logo

స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఖమ్మానికి తొలిస్థానం

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌’లో 2023 జనవరి మాసానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఖమ్మం జిల్లా త్రీస్టార్‌ కేటగిరీలో దేశంలోనే తొలిస్థానం సాధించింది.

Published : 02 Feb 2023 04:24 IST

ఖమ్మం రోటరీనగర్‌, న్యూస్‌టుడే

స్వచ్ఛ భారత్‌ మిషన్‌ ప్రచార రథం

‘స్వచ్ఛ సర్వేక్షణ్‌ గ్రామీణ్‌’లో 2023 జనవరి మాసానికి సంబంధించి జాతీయ స్థాయిలో ఇచ్చిన సూచీలో ఖమ్మం జిల్లా త్రీస్టార్‌ కేటగిరీలో దేశంలోనే తొలిస్థానం సాధించింది. కేంద్ర ప్రభుత్వం గ్రామాల్లో ఈ పథకం ద్వారా ఏటా అవార్డులు అందిస్తోంది. ఈ ఏడాది కేటగిరీల ఎంపికలో మార్పులు తీసుకొచ్చింది. 2023కు సంబంధించి ఇప్పటి వరకు ప్రతినెలా గుర్తింపు ప్రక్రియను చేపట్టింది. దీనిలో భాగంగా జనవరి 2023లో బహిరంగ మల, మూత్ర విసర్జన నిర్మూలన(ఓడీఎఫ్‌) ప్లస్‌ కేటగిరీలో 83.09 స్కోరుతో ఖమ్మం జిల్లా ప్రధమ స్థానంలో నిలిచినట్లు తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. గృహాల్లో, సంస్థల్లో మరుగుదొడ్లు నిర్మించుకుని వినియోగించడం, గ్రామాల్లో ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణ, కంపోస్టు షెడ్ల నిర్మాణం, పరిశుభ్రంగా తీర్చిదిద్దడంతోపాటు వాల్‌ పెయింటింగ్‌ వంటి అంశాలను ప్రామాణికంగా తీసుకుని దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించారు. జనవరిలో జరిగిన సర్వే ప్రకారం ఖమ్మం జిల్లా మొత్తంగా 187.34 స్కోర్‌తో తొలిస్థానంలో నిలిచింది. జనవరిలో 83.09 స్కోర్‌ సాధించడంతో ఫిబ్రవరి ఒకటి నుంచి జిల్లా ఫోర్‌ స్టార్‌ రేటింగ్‌ దక్కించుకుంది. 75 స్కోర్‌ పైబడి సాధించే జిల్లాలకు నాలుగు నక్షత్రాల రేటింగ్‌ ఇస్తారు.
* జిల్లాకు దేశంలోనే మొదటి స్థానం దక్కడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో 589 గ్రామ పంచాయతీల్లో పల్లె ప్రగతి, ఇతర కార్యక్రమాల ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, మిషన్‌ భగీరథతో ఇంటింటికి నల్లా నీరు అందిస్తున్నారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, మండల పరిషత్‌, డీఆర్‌డీఏ అధికారుల పర్యవేక్షణలో పనులు చేపట్టి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు.
జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలవడం గర్వకారణం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ భవిష్యత్తులో జిల్లాను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాల్సి ఉంది. జిల్లా, గ్రామ, మండల స్థాయిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సహకారంతో ఈ విజయం సాధ్యమైంది.

ఎం.విద్యాచందన, డీఆర్‌డీవో

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని