logo

అ.ని.శా.కి చిక్కిన పంచాయతీ కార్యదర్శి

ఇంటి నంబర్‌ కేటాయించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఖ

Published : 01 Feb 2023 03:55 IST

ఖమ్మం గ్రామీణం, న్యూస్‌టుడే: ఇంటి నంబర్‌ కేటాయించేందుకు లంచం డిమాండ్‌ చేసిన ఓ పంచాయతీ కార్యదర్శి మంగళవారం అవినీతి నిరోధక శాఖ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం పంచాయతీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... కూసుమంచి మండలం నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన దేశబోయిన నాగేశ్వరరావు ఖమ్మం గ్రామీణ మండలం ఏదులాపురం పంచాయతీలోని చంద్రానగర్‌కాలనీలో 126 గజాల స్థలం కొనుగోలు చేసి అందులో ఇంటి నిర్మాణం చేశాడు. ఆ ఇంటిని విక్రయించేందుకు ప్రయత్నం చేశాడు. ఇంటి నంబర్‌ ఉంటే కొనుగోలు చేసే వారికి మంచిదని ఇంటి నంబర్‌ కోసం ఏదులాపురం పంచాయతీ కార్యదర్శి మహబూబ్‌ పాషాని ఆశ్రయించాడు. దీనికి పంచాయతీ కార్యదర్శి పాషా రూ.20 వేలు ఇస్తేనే ఇంటి నంబర్‌ కేటాయిస్తామని చెప్పారు. చివరికి రూ.6 వేలు ఇస్తే ఇంటినంబర్‌ ఇస్తామని చెప్పడంతో నాగేశ్వరరావు లంచం ఇవ్వడానికి సిద్ధమై 10 రోజుల క్రితమే ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మంగళవారం ఏదులాపురం పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి పాషాకి రూ.6 వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతోపాటు పాషా ఇంటి వద్ద కూడా తనిఖీలు చేసి, అక్రమ ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అని పరిశీలించనున్నారు. పాషాని అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ తెలిపారు. డీఎస్పీ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.


మృతదేహం లభ్యం: మణుగూరు పట్టణం, న్యూస్‌టుడే: పట్టణంలోని మల్లేపల్లి వద్ద గోదావరిలో గల్లంతైన శ్రీనివాసరావు(40) మృతదేహం మంగళవారం లభ్యమైంది. ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి గోదావరికి వెళ్లిన సత్తుపల్లి మండలం సత్యంపేట గ్రామానికి చెందిన శ్రీనివాసరావు వరద ప్రవాహానికి కొట్టుకపోయాడు. రెండు రోజుల గాలింపు చర్యల అనంతరం అతని మృతదేహాన్ని గుర్తించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని