logo

నేటి నుంచి నామినేషన్ల ఘట్టం

సార్వత్రిక ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారం మొదలుకానుంది. మే 13న జరిగే పోలింగ్‌ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

Published : 18 Apr 2024 06:06 IST

ఈనాడు డిజిటల్‌, కొత్తగూడెం: సార్వత్రిక ఎన్నికల క్రతువులో అత్యంత కీలకమైన నామపత్రాల స్వీకరణ ఘట్టం గురువారం మొదలుకానుంది. మే 13న జరిగే పోలింగ్‌ నేపథ్యంలో అభ్యర్థులు నామినేషన్లు సమర్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. గురువారం నుంచి ఈనెల 25 వరకు సాధారణ రోజుల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామపత్రాలు స్వీకరిస్తారు. ఖమ్మం, మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాల్లో పోటీచేసే అభ్యర్థులు సంబంధిత రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో నామినేషన్‌ దాఖలు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో సమర్పించే అవకాశాన్నీ ఎన్నికల సంఘం కల్పించింది. తొలుత ‘సువిధ’ యాప్‌లో వివరాలు నమోదు చేయాలి. అనంతరం సదరు అభ్యర్థికి ఆర్‌ఓ నుంచి అపాయింట్‌మెంట్‌ తేదీ వస్తుంది. అప్పుడు అభ్యర్థి లేదా ప్రతిపాదించే వ్యక్తులు ఆర్‌ఓ కార్యాలయానికి వెళ్లి నామపత్రాల  వివరాలతో కూడిన ధ్రువపత్రాలు అందించాలి. 26న నామపత్రాలను అధికారులు పరిశీలిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 29 వరకు గడువు విధించారు. అదేరోజు ఆయా లోక్‌సభ స్థానాల్లో ఎంతమంది బరిలో నిలవబోతు   న్నారనే లెక్క తేలనుంది.


అభ్యర్థుల అర్హతలు

  • భారతీయ పౌరసత్వం ఉండాలి.
  • వయసు కనీసం 25 ఏళ్లు ఉండాలి.
  • దేశంలో ఏ నియోజకవర్గంలోనైనా ఓటుహక్కు కలిగి ఉండాలి.
  • జాతీయ, రాష్ట్ర గుర్తింపు పొందిన పార్టీ తరఫున నామినేషన్‌ వేస్తే వారిని ఒకరు ప్రతిపాదిస్తే సరిపోతుంది. స్వతంత్ర అభ్యర్థి అయితే పది మంది ప్రతిపాదించాల్సి ఉంటుంది.

నిబంధనలు..

  • నామినేషన్ల స్వీకరణ కేంద్రం నుంచి 100 మీటర్ల పరిధి వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. మూడు వాహనాలను మాత్రమే అనుమతిస్తారు.
  • నామినేషన్‌ వేసే సమయంలో అభ్యర్థితో పాటు నలుగురిని మాత్రమే కార్యాలయం లోపలికి అనుమతిస్తారు. స్వతంత్ర అభ్యర్థి అయితే ఆయన/ఆమెతో పాటు పది మంది వెళ్లవచ్చు.
  • అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామపత్రాలు సమర్పించవచ్చు.
  • నామినేషన్‌ పత్రాన్ని ఫాం-2ఏలో సమర్పించాలి.
  • ఫాం-2ఏతో పాటు ఫాం-26 ద్వారా ప్రమాణ పత్రం(అఫిడ్‌విట్‌) జతపర్చాలి. అఫిడవిట్‌ను నోటరీ చేయించాలి.
  • నామపత్రం సమర్పించే సమయంలో అభ్యర్థి ప్రమాణం చేయాలి.

అన్ని కాలమ్స్‌ పూరించాల్సిందే..

అఫిడవిట్‌లో ఆస్తులు, అప్పులు, రాబడి, ఖర్చులు, క్రిమినల్‌ కేసుల వంటి వివరాలను నమోదు చేయాలి. అడిగిన వివరాలు వర్తించకపోతే ‘నాట్‌ అప్లికబుల్‌’ అని రాయాలి. అఫిడవిట్‌లోని కాలమ్స్‌ అన్నింటినీ పూరించాలి. లేనిపక్షంలో నామినేషన్ల పరిశీలన తేదీ కంటే ముందుగానే సదరు అభ్యర్థికి ఆర్‌ఓ నోటీసులు జారీ చేస్తారు. ఖాళీగా ఉంచితే నామపత్రం తిరస్కరణకు గురవుతుంది.


ఆర్‌ఓ నుంచి పొందాల్సిన పత్రాలు

  • ఎన్నికల వ్యయాలను నమోదు చేసే రిజిస్టర్‌
  • స్క్రూట్నీకి హాజరయ్యేందుకు నోటీసు
  • చెల్లించిన మొత్తానికి రసీదు
  • ప్రమాణ ధ్రువపత్రం
  • కరపత్రాలు, గోడపత్రికలు తదితర వాటిని ముద్రించేందుకు ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్‌-127(ఎ) సంబంధిత సూచనల పుస్తకం.

ఇలాగైతే తిరస్కరణే..

నామినేషన్లు స్వీకరించటంతో పాటు వాటిని తిరస్కరించే అధికారం అధికారులకు ఉంటుంది. నామపత్రాలను సక్రమంగా పూరించకపోయినా, అసంపూర్తి సమాచారమిచ్చినా, అభ్యర్థి సంతకం మారిపోయినా, పార్టీ బీఫాô దక్కకపోయినా నామినేషన్‌ తిరస్కరించే అవకాశం ఉంటుంది. గుర్తింపు పొందిన పార్టీ నుంచి నామినేషన్‌ వేసిన వ్యక్తికి పార్టీ బీఫాం ఇవ్వకపోయినా అప్పటికే పది మంది ప్రతిపాదించి ఉంటే స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయటానికి అర్హులవుతారు.


షరతులు వర్తిస్తాయ్‌..

  • ఆదాయం వచ్చే ప్రభుత్వ పదవిలో అభ్యర్థి ఉండకూడదు.
  • నేరారోపణ రుజువై ఉండకూడదు. దివాళా తీసి ఉండకూడదు.
  • ఎస్సీ, ఎస్టీ అయితే రూ.12,500, మిగతావారు రూ.25వేల డిపాజిట్‌ను బ్యాంకు చలానా రూపంలో  చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కుల ధ్రువపత్రం సమర్పించాలి.
  • అభ్యర్థి తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి. అందులోంచే ఎన్నికలకు ఖర్చు చేయాలి. వాటికి  సంబంధించిన వివరాలు విధిగా సదరు ఆర్‌ఓకు అందించాల్సి ఉంటుంది.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని