logo

అత్యధిక మెజార్టీ నామాదే!

ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం.

Updated : 30 Apr 2024 06:16 IST

ఖమ్మం నగరం, మధిర, న్యూస్‌టుడే: ఖమ్మం లోక్‌సభ స్థానంలో ఇప్పటి వరకు పదిహేడు సార్లు ఎన్నికలు జరిగాయి. నాలుగుసార్లు పోటీ చేసి రెండుసార్లు గెలిచిన నామా నాగేశ్వరరావు 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. 2019 ఎన్నికల్లో తెరాస(భారాస) నుంచి పోటీ చేసిన నామా తన సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఈ ఎన్నికల్లో నామా నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు రాగా, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. తాజాగా నామా నాగేశ్వరరావు ఐదోసారి ఎన్నికల బరిలో నిలిచారు.

  • ఖమ్మం లోక్‌సభ స్థానంలో 1957 ఎన్నికల్లో అత్యల్పంగా 5,537 ఓట్ల మెజార్టీతో పీడీఎఫ్‌(పీపుల్స్‌ డెమోక్రటిక్‌ ఫ్రంట్‌) అభ్యర్థి టి.బి.విఠల్‌రావు సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి కేకే రావుపై గెలుపొందారు.
  • 1991 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడు సమీప సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రంపై 5,918 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత 1996 ఎన్నికల్లో సీపీఎం అభ్యర్థి తమ్మినేని వీరభద్రం సమీప కాంగ్రెస్‌ అభ్యర్థి పీవీ రంగయ్య నాయుడుపై 63,291 ఓట్ల మెజార్టీతో గెలుపొందటం విశేషం.
  • 1999 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి తెదేపా అభ్యర్థి మద్దినేని బేబీ స్వర్ణకుమారిపై 8,398 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరి తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 1,08,888 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి నామా, కాంగ్రెస్‌ అభ్యర్థి రేణుకాచౌదరిపై 1,24,448 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
  • 2014 ఎన్నికల్లో వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావుపై 11,974 ఓట్ల మెజార్టీతో విజయం దక్కించుకున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డికి 4,21,957 ఓట్లు రాగా, నామా నాగేశ్వరరావుకు 4,09,983 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థి నారాయణకు 1,87,653 ఓట్లు దక్కాయి.
  • 2014 ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు మధ్య చివరి రౌండ్‌ వరకు విజయం దోబూచులాడింది. ఓట్ల లెకింపులో మొదటి నుంచి తెదేపా అభ్యర్థి నామా నాగేశ్వరరావు స్వల్ప ఆధిక్యం సాధిస్తూ వచ్చారు. చివరికి మధిర అసెంబ్లీ నియోజకవర్గంలో ఎర్రుపాలెం, మధిర మండలాల ఓట్లు లెక్కింపు పూర్తయిన తర్వాత వైకాపా అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని  11.974 ఓట్ల ఆధిక్యంతో విజయం వరించింది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు