logo

వేగంగా ఉద్యోగాల్లో స్థిరపడే పాలిటెక్నిక్‌

సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది.

Published : 20 Apr 2024 02:00 IST

పాల్వంచ, న్యూస్‌టుడే: సాంకేతిక విద్య అభ్యసించే వారికి సాధారణ కోర్సుల వారితో పోల్చితే ఉద్యోగావకాశాలు, జీతభత్యాలు ఎక్కువ. ప్రస్తుతం నిరుద్యోగిత ప్రబలుతున్న నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో కోర్సుల ఎంపికపై శ్రద్ధ పెరిగింది. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో సాంకేతిక విద్య దిశగా అడుగులు వేసేందుకు పాలి‘టెక్నిక్‌’ వైపు మళ్లుతుండటం విశేషం.

పదో తరగతి పూర్తయిన తర్వాత పాలిటెక్నిక్‌ కోర్సు పూర్తిచేస్తే మూణ్నాలుగేళ్లలో, మంచి ఉద్యోగంలో స్థిరపడవచ్చు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగాల్లోనూ నేడు అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ఎంచుకున్న విభాగం ఆధారంగా ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. ప్రతిభావంతులైతే కొలువు సాధనకు పెద్దగా సమయం పట్టదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ రంగంలో నీటిపారుదల, ప్రజారోగ్యం, ఇంజినీరింగ్‌, రోడ్లు, భవనాల శాఖ, టీఎస్‌ ఆర్టీసీ, టీఎస్‌ జెన్కో తదితర సంస్థల్లో నైపుణ్య కొలువులు ఎక్కువగా భర్తీ చేస్తుంటారు. ప్రైవేటు కార్పొరేట్‌ సంస్థలు, పరిశ్రమలు సూపర్‌వైజర్‌ స్థాయి ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. వీటిల్లో ప్రాంగణ నియామకాలతో భర్తీ అయ్యే పోస్టులు ఎక్కువ. మంచి మార్కులు, కావాల్సిన అదనపు వృత్తి నైపుణ్యాలు సాధిస్తే నెలకు రూ.లక్షల్లో వేతనం పొందవచ్చు. కోర్సు పూర్తిచేసిన వారు బీటెక్‌లో రెండో సంవత్సరంలోనూ ప్రవేశం పొందే వీలుంటుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో చదువుకునే వారికి సింగరేణి భర్తీ చేస్తే పోస్టుల్లో స్థానిక రిజర్వేషన్‌ వర్తిస్తుంది. పాలిటెక్నిక్‌ చదివిన వారికి మరిన్ని ఉద్యోగావకాశాలు దక్కే వీలుంది. ఇటీవల కూడా వందల ఉద్యోగాల భర్తీకి ఆ సంస్థ నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇలాంటి ప్రయోజనాలున్న పాలిటెక్నిక్‌లో చేరేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నెల 22వ తేదీతో ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువు ముగియనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఆలస్యం చేయకుండా దరఖాస్తు చేయాలి.


పరీక్షలు ఇలా

  • ప్రశ్నపత్రం: తొమ్మిది, పదో తరగతి పాఠ్యాంశాల ఆధారంగా 150 మార్కులతో ప్రశ్నపత్రం రూపొందిస్తారు. దీంట్లో గణితం 60, భౌతికశాస్త్రం 30, బయాలజీ 30, రసాయన శాస్త్రానికి 30 మార్కులు ఉంటాయి. సమయం 2 గంటలు.
  • కళాశాలలు: మధిర, కొత్తగూడెం, మణుగూరులో ప్రభుత్వ కళాశాలలున్నాయి. వీటిల్లో 8 కోర్సుల్లో 780 సీట్లు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని మరో 9 ప్రైవేటు కళాశాలల్లో ఉన్న సీట్లు.. 1980.
  • ఫీజులు: ఎస్సీ, ఎస్టీలకు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాలి. ఈ నెల 24వ తేదీ వరకు రూ.100తో, ఈ నెల 26న తత్కాల్‌లో రూ.300 అపరాధ రుసుంతో ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకోవచ్చు.
  • పరీక్ష: 2024, మే 24న
  • ఫలితాలు: పరీక్ష రాసిన 12 రోజుల తర్వాత వెల్లడి

ఉపాధి, ఉన్నత విద్య అవకాశాలు

- నాగమునినాయక్‌, ‘పాలిసెట్‌’ జిల్లా కోఆర్డినేటర్‌, భద్రాద్రి

‘పాలిటెక్నిక్‌’ డిప్లొమా ఉత్తీర్ణుల్లో వంద శాతం మందికి ఉద్యోగావకాశాలున్నాయి. వృత్తివిద్యలో మంచి నైపుణ్యాలున్న వారెందరో దేశ, విదేశాల్లో ఉన్నతస్థాయి వేతనాలుగల ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న బ్రాంచీల్లో చేరేవారు, చదువుతో పాటు ఏకకాలంలో కావాల్సిన నైపుణ్యాలు నేర్చుకోవాలి. నేడు ఎన్నో ఆన్‌లైన్‌ వేదికలు స్కిల్స్‌ నేర్పిస్తున్నాయి. వీటన్నింటిని సద్వినియోగం చేసుకుని ఉత్తమ మార్కులు సాధిస్తే ప్రాంగణ నియామకాల్లో మంచి ప్రైవేటు కొలువులు సాధించడం సులువు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని