logo

డ్రాగన్‌ పండు.. లాభాలు మెండు

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు.

Updated : 28 Mar 2024 05:00 IST

ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న సాగు విస్తీర్ణం

ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డ్రాగన్‌ ఫ్రూట్‌ సాగు విస్తీర్ణం పెరుగుతోంది. అనేక మంది ఔత్సాహికులు, విద్యాధికులు, యువ రైతులు సైతం సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఔషధ గుణాలు కలిగిన పండుకు స్థానికంగానే మార్కెట్‌ ఉంది. రైతుల పొలాల వద్దకే వెళ్లి కొనుగోలు చేస్తున్నారు. కరోనా తర్వాత ఆరోగ్యంపై అవగాహన పెరగటంతో వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. ఒకప్పుడు ఖరీదైన ఈ పండు ఇప్పుడు సూపర్‌ మార్కెట్లు, మాల్స్‌, వీధుల వెంట కూడా లభిస్తోంది.


ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో..

ఒకప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒకటి రెండు మండలాల్లో నామమాత్రంగా ఉన్న సాగు విస్తీర్ణం క్రమంగా పెరుగుతోంది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, పెనుబల్లి, ఖమ్మం గ్రామీణం, కూసుమంచి, ఖమ్మం అర్బన్‌, రఘునాథపాలెం, కామేపల్లి, వేంసూరు, బోనకల్లు, ఎర్రుపాలెం మండలాల్లో సుమారు 60 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, పినపాక, సుజాతనగర్‌, దుమ్ముగూడెం, కరకగూడెం మండలాల్లో సుమారు 40 ఎకరాల్లో పండిస్తున్నారు.

30 ఏళ్ల పాటు ఆదాయం

డ్రాగన్‌ ఫ్రూట్‌ తక్కువ నీటి సౌలభ్యం ఉన్న నేలల్లో కూడా పండించవచ్చు. ఎకరానికి 4 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. ఇలా 30 సంవత్సరాల వరకు దిగుబడి పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.200 నుంచి రూ.250 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ పండులో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. విటమిన్‌-సి, ఖనిజ లవణాలు, పీచు పదార్థం, పాస్పరస్‌, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. రోగ నిరోధక శక్తి పెంచటంతో గుండె, ఎముకలు, వెంట్రుకలు, చర్మ సౌందర్యానికి మంచిదంటున్నారు. వైన్‌, సౌందర్య ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు.


ఇక్కడ అనుకూల పరిస్థితులు...

- బీవీ రమణ, జిల్లా ఉద్యాన, పట్టుపరిశ్రమ అధికారి, ఖమ్మం

డ్రాగన్‌ పండు సాగుకు జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయి. ఇప్పుడిప్పుడే రైతులకు అవగాహన పెరిగింది. పలు మండలాల్లో సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు ఇచ్చేందుకు తమ అధికారులు అందుబాటులో ఉన్నారు.సద్వినియోగం చేసుకోవాలి.


సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ సాగు...

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటకు చెందిన ఏలూరి శివశంకర్‌ బీటెక్‌ చదివి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. కరోనా తర్వాత ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో తన పొలంలో డ్రాగన్‌ ఫ్రూట్‌ వేయాలని భావించారు. వెంటనే మూడెకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. ఒక వైపు ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చేస్తున్నారు. ఎకరానికి రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. మొదటి రెండేళ్లు నామమాత్రంగా ఆదాయం వచ్చినా మూడో సంవత్సరం నుంచి ఎకరానికి 2 నుంచి 3 టన్నుల దిగుబడి వస్తోంది. కిలో రూ.150 నుంచి రూ.200 వరకు పొలం వద్దనే విక్రయిస్తున్నారు. ఈ లెక్కన సగటున ఎకరానికి రూ.3 లక్షల నుంచి రూ.4.50 లక్షల వరకు ఆదాయం వస్తోందని ‘న్యూస్‌టుడే’కు చెప్పారు. సేంద్రియ పద్ధతిలో సాగు చేస్తున్నట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని