logo

త్రిముఖ వ్యూహం.. గెలుపే లక్ష్యం

ఖమ్మం లోక్‌సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని  ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది.

Updated : 30 Apr 2024 06:54 IST

4న కొత్తగూడెం రానున్న సీఎం రేవంత్‌రెడ్డి

ఖమ్మంలో  మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, చిత్రంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి తదితరులు

ఈటీవీ, ఖమ్మం: ఖమ్మం లోక్‌సభ స్థానంలో పాగా వేయటమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. అభ్యర్థిని  ఆలస్యంగా ప్రకటించినా క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం, నియోజకవర్గాల వారీగా నాయకుల ప్రచారం కలిసొస్తుందని అంచనా వేస్తోంది. కొత్తగూడెంలో శనివారం నిర్వహించే భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి హాజరై పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపుతారని భావిస్తోంది. ముఖ్యమంత్రి సభను విజయవంతం చేసేందుకు లోక్‌సభ స్థానం కాంగ్రెస్‌ ఎన్నికల ఇన్‌ఛార్జి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ప్రచారం, నాయకుల మధ్య సమన్వయం కోసం జిల్లా సమన్వయ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

కలిసికట్టుగా మంత్రులు : లోకసభ ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి ముగ్గురు మంత్రులు దిగటంతో కాంగ్రెస్‌ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఖమ్మం లోక్‌సభ స్థానం సీటును తమ కుటుంబీకులకు దక్కించుకోవాలని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆశించారు. అనేక సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం పొంగులేటి వియ్యంకుడు    రామసహాయం రఘురాంరెడ్డికి దక్కింది. అయినా ఈ స్థానంలో అత్యధిక మెజార్టీ సాధించాలనే సంకల్పంతో ముగ్గురు మంత్రులు సోమవారం ఒకే వేదికపైకి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క నివాసంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,    పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మిగతా నాలుగు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించారు. పది రోజుల పాటు క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉద్ధృతంగా సాగించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేలు మట్టా రాగమయి, మాలోత్‌ రాందాస్‌నాయక్‌, జారె ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.

దుగ్గొండి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని, అభ్యర్థులను గెలిపించాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. వరంగల్‌ జిల్లా దుగ్గొండి మండలం గిర్నిబావిలో సోమవారం నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆగస్టు 15లోగా రైతులకు రూ.2లక్షల చొప్పున రుణాలను మాఫీ చేస్తామన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానాన్ని అభివృద్ధి చేసే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బలరాంనాయక్‌కు ఓటు వేస్తే రాహుల్‌గాంధీకి   వేసినట్టేనని పేర్కొన్నారు. బలరాంనాయక్‌ మాట్లాడుతూ తనను  గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉంటూ మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానం అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని