logo

రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి మృతి

అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి..

Published : 30 Apr 2024 04:46 IST

వెంకటేశ్వరరావు

అశ్వాపురం, న్యూస్‌టుడే: అశ్వాపురంలో ఆదివారం రాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో భారజల ప్లాంటు ఉద్యోగి సలిగంజి వెంకటేశ్వరరావు(54) మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి.. వెంకటేశ్వరరావు భారజల ప్లాంటులో క్యాంటీన్‌ అటెండర్‌గా పని చేస్తున్నారు. గౌతమీనగర్‌లోని తుంగభద్రలో ఉంటారు. ఇతనికి భార్య, ముగ్గురు పిల్లలున్నారు. ఆదివారం రాత్రి విధులు ముగించుకొని తిరిగి వస్తూ అశ్వాపురం మండల కేంద్రంలోని ఓ బేకరీలోకి వెళ్లారు. తరవాత రోడ్డుపై నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. అదే సమయంలో భారజల ప్లాంటు మరో ఉద్యోగి డ్యూటీ నుంచి స్కూటీపై ఇంటికి తిరిగి వస్తూ వెంకటేశ్వరరావును వేగంగా ఢీకొట్టారు. కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే గౌతమీనగర్‌లోని భారజల ప్లాంటు ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యచికిత్స కోసం హైదరాబాద్‌ తరలిస్తుండగా మార్గం మధ్యలోనే రక్తపు వాంతులు కావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందారు. భార్య నాగమణి ఫిర్యాదు మేరకు సీఐ జి.అశోక్‌రెడ్డి జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


సుభాష్‌నగర్‌లో వృద్ధుడు..

ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన ప్రకారం.. సుదిమళ్ల పంచాయతీ పాతనర్సాపురం గ్రామానికి చెందిన ఈసం కృష్ణ (68) సోమవారం సాయంత్రం సుభాష్‌నగర్‌లో రోడ్డు దాటుతుండగా కొత్తగూడెం నుంచి ఇల్లెందు వైపు వస్తున్న లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడ్డ అతణ్ని కుటుంబ సభ్యులు కొత్తగూడెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. కృష్ణ భార్య కొన్నాళ్లక్రితం చనిపోయింది. బాలాజీనగర్‌లోని మేనల్లుడి ఇంటివద్ద ఉంటూ చిన్నచిన్న చేసుకుంటూ జీవనం సాగించేవాడు. మేనల్లుడు అఖిల్‌ ఫిర్యాదు మేరకు సీఐ కరుణాకర్‌ కేసు విచారణ చేస్తున్నారు.


చెరువులో పడి వ్యక్తి మృత్యువాత

గోపాల్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: మండలంలోని ఆర్లగూడెం కొంగవాగు చెరువులో పడి మర్మం గోపాల్‌(48) అనే వ్యక్తి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం గ్రామశివారులోని చెరువులో చేపల వేట కోసం స్థానికులతో కలిసి గోపాల్‌ వెళ్లారు. వేట అనంతరం గ్రామస్థులు ఎవరికివారుగా ఇళ్లకు చేరుకున్నారు. రాత్రయినా గోపాల్‌ ఇంటికి రాకపోవడంతో ఆయన ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికినా ఫలితం దక్కలేదు. సోమవారం ఉదయం స్థానికులు చెరువులో గోపాల్‌ మృతదేహాన్ని గుర్తించారు. నీటి లోతులోకి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడని గ్రామస్థులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని