logo

అంజన్నకు అభిషేక మహోత్సవం

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామివారికి అభిషేకం జరిపి అర్చన చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది.

Updated : 07 Dec 2022 05:20 IST

ఇస్కాన్‌ కాలమానినిని ఆవిష్కరిస్తున్న ఈవో శివాజీ తదితరులు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయస్వామివారికి అభిషేకం జరిపి అర్చన చేయడంతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. భక్తులు హనుమాన్‌ చాలీసాను పఠించారు. ప్రధాన ఆలయంలో దేవదేవుడికి అర్చకులు భక్తిశ్రద్ధలతో సుప్రభాతం పలికి నామార్చనలు చేశారు. కన్యాదానం, కంకణధారణ జరిపి సీతాదేవికి యోక్త్రధారణ చేశారు. రామయ్యకు యజ్ఞోపవీత ధారణ నిర్వహించి మంగళ వాయిద్యాలు మార్మోగుతుండగా మాంగళ్యధారణ చేశారు. తలంబ్రాల వేడుక పరమానందం కలిగించగా దర్బారు సేవ మంత్రముగ్ధులను చేసింది. 3న ప్రారంభమైన తిరుమంగై ఆళ్వార్‌ తిరునక్షత్ర ఉత్సవాలు అయిదు రోజులు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా మధుర పదార్థాన్ని నివేదించారు.
పీఠాధిపతి పూజలు: శ్రీకాకుళం జిల్లాలోని ఆనందాశ్రమం పీఠాధిపతి శ్రీనివాసానంద సరస్వతి స్వామీజీ రాములవారిని దర్శించుకున్నారు. ఈవో శివాజీ సాదరంగా ఆహ్వానించగా వైదిక పెద్దలు ఆశీర్వచనం పలికారు. ప్రధాన ఆలయంతో పాటు ఆంజనేయుణ్ని దర్శించుకుని పూజలు చేశారు.

కాలమానిని ఆవిష్కరణ: భద్రాచలం రామాలయం పేరిట ఇస్కాన్‌ రూపొందించిన 2023 క్యాలెండర్‌ను ఈవో శివాజీ, ప్రధానార్చకులు సీతారామానుజాచార్యులు ఈవో కార్యాలయంలో ఆవిష్కరించారు. 8న కృత్తికా దీపోత్సవాన్ని పురస్కరించుకుని సీతారాముడికి అభిషేకం చేస్తారు. ఆ రోజు నిత్య కల్యాణం ఉండదు. ఈ ఉత్సవం నిమిత్తం నేడు అంకురార్పణ చేయనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని