టల నిర్మాణం చేపట్టాలి అనే విషయమై పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే మళ్లీ వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో సర్వే పనులకు కొంత ఆటంకం కలుగుతోంది. పరిస్థితులు చక్కబడిన తర్వాత ఈ ప్రక్రియ వేగంగా కొనసాగే అవకాశాలున్నాయి.

-అశ్వాపురం, న్యూస్‌టుడే


సీతమ్మ సాగర్‌కు ఎగువ..

దుమ్ముగూడెం ఆనకట్ట వద్ద సీతమ్మ సాగర్‌ బహుళార్ధ సాధక ప్రాజెక్టు నిర్మాణం కొనసాగుతోంది. 37 టీఎంసీల నీటి నిల్వ లక్ష్యంగా ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. దీంతో ఎగువన ఉన్న ప్రాంతాలన్నీ కూడా ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. జలవనరుల శాఖ అధికారులు సీతమ్మ సాగర్‌కు అనుబంధంగా గోదావరికి ఎడమ, కుడి వైపు 70 మీటర్ల ఎత్తుతో రూ.1,500 కోట్లతో కరకట్ట నిర్మిస్తున్నారు. ఎడమ వైపు దుమ్ముగూడెం మండలం నుంచి చర్ల మండలం వరకు 67 కి.మీ, కుడి వైపు అశ్వాపురం మండలం నుంచి పినపాక మండలం వరకు 57 కి.మీ పొడవునా దీనిని నిర్మిస్తున్నారు. అశ్వాపురం, దుమ్ముగూడెం మండలాల్లో పనులు చురుగ్గా సాగుతున్నాయి.  


ప్రధాన వాగులకూ..

గోదావరి అనుబంధ ప్రధాన వాగులకు కూడా కరకట్ట విస్తరించనున్నారు. ఎడమ అయిదు, కుడి వైపు అయిదు ప్రధాన వాగులను అధికారులు గుర్తించారు. 1986  వరదలను ప్రాతిపదికగా తీసుకున్నారు. ఆ ఏడాది గోదావరికి వరదలు 76 అడుగులు వచ్చాయి. ఆ వరదల ప్రాతిపదికగా ముంపు ప్రాంతాల వరకు ప్రధాన వాగులకు కరకట్టలు నిర్మించనున్నారు. వీటిని కలుపుతూ నదికి రెండువైపులా ఉన్న కరకట్టల దిగువన ప్రత్యేక కాలువలను ఏర్పాటు చేయనున్నారు. ఈ కాలువల ద్వారా ఆ వాగుల ప్రవాహాలను మరలించి సీతమ్మ సాగర్‌కు దిగువన గోదావరిలోకి విడుదల చేయనున్నారు. ఈ మేరకు అన్ని సర్వేలు నిర్వహించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రస్తుతం అవి రాష్ట్ర ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి.


ఇప్పుడు సమస్య ఇక్కడే..

ముంపు సమస్య, కరకట్టల నిర్మాణం అవసరం ఉన్నది సీతమ్మ సాగర్‌ దిగువ భాగంలోనే. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి నుంచి బూర్గంపాడు 25 కి.మీ,  దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు 30 కి.మీ పరీవాహక గ్రామాలకు ముంపు సమస్య ఏర్పడుతోంది. అయితే అంత పొడవున కరకట్టల నిర్మాణం అవసరం లేదనేది జలవనరులశాఖ అధికారుల అభిప్రాయం. ఎక్కడ ఏ మేరకు అవసరమో అక్కడి వరకే నిర్మాణం చేపడితే మేలనేది వారి సూచన. ఈ మేరకే అధికారులు ప్రస్తుతం సర్వేలు కొనసాగిస్తున్నారు.


గతంలో కూడా..

కరకట్టల నిర్మాణం కోసం సర్వేలు కొత్తేమీ కాదు. 1999లో తెదేపా  హయాంలో గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మించాలనే ప్రతిపాదనలు చేశారు. ఈ మేరకు వాటి కోసం సర్వేలు కూడా జరిగాయి. గోదావరికి కుడి వైపు అశ్వాపురం మండలం నెల్లిపాక నుంచి బూర్గంపాడు వరకు, ఎడమ వైపు దుమ్ముగూడెం నుంచి భద్రాచలం వరకు నిర్మాణానికి   ప్రతిపాదనలు రూపొందినా తర్వాత మూలనపడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని