logo

‘గాడి’న పడకుంటే.. గత్తర గత్తర

అనేక మంది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో    యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర    వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు.

Published : 28 Mar 2024 01:57 IST

నంబరు ప్లేటు లేని వాహనం రిజిస్ట్రేషన్‌ పత్రాలను పరిశీలిస్తున్న ఏసీపీ శ్రీనివాసులు (పాత చిత్రం)

బిస్కెట్లు కావాలంటూ ఖమ్మంలోని మామిళ్లగూడెంలో ఓ దుకాణంలోకి నాలుగు రోజుల క్రితం ఓవ్యక్తి వచ్చి నిర్వాహకురాలి మెడలోంచి ఆరు తులాల బంగారు గొలుసు లాక్కెళ్లాడు. నంబరు ప్లేటు లేని ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఈ ఘటనలో పాలుపంచుకున్నట్లు పోలీసులు గుర్తించారు.


నంబర్‌ ప్లేటు లేకుండా కొందరు.. నంబర్‌లోని  అక్షరాలను చెరిపి ఇంకొందరు.. నంబర్‌ ప్లేటును వంచి మరికొందరు ద్విచక్రవాహనాలపై  తిరుగుతున్నారు. గతంలో పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించటంతో ఈ జాడ్యం వేలాది మంది వాహనదారులకు పాకింది.


ఖమ్మం నేరవిభాగం, న్యూస్‌టుడే: అనేక మంది ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. కొన్ని మార్గాల్లో    యువకులు పోటీలు పడుతూ ద్విచక్ర    వాహనాలను అతివేగంతో వంకరటింకరగా నడుపుతున్నారు. తద్వారా తాము ప్రమాదాల బారిన పడటమే కాకుండా ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్నారు. అతివేగంగా పరుగులు తీసే వీరి వాహనాలకు నంబరు ప్లేట్లు కనిపించటం లేదు.

శాశ్వత రిజిస్ట్రేషన్‌ లేకుండానే..

కొత్తగా కొనుగోలు చేసిన ద్విచక్రవాహనానికి షోరూంలో తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబర్‌ ఇస్తారు. తదుపరి సదరు యజమాని తన వాహనానికి జిల్లా రవాణా శాఖ వద్ద శాశ్వత  రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలి. కానీ అనేక మంది ద్విచక్రవాహనదారులు శాశ్వత రిజిస్ట్రేషన్‌ చేయించు కోకుండా తిరుగుతున్నారు.


ఖమ్మం నగరంలో ప్రత్యేక తనిఖీలు

ఇలాంటి వాహనాల కారణంగా ప్రమాదాలు, దొంగతనాలు వంటి ఘటనల్లో నేరపరిశోధన పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఈ సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని పోలీసు కమిషనర్‌ సునీల్‌దత్‌ ఆదేశించటంతో ట్రాఫిక్‌ పోలీసులు ఈ ఏడాది మార్చి 1 నుంచి ఖమ్మం నగరంలో ‘స్పెషల్‌ డ్రైవ్‌’ చేపట్టారు. జడ్పీ సెంటర్‌, పాత బస్టాండ్‌, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వంటి ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. నంబరు ప్లేటు లేని వాహనాలను స్వాధీనపరచుకుంటున్నారు. జరిమానా విధించటంతోపాటు వాహనానికి నంబరు ప్లేటు బిగించేలా చేస్తున్నారు. నంబరు ప్లేటు లేకుండా, మార్ఫింగ్‌ చేసి మరోమారు పట్టుబడితే మోటారు వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపిస్తున్నారు. ఇల్లెందు రోడ్డు, శ్రీశ్రీ సర్కిల్‌, గాంధీచౌక్‌, కాల్వొడ్డు, ప్రకాశ్‌నగర్‌, ముస్తఫా నగర్‌, బోనకల్లు రోడ్డు వంటి రద్దీ మార్గాల్లోనూ తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.


మ్మం నగరంలోని కూడళ్లలో నిత్యం తనిఖీలు చేపడుతున్నాం. నంబరు ప్లేటు లేకుండా, ట్రిపుల్‌ రైడింగ్‌, మద్యం తాగి తిరుగుతున్న వాహనదారులకు కౌన్సెలింగ్‌ చేస్తున్నాం. కేసులు నమోదైతే కోర్టు వాయిదాలకు తిరగాల్సి ఉంటుంది. యువత విదేశాలకు వెళ్లాలంటే ఈ కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వాహనదారులు మోటారు వాహన చట్టం నిబంధనలు పాటించాలి.

బి.శ్రీనివాసులు, ట్రాఫిక్‌ ఏసీపీ, ఖమ్మం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని