logo

అందరికీ ఆరోగ్యం.. అదే లక్ష్యం

ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు వివిధ రకాల ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా, ధ్యానం

Published : 20 May 2022 06:10 IST

జాతీయ ఆరోగ్యమిషన్‌ అధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం

మచిలీపట్నం కార్పొరేషన్‌, న్యూస్‌టుడే: ప్రస్తుత సమాజంలో ఎవరికి వారు వివిధ రకాల ఒత్తిళ్లతో ఇబ్బందులు పడుతూ వివిధ వ్యాధుల బారిన పడుతున్నారు. దైనందిన జీవితంలో వ్యాయామం, యోగా, ధ్యానం లాంటివాటిని భాగస్వామ్యం చేసుకుని క్రమం తప్పకుండా ఆచరిస్తే చాలా రోగాలకు దూరంగా ఉండొచ్చు. అందుకే జాతీయ ఆరోగ్యమిషన్‌ద్వారా వివిధ రకాల వ్యాయామాలపై అవగాహన కల్పించనున్నారు. దీనిలో భాగంగానే ఎరోబిక్స్‌, వివిధ రకాల వ్యాయామాలపై మిడ్‌లెవల్‌హెల్త్‌ప్రొవైడర్‌ (ఎంఎల్‌హెచ్‌పీ)లకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. 

ఏమి చేస్తారంటే..
ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం అమల్లో భాగంగా నియమించిన ఎంఎల్‌హెచ్‌పీలు జిల్లా వైద్యఆరోగ్యశాఖ నిర్వహించే  కార్యక్రమాల్లో భాగస్వాములు కావడంతోపాటు వారికి ప్రత్యేకంగా కేటాయించిన విధులు కూడా నిర్వహించాలి. ప్రధానంగా బీపీ, మధుమేహంతోపాటు కంటి సంబంధిత సమస్యలు వివిధ వ్యాధులు ఉన్నవారికి స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించి వారి ఆరోగ్య వివరాలను నమోదు చేస్తారు. వారికి ప్రతి నెలా ఇచ్చే మందులు సక్రమంగా పంపిణీ చేయడంతోపాటు వాటిని ఈఔషధ పోర్టల్లో ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆరోగ్యకేంద్రానికి వచ్చే రోగుల సమస్య తెలుసుకుని సంబంధిత విభాగ వైద్యునితో టెలీకన్సల్టేషన్‌ ద్వారా సంప్రదించి వారి సూచన మేరకు సేవలు అందించడంతోపాటు మందులు పంపిణీ చేస్తారు. ఆరోగ్యకేంద్రానికి ఎంతమంది రోగులు వచ్చారు..ఎలాంటి అనారోగ్య సమస్యలు గుర్తించారు..ఎలాంటి సేవలు అందించారు..ఇలా అన్ని అంశాలను రోజువారీగా సంబంధిత యాప్‌లలో నమోదు చేయాలి. గర్భిణులకు నిర్వహించే పరీక్షలు, అందించే పౌష్టికాహారం, ఇమ్యునైజేషన్‌ తదితర వివరాలను నమోదు చేయడంతోపాటు రోగులకు సత్వర సేవలు అందించాలి. వారి పరిధిలోని ప్రజలకు యోగా, ధ్యానంపై శిక్షణ ఇవ్వడంతోపాటు వారు  రోజూ అనుసరించేలా పర్యవేక్షించాలి. ఇలా రోగులకు సేవలు అందించడంతోపాటు వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలను చైతన్యం చేయాలి.

 జిల్లాకు 239 కంప్యూటర్లు

 జిల్లాలో మొత్తం 239మంది ఎంఎల్‌హెచ్‌పీలను నియమించారు. వారికి ఒక్కొక్కరికీ ఒక్కో కంప్యూటర్‌ చొప్పున అందించేందుకు జిల్లా వైద్యఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాకు 239 కంప్యూటర్లు కేటాయించగా అవి మచిలీపట్నంలోని డీఎంహెచ్‌వో కార్యాలయానికి చేరాయి. వాటిని జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎంఎల్‌హెచ్‌పీలు అందరికీ పంపిణీ చేసే ప్రక్రియ ప్రారంభించారు. దీంతో గత కొన్ని రోజులుగా పలు ప్రాంతాలనుంచి వచ్చే  ఎంఎల్‌హెచ్‌పీలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం సందడిగా ఉంది. ఇప్పటివరకు 170మందికి పంపిణీ చేశామని డీఎంహెచ్‌వో గీతాబాయి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని