logo

అక్షరానికి అగ్రాసనం

చదువు తరగని ఆస్తి.. ఇదే అక్షర సత్యమని భావించిన ప్రభుత్వాలు విద్యకు అగ్రాసనం వేశాయి. అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేటు దీటుగా తీర్చిదిద్దారు. పథకాలను అందిపుచ్చుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు దేశ, విదేశాల్లో

Published : 13 Aug 2022 02:46 IST

ఉమ్మడి జిల్లాలో విద్యాభివృద్ధి

చదువు తరగని ఆస్తి.. ఇదే అక్షర సత్యమని భావించిన ప్రభుత్వాలు విద్యకు అగ్రాసనం వేశాయి. అనేక పథకాలను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ విద్యాసంస్థలు కార్పొరేటు దీటుగా తీర్చిదిద్దారు. పథకాలను అందిపుచ్చుకున్న ఉమ్మడి జిల్లా విద్యార్థులు దేశ, విదేశాల్లో ఉద్యోగ బావుటా ఎగురవేస్తున్నారు. ఆలోచనలకు ‘అంకురాలు’ తొడిగాయి. ఐఏఎస్‌, ఐపీఎస్‌, సాఫ్ట్‌వేర్‌ తదితర సీట్లు చేజి క్కించుకుంటున్నారు. చదువు ఆవశ్యకత గుర్తించిన తల్లిదండ్రులు పిల్లలకు ఉన్నత విద్య అందిస్తున్నారు. బడిబయట ఉన్న పిల్లలకు సైతం సరస్వతీ కటాక్షం లభిస్తోంది. మరోవైపు వయోజనుల అక్షరాస్యత పెరిగింది. ఇదీ ఏడున్నర దశాబ్దాల్లో ఉమ్మడి జిల్లాలో విద్యా వికాసం..

‘‘ఉమ్మడి ఖమ్మం జిల్లా ఏర్పడేనాటికి జిల్లాలో చాలా తక్కువ సంఖ్యలోనే ప్రభుత్వ పాఠశాలలు ఉండేవి. నగరంలోని ఖాజీపుర, రిక్కాబజారు, నయాబజారు, ప్రభుత్వ బాలికల పాఠశాల ఉండేవి. 1973-74 రాజ్యంగ సవరణ చట్టం ద్వారా విద్య పంచాయతీరాజ్‌ వ్యవస్థ పరిధిలోకి రావటంతో గ్రామీణ ప్రాంతాల్లో అనేక పాఠశాలలు ఏర్పాటయ్యాయి. దీంతో ప్రజలకు విద్య చేరువైంది.’’

ఖమ్మం విద్యావిభాగం, న్యూస్‌టుడే : ప్రధానంగా డీపీఈపీ(డిపెప్‌) పథకంతో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో వేల సంఖ్యలో పాఠశాల భవనాలు ఏర్పడ్డాయి. సర్వశిక్షా అభియాన్‌ పథకంలో ఉన్నత పాఠశాలల భవనాలు నిర్మించారు. ఉపాధి హామీ పథకంలో పెద్ద ఎత్తున వంటగదులు, శౌచాలయాలు, తాగునీటి పథకాలు, ఇతర మౌలిక వసతుల కల్పన జరిగింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు- మనబడి’, ‘మన ఊరు-మన బస్తీ’ పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు సకల సౌకర్యాలు కల్పించే కార్యక్రమాన్ని ప్రారంభించింది.

మైలురాళ్లు

ఖమ్మంలో ఐటీ రంగం విస్తరిస్తోంది. పెద్ద నగరాలకే పరిమితమైన ఐటీహబ్‌ ఇక్కడ ఏర్పడింది. రెండోది కూడా నిర్మాణం కానుంది. మరోవైపు జిల్లా ప్రజల చిరకాల ఆకాంక్ష వైద్యవిద్య కళాశాల ఏర్పాటు.. ఇటీవల అదికూడా మంజూరైంది. ఏళ్ల నాటి కల విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తే ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు చేకూరనుంది.

విద్యార్థులను ఆకర్షించే పథకాలు

మధ్యాహ్న భోజన పథకం అమలు, సన్న బియ్యం, ఉచిత పాఠ్యపుస్తకాలు, ఏకరూప దుస్తులు, దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా ఛార్జీల చెల్లింపు, ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు, దివ్యాంగులకు మూడు చక్రాల సైకిళ్లు అందించటం లాంటి పథకాలతో సర్కారు బడుల్లో చదువుకునే విద్యార్థుల సంఖ్య క్రమేణా పెరిగింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ప్రతిభ కలిగిన పేద విద్యార్థులు ఉచితంగా కార్పొరేట్‌ కళాశాలల్లో చదువుకునే అవకాశం కల్పించారు. 1986లో జాతీయ విద్యా విధానం, 2009లో విద్యాహక్కు చట్టం, 2020లో నూతన విద్యావిధానం ద్వారా ప్రభుత్వ విద్యను బలోపేతం చేసే చర్యలు చేపట్టారు.

ప్రతిభాశీలురకు ఆలంబన.. నవోదయ, కేంద్రియ విద్యాలయాలు

గ్రామీణ ప్రాంత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, 2005 నుంచి అమల్లోకి వచ్చిన ట్రిపుల్‌ ఐటీలు పేద విద్యార్థుల దిశనే మార్చేశాయి. ప్రతిభ కలిగిన అనేక మంది విద్యార్థులకు ఇవి ఆలంబనగా మారాయి. సక్సెస్‌ పాఠశాలల ఏర్పాటు వల్ల పెద్ద ఎత్తున ఆంగ్లం, భౌతికశాస్త్రం ఉపాధ్యాయుల నియామకం జరిగింది. గ్రామీణ విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమం అందుబాటులోకి వచ్చింది. గురుకుల విద్యావ్యవస్థ విప్లవాత్మక మార్పుగా భావించవచ్ఛు విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగింది.

బాలికా విద్యపై ప్రత్యేక శ్రద్ధ

కస్తూర్బా బాలికలవిద్యాలయాల్లో తల్లిదండ్రులులేని అనాథ బాలికలు, బాలకార్మికులు, చదువుమానేసి కూలీ పనులు చేసేవారికి ఉచితవసతి సౌకర్యాలతో పాటు ఉచితభోజనం, దుస్తులు అందిస్తున్నారు. ఉభయ జిల్లాల్లో మొత్తం 28 కేజీబీవీల్లో 8వేల మందికి పైగా బాలికలు చదువుకుంటున్నారు. పది, ఇంటర్‌, ఇతర ప్రతిష్ఠాత్మక ప్రవేశపరీక్షల్లో పైచేయి సాధిస్తున్నారు.

నాడు గ్రామాల్లోనే ఉపాధ్యాయులు నివాసం ఉండి విద్యాబోధన చేసే వారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థుల సహకారంతో పాఠశాలలు కళకళలాడాయి. సమితి అధ్యక్షులు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు ఉన్న కాలంలో విద్యపై పరిరక్షణ ఉండేది. -గోళ్లముడి మల్లిఖార్జునశర్మ, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని