logo

సీమ హక్కుల సాధనకు న్యాయ పోరాటం

కర్నూలు నగరంలో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జనకు వైకాపా, ఐకాస నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలై సభ మధ్యాహ్నం వరకు కొనసాగింది.

Updated : 06 Dec 2022 04:24 IST

రాయలసీమ గర్జనలో నేతల పిలుపు

సభలో మాట్లాడుతున్న ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, వేదికపై మేయర్‌ బీవై రామయ్య

కర్నూలు నగరంలో సోమవారం నిర్వహించిన రాయలసీమ గర్జనకు వైకాపా, ఐకాస నేతలు, న్యాయవాదులు, విద్యార్థులు ర్యాలీగా వచ్చారు. ఉదయం 11 గంటలకు మొదలై సభ మధ్యాహ్నం వరకు కొనసాగింది. ఎండకు తాళలేక విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. కొందరు మధ్యలోనే వెళ్లిపోయారు.  కర్నూలుకు న్యాయ రాజధాని వస్తే అభివృద్ధి చెందుతుంది.. ఇందుకు అందరూ కలసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
న్యూస్‌టుడే బృందం

ఎవరు ఏమన్నారు

* వందేళ్లుగా రాయలసీమ అన్యాయానికి గురవుతోంది.. శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం రాయలసీమకు దక్కాల్సిన హక్కులపై పోరాటం చేస్తామని ఎంపీ సంజీవ్‌కుమార్‌ అన్నారు.
* న్యాయ రాజధాని కావాలా, వద్దా అని తెదేపా నేతలను ప్రశ్నిస్తున్నా? సీమకు న్యాయం జరగాలంటే ఎంతో అవసరమని ఎంపీ బ్రహ్మానందరెడ్డి అన్నారు.
* ఆరంభ శూరత్వం కాకుండా న్యాయ రాజధాని సాధించేంత వరకు ఉద్యమం కొనసాగించాలని ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి పిలుపునిచ్చారు.
* హక్కులు సాధించేందుకు ‘బలిదానం’ చేయాల్సి ఉంది.. మూడు రాజధానుల ఉద్యమాన్ని ఉద్ధృతంగా తీసుకెళ్తాం..చంద్రబాబుకు సహకరించేవారు రాయలసీమ ద్రోహులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ హెచ్చరించారు.
* రాయలసీమకు చంద్రబాబు ద్రోహం చేశారు.. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేక ఇతర ప్రాంతాల్లో బతకాల్సివస్తోందని శాప్‌ ఛైర్మన్‌ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.  
* కర్నూలుకు న్యాయరాజధాని వచ్చేంత వరకు ఉద్యమం కొనసాగుతుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు బి.వై.రామయ్య అన్నారు.
* ఐకాస అధ్యక్షుడు విజయకుమార్‌రెడ్డి, ఎన్జీవో జిల్లా అధ్యక్షుడు వెంగల్‌రెడ్డి, న్యాయవాది నాగలక్ష్మిదేవి, రవీంద్ర విద్యాసంస్థల డైరెక్టరు జి.పుల్లయ్య ,  ఎమ్మెల్యే డాక్టరు సుధాకర్‌ మాట్లాడారు.
* సమన్వయకర్త అమర్‌నాథరెడ్డి, ఎమ్మెల్యేలు శిల్పా చక్రపాణిరెడ్డి, శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, గంగుల బిజేంద్ర]నాథ్‌రెడ్డి, ఎర్రకోట చెన్నకేశవరెడ్డి, ఆర్థర్‌, ఎమ్మెల్సీలు ఇక్బాల్‌, గంగుల ప్రభాకర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌ సుభాష్‌ చంద్రబోస్‌, వైకాపా నగర అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి తెర్నేకల్‌ సురేంద్రరెడ్డి, ఐకాస ప్రతినిధులు డాక్టర్‌ సతీష్‌కుమార్‌, శ్రీరాములు, సునీల్‌కుమార్‌రెడ్డి, నక్కలమిట్ట శ్రీనివాసులు, వైకాపా నాయకులు, న్యాయవాదులు పాల్గొన్నారు.

ఎండకు తాళలేక ఇబ్బంది పడుతున్న మహిళలు

విద్యార్థులు.. మహిళా సంఘాలు.. కూలీలు

* సభకు రావాలని పొదుపు మహిళలను మెప్మా సిబ్బంది ఆదేశించారు.
ఉదయం 11 నుంచి 12 గంటల సమయంలో విద్యార్థులను ఆయా కళాశాలలకు చెందిన అధ్యాపక బృందం బస్సుల్లో తీసుకొని వెళ్లారు. ఎండకు తాళలేక విద్యార్థులు అల్లాడిపోయారు. అధ్యాపక బృందం విద్యార్థులకు నీళ్లు, బిస్కెట్‌ ప్యాకెట్లు ఇచ్చారు.
* పశ్చిమ ప్రాంతం నుంచి ప్రత్యేక వాహనాల్లో వ్యవసాయ కూలీలను తీసుకొచ్చారు. వారు వచ్చేసరికి సభ ముగిసింది.

అర్జీదారుల ఆపసోపాలు

రాయలసీమ గర్జన దృష్ట్యా ‘స్పందన’ను రద్దు చేయడంతో అర్జీదారులు ఆపసోపాలు పడ్డారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో చాలా మంది కలెక్టరేట్‌కు వచ్చారు. రద్దు విషయం తెలుసుకుని నిరాశతో ఇంటి బాట పట్టారు. అక్కడే కూర్చుని అర్జీ రాసేవారినీ పోలీసులు పంపించారు. ‘‘ సదరమ్‌ పత్రం సమస్య పరిష్కారం కోసం కౌతాళం నుంచి వచ్చా. కార్యక్రమాన్ని రద్దు చేశామంటున్నారు.. వ్యయప్రయాలతో ఇక్కడకు వచ్చాం. అర్జీ మాత్రమే తీసుకున్నారని ’’ రామకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు.
-న్యూస్‌టుడే, కర్నూలు బి.క్యాంపు

దారులు దిగ్బంధం

* కలెక్టరేట్‌ వైపు నుంచి రాజ్‌విహార్‌కు వచ్చేవారిని కృష్ణదేవరాయల సర్కిల్‌ వద్ద వాహనాలు, ఆటోలు నిలిపివేయడంతో కాలినడకన చేరుకోవాల్సి వచ్చింది.
* తెలంగాణ నుంచి కర్నూలు వచ్చే పాలమూరు కూలీలు సభ కారణంగా ఉపాధి కోల్పోయారు. మధ్యాహ్నం వరకు ఆర్‌ఎస్‌ కూడలి, బిర్లా సర్కిల్‌ వద్ద వేచి ఉండి తిరుగుపయనమయ్యారు.
* పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కావడంతో పెళ్లి బృందాలు సభ జరిగే పరిసరాల నుంచి కల్యాణ మండపాలకు వెళ్లాలన్నా, అటువైపు ఉన్న మండపాలకు చేరుకోవాలన్నా పోలీసులు వాహనాలు నిలిపి వేయడంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
* రాయలసీమ జిల్లాలు, ప్రకాశం, తెలంగాణ, కర్ణాటక నుంచి సోమవారం సర్వజన వైద్యశాలకు ఓపీ ఎక్కువగా ఉంటుంది. ట్రాఫిక్‌ ఆంక్షలతో  అవస్థలు పడుతూ చేరుకోవాల్సి వచ్చింది.

సచివాలయాలకు తాళం

నగర పరిధితో పాటు ఇతర గ్రామాలకు చెందిన వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లు సభకు హాజరయ్యారు. సిబ్బంది లేకపోవడంతో సచివాలయాలు వెలవెలబోయాయి. నగరంలోని 133 వార్డు సచివాలయాల్లో 3600 మంది వాలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో అధికశాతం మంది సభకు వెళ్లారు.
న్యూస్‌టుడే, నగరపాలక సంస్థ

తెదేపా నాయకులు అరెస్టు, విడుదల

టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు తిలక్‌లను కర్నూలు మూడో పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. సీమ గర్జన కార్యక్రమ నేపథ్యంలో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గర్జన ముగిసిన తర్వాత విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గర్జనతో రాయలసీమకు ఒరిగింది ఏమీ లేదన్నారు.పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. తెలుగుదేశం హయాంలోనే సీమలో అభివృద్ధి జరిగిందన్నారు.
జనం లేని గర్జన

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే: కర్నూలు నగరంలో ఎస్టీబీసీ కళాశాల మైదానంలో అధికార పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన వైకాపా వారి రాయలసీమ గర్జన జనం లేక వెలవెలబోయిందని కర్నూలు, నంద్యాల పార్లమెంటరీ తెదేపా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకటరెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో వారు పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు.  రాయలసీమ గర్జన పేరుతో మూడు జిల్లాల నుంచి జనసమీకరణ చేస్తామన్నారు. గత నెలలో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు వచ్చిన జనంలో పదో వంతు హాజరు కాలేదన్నారు. విద్యార్థులు, పొదుపు సంఘాల మహిళలను బలవంతంగా సభకు తరలించారు.. జనం లేక సభ ఫెయిల్‌ అయ్యిందన్నారు. సభకు జనాలు వచ్చిదాన్ని బట్టి చూస్తే సీఎం జగన్‌రెడ్డి చేస్తున్న మోసపూరిత పాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టమైందన్నారు. ముఖ్యమంత్రి తీరు వల్లే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయన్నారు. సీమ జిల్లాలకు నీరందించే హంద్రీనీవా నిర్వహణకు రూ.20 కోట్లు చెల్లించకుండా నీటిని నిలుపుదల చేయించిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. నిధుల్లేక పలు ప్రాజెక్టుల ప్రగతి ఆగిపోయిందన్నారు. సమావేశంలో తెదేపా నాయకులు పెరుగు పురుషోత్తంరెడ్డి, ప్రభాకర్‌ యాదవ్‌, నాగేంద్రకుమార్‌, సోమిశెట్టి నవీన్‌, ప్రభాకర్‌ యాదవ్‌, సంజీవలక్ష్మి, హనుమంతరావు చౌదరి, సత్రం రామకృష్ణుడు, బాబురావు, మారెన్న పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని