logo

జనం గుండెల్లో జగన్‌ విల్లం‘భూ’

ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది.

Updated : 18 Apr 2024 05:13 IST

రిజిస్ట్రేషన్‌ రుసుములను పెంచిన సర్కారు
స్థిరాస్తి కొనుగోలుదారులపై పెనుభారం
నాలుగేళ్లలో రూ.1,628.28 కోట్ల వసూలు
కర్నూలు గాయత్రి ఎస్టేట్‌, న్యూస్‌టుడే

జగనన్న జమానాలో సంపద సృష్టించటం తెలియదు.. ఉపాధి కల్పించడం ఇష్టం ఉండదు.. అభివృద్ధి అసలే గిట్టదు.. ఆదాయం కోసం జనాలపై పడ్డారు.. సందు దొరికితే చాలు బాదేస్తున్నారు.. ప్రజల నుంచి ఏదోరూపంలో పిండుకుంటున్నారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లే అందుకు నిలువెత్తు సాక్ష్యం.’’


‘‘ 2019 ఏడాదికి ముందు ఏటా ఆగస్టులో పట్టణాల్లో భూ విలువలు సవరించేవారు. గ్రామీణ ప్రాంతాల్లో రెండేళ్లకు ఒకసారి మార్పులు చేసేవారు. వైకాపా వచ్చాక వాటికి తిలోదకాలిచ్చింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా గుడిసె నుంచి బహుళ అంతస్తుల భవనాల వరకు అన్నిరకాల నిర్మాణాల విలువలు పెంచేసింది.

ప్రాజెక్టులు నిర్మించలేదు.. పరిశ్రమలు ఏర్పాటు లేదు.. రోడ్లు లేవు.. పల్లె మొదలు పట్టణం వరకు ప్ర‘గతి’ తప్పింది. ఫలితంగా స్థిరాస్తి రంగం కుప్పకూలింది. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి అప్పులవేట సాగిస్తున్న జగన్‌ సర్కారు... రాబడి కోసం రిజిస్ట్రేషన్ల శాఖను బంగారుబాతుగా ఎంచుకుంది. అడ్డగోలుగా ఫీజులను పెంచేసి ప్రజల నుంచి రుసుములను పిండేస్తోంది. ఆస్తుల క్రయవిక్రయదారులపై విపరీతమైన భారాన్ని మోపుతోంది. వైకాపా ప్రభుత్వం ఏర్పడ్డాక మార్కెట్‌ విలువలను తొలుత 2020లో సవరించారు. కొవిడ్‌ కారణంగా 2021లో సవరించలేదు. వాస్తవానికి ఈ మార్కెట్‌ విలువలను పట్టణ ప్రాంతాల్లో ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి, గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రతి రెండేళ్లకోసారి ఆగస్టు ఒకటో తేదీ నుంచే సవరిస్తారు. కట్టడాల (స్ట్రక్చర్స్‌) విలువలను ఏడాదికోసారి మారుస్తారు. ఇది మధ్య తరగతి వర్గాల వారికి శరాఘాతంగా పరిణమించింది. వైకాపా అధికారంలోకి వచ్చినప్పుడు ఉన్న రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి కంటే ప్రస్తుతం రెండున్నర రెట్లు పెరగడం గమనార్హం.

పల్లెల్లో బాదేశారు

ఉమ్మడి జిల్లాలోని 973 గ్రామాల పరిధిలో చేపట్టే అన్ని నిర్మాణాల రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు ఒక చదరపు అడుగుకు రూ.900 నుంచి రూ.1400 వరకు పెరిగాయి. సగటున 100 చదరపు అడుగుల ఇంటికి రూ.1.40 లక్షల విలువ కట్టారు. ఈ విలువలో 6.5 శాతం స్టాంప్‌ డ్యూటీ ప్రకారం రూ.9,100 చెల్లించాలి. ఇదే నిర్మాణానికి పాత విలువ ప్రకారం రూ.5,850 చెల్లించేవారు. పెంచిన విలువ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి భవన నిర్మాణంపై రూ.3,250 అదనపు భారం పడినట్లయ్యింది.

గతేడాది మూడుసార్లు

ఉమ్మడి జిల్లాలో 24 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వీటి ద్వారా గడిచిన నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.1,628.28 కోట్ల ఆదాయం సమకూరింది. గతేడాదే మూడుసార్లు రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు పెంచారు. గతేడాది జూన్‌లో భవనాల విలువలను పెంచడంతో ప్రభుత్వం కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కలిపి సుమారు రూ.25 కోట్ల ఆదాయం సమకూర్చుకొంది. గతేడాది జూన్‌ 1 నుంచే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భూముల విలువ పెంచేసింది. అదే నెల 25న మరోసారి యూజర్‌ ఛార్జీలు పెంచింది. ఈ ఛార్జీల రూపంలో మరో రూ.10 కోట్ల ఆదాయం రాబట్టింది.

కుడా ఆదాయ కుండ

  • గతేడాది జూన్‌ 1 నుంచి కుడా (కర్నూలు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ) పరిధిలో భూమి విలువను 20 శాతం పెంచారు. నంద్యాల పట్టణ శివారులోని కానాలలో సగటున ఎకరా భూమి విలువ రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఉండేది. దీన్ని ఏకంగా రూ.80 లక్షలకు పెంచారు. రుద్రవరం, దొర్నిపాడు, ఉయ్యాలవాడ మండలాల్లో ఎకరా విలువ రూ.10 లక్షలు ఉంటే రూ.12 లక్షలకు పెంచారు. కుడా పరిధిలో పెరిగిన భూమి విలువ ప్రకారం ఎకరం భూమి ధర కొన్నిచోట్ల 100 శాతం పెరిగింది. రూ.10 లక్షలు ఉన్న భూమికి రూ.20 లక్షలకు విలువ కట్టారు. పాత ధరల ప్రకారం రూ.65 వేలు ఉన్న స్టాంపు డ్యూటీ రూ.1.30 లక్షలు చెల్లించాల్సి వస్తోంది.
  • కల్లూరు మండలంలోని చెట్లమల్లాపురం, చిన్నటేకూరు, బస్తిపాడు, లక్ష్మీపురం తదితర గ్రామాల్లో ఎకరం భూమి విలువ రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు ఉంటే కొన్ని సర్వే నంబర్లలో భూముల విలువను ఏకంగా రూ.1.21 కోట్లకు పెంచారు.  
  • కర్నూలు నగర శివారులోని జొహరాపురంలో రూ.5 వేల నుంచి రూ.10 వేలకు విలువలను సవరించగా బి.తాండ్రపాడులో చదరపు గజం రూ.1,800 నుంచి రూ.3,500, మామిదాలపాడులో చదరపు గజం రూ.6 వేలు ఉండగా రూ.10 వేలకు పెంచారు.
  • నంద్యాల రైతునగరం, క్రాంతినగర్‌ తదితర ప్రాంతాల్లో చదరపు గజం భూమి విలువ రూ.వెయ్యి ఉంటే రూ.2 వేలకు పెంచారు. దీంతో ఏటా రూ.70 కోట్ల వరకు ప్రజలపై అదనపు భారం పడుతోంది.

అందరూ వాటా చెల్లించాల్సిందే

డెవలప్‌మెంట్‌ అగ్రిమెంట్‌ రిజిస్ట్రేషన్‌కు ఇప్పటివరకు మార్కెట్‌ విలువలో ఒక శాతం స్టాంప్‌ డ్యూటీగా చెల్లించేవారు. దీన్ని వైకాపా ప్రభుత్వం రెండేళ్ల కిందట సవరించింది. అభివృద్ధి కోసం ఇచ్చిన స్థలానికి సంబంధించి ఒకరి కంటే ఎక్కువ మంది యజమానులు ఉండి.. వారు తమ వాటాకు వచ్చే ప్లాట్లను వేర్వేరుగా పంచుకుంటారని ఒప్పందంలో ఉంటే.. వారంతా ఒప్పంద విలువలో 4 శాతం చొప్పున స్టాంప్‌ డ్యూటీ చెల్లించాలనే నిబంధన పెట్టింది. దీంతో కర్నూలు నగరంతోపాటు నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు వంటి పట్టణాల్లో బహుళ అంతస్తుల్ని నిర్మించే నిర్మాణదారులు, ప్లాట్ల యజమానులకు ఇబ్బందులు తప్పడం లేదు.


పట్టణంలో పిండేశారు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో చదరపు అడుగు విలువను రూ.1,200 నుంచి రూ.1,400కు పెంచారు. గ్రామాల్లో రూ.900 నుంచి రూ.1,400కు పెంచారు. దీంతో పట్టణాల్లో 20 శాతం, గ్రామాల్లో 40 శాతం పెరిగింది. పెరిగిన విలువ ప్రకారం కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోన్‌ తదితర పట్టణాల్లో సగటున 200 చదరపు అడుగుల ఇంటికి రూ.2.80 లక్షల విలువ కట్టారు. ఈ విలువలో 7.5 శాతం స్టాంప్‌ డ్యూటీ ప్రకారం రూ.21 వేలు చెల్లించాలి. ఇదే పాత విలువ ప్రకారమైతే రూ.15,600 చెల్లించేవారు. 200 చదరపు అడుగుల ఇంటికి రూ.2,600 అదనపు భారం పడగా...100 చదరపు అడుగుల నిర్మాణంపై రూ.1300 భారం పడింది. ఒక చదరపు అడుగుకు రూ.13 చొప్పున అదనంగా భారం వేశారు.’’
‘‘ కర్నూలులోని వెంకటరమణ కాలనీలో 2 వేల చదరపు అడుగుల ఇంటికి రూ.1,400 ధరతో లెక్క కడితే దాని విలువ రూ.28 లక్షలు అవుతుంది. ఈ మొత్తంలో 7.5 శాతం ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాలంటే రూ.2.10 లక్షలు అవుతుంది. ఇదే ఇంటికి గతంలో రూ.1.56 లక్షలు మాత్రమే ఉండేది. పెరిగిన ధరల ప్రకారం రూ.26 వేలు అదనపు భారం పడింది. కర్నూలులోని అశోక్‌నగర్‌ వాణిజ్య ప్రదేశంలో చదరపు గజం విలువ రూ.15 వేలు ఉంటే రూ.30 వేలకు పెంచారు. నంద్యాల, ఆదోని, డోన్‌, ఎమ్మిగనూరు, ఆత్మకూరు, నందికొట్కూరు మున్సిపాల్టీల్లోనూ ఇవే ధరలున్నాయి.’’


భాగపంపకాలపైనా భారం

కుటుంబ సభ్యుల మధ్య భాగ పరిష్కార ఆస్తులకు సంబంధించి గతంలో 0.5 శాతం మాత్రమే స్టాంపు డ్యూటీ ఉండేది. ఉదాహరణకు రూ.లక్ష విలువ చేసే ఆస్తికి రూ.500 మాత్రమే స్టాంపు డ్యూటీగా చెల్లించేవారు. కానీ గతేడాది జూన్‌ 1 నుంచి ఈ స్టాంపు డ్యూటీని రాష్ట్ర ప్రభుత్వం 3 శాతానికి పెంచింది. ఈ ప్రకారం రూ.లక్ష విలువ చేసే ఆస్తికి రూ.3 వేలు చెల్లించాల్సి వస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని