logo

దేశ యవనికపై అశ్వారావుపేట పూర్వ విద్యార్థులు సత్తా

దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు.

Published : 24 Apr 2024 06:15 IST

వ్యవసాయ శాస్త్రవేత్తలుగా ఎంపిక

       బి.శ్రీశైలం,                 బూరం మౌనిక,           వీసం హరిప్రియ

అశ్వారావుపేట, న్యూస్‌టుడే: దేశ యవనికపై అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా జరిగిన వ్యవసాయ శాస్త్రవేత్తల ఎంపికలో ఒకేసారి ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల విద్యార్థులు దేశంలో నలుమూలలా వ్యవసాయ శాస్త్రవేత్తలుగా, ఉన్నతాధికారులుగా, పలు రకాలుగా సేవలందిస్తూ సత్తా చాటుతున్నారు. ఐసీఏఆర్‌(ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌) ఆధ్వర్యంలో ఏఎస్‌ఆర్‌బీ (అగ్రికల్చర్‌ సైంటిస్ట్‌ రిక్రూట్‌మెంటు బోర్డు) ద్వారా జరిగిన పోటీల ఫలితాల్లో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. వారిలో బత్తుల శ్రీశైలం, వీసం హరిప్రియ, బూరం మౌనిక వ్యవసాయ విస్తరణ విభాగంలో ప్రధాన శాస్త్రవేత్తలుగా నియమితులయ్యారు.

  • ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలో గత ఏడాది మార్చి 14న పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 29వరకూ జరిగిన ముఖాముఖిలు నిర్వహించారు. ఆ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. 2014-18 వరకూ బత్తుల శ్రీశైలం, 2016-20 వరకూ బూరం మౌనిక, 2017-21 వరకూ వీసం హరిప్రియ అశ్వారావుపేటలో ఏజీబీఎస్సీ పూర్తి చేశారు. శ్రీశైలం ప్రస్తుతం హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తుండగా తాజా ఎంపికలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని లాంగ్‌డింగ్‌ కృషి విజ్ఞాన కేంద్రానికి శాస్త్రవేత్తగా నియమితులయ్యాడు. ఎన్డీఆర్‌ఐ కర్నాల్‌(హరియాణా)లో పీహెచ్‌డీ పూర్తి చేసిన మౌనిక సంత్‌పూర్‌ (కటక్‌) ఎన్‌ఆర్‌ఆర్‌ఐ కేంద్రానికి, పీహెచ్‌డీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న హరిప్రియ పశ్చిమబంగాలోని నదియా జిల్లాలోని కల్యాణికి నియమితులయ్యారు. ముగ్గురూ వ్యవసాయ విస్తరణ విభాగంలో శాస్త్రవేత్తలుగా ఎంపిక కావడం విశేషం. మొత్తం మీద ఏటా వివిధ విభాగాల్లో ముందుంటున్న అశ్వారావుపేట విద్యార్థులు తాజాగా మరోసారి సత్తా చాటడం పట్ల స్థానిక వ్యవసాయ కళాశాల ఏడీ హేమంత్‌కుమార్‌, ఆచార్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు