logo

జగనన్న వెన్నుపోటు.. పల్లెల తిరుగుబాటు

ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి..

Published : 24 Apr 2024 05:22 IST

నేడు పంచాయతీరాజ్‌ దినోత్సవం
ఈనాడు, కర్నూలు

కర్నూలు రాజ్‌విహార్‌ సెంటర్‌లో 2022 ఏప్రిల్‌ 5వ తేదీన భిక్షాటన చేస్తున్న సర్పంచులు

ప్రస్తుతం పల్లెలు కష్టాల కొలిమిలో కొట్టుమిట్టాడుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం నిర్వాకంతో సమస్యలతో సతమతమవుతున్నాయి. కనీసం కుళాయి బిగించేందుకు కూడా చిల్లర లేని పరిస్థితి. కేంద్రం నుంచి వచ్చే నిధులను సైతం మళ్లించి.. గ్రామాల అభివృద్ధి వెనక్కునెట్టారు. కనీసం మురుగు కాల్వల్లో పూడిక తొలగించేందుకు కూడా చిల్లిగవ్వ లేదు. కరెంటు బిల్లులు చెల్లించలేక పంచయాతీలు చీకట్లో మగ్గతున్నాయి. దారులు వెక్కిరిస్తున్నాయి.. కాల్వలు లేక మురుగు వీధుల్లో పరుగు పెడుతోంది. కుళాయిల్లో నీటిబొట్టు రాలడం లేదు. గ్రామ ప్రథమ పౌరుడికి ఉదయం లేస్తే పల్లెజనాల తిట్ల దండకం వినక తప్పడం లేదు. కొందరు సర్పంచులు వారే స్వయంగా మురుగు కాల్వలు శుభ్రం చేసిన దాఖలాలూ లేకపోలేదు. విసుగెత్తిన సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రభుత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. బుధవారం పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా గ్రామాల ప్రథమ పౌరుల తిరుగుబాటు గుర్తుచేస్తూ..

కర్నూలు కలెక్టరేట్‌ వద్ద 2023 జూన్‌ 24న ధర్నా చేపట్టారు. కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు. అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ.. నిధులు కేటాయించాలని అధికారుల కాళ్లుపట్టుకుని వేడుకున్నారు.


సర్కారు తీరుపై నిరసన

ఆదోని గ్రామీణం, న్యూస్‌టుడే: పంచాయతీలకు నిధులు కేటాయించాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ చాంబర్‌, ఆదోని డివిజన్‌ సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో 2022 సెప్టెంబరు 19న నిరసన చేపట్టారు.


జోలెపట్టి.. సాయం కోరి

నందికొట్కూరు గ్రామీణం, న్యూస్‌టుడే: వడ్డెమాను గ్రామంలో చేసిన పనులకు బిల్లులు మంజూరు కాకపోవడంతో గత ఏడాది ఆ గ్రామ సర్పంచి రామచంద్రుడు జోలెపట్టి భిక్షాటన చేసి నిరసన తెలిపారు. గ్రామంలో మురుగుకాలువలు, తాగునీటి పైప్‌లైన్‌, ట్యాంక్‌ల నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర గ్రామాభివృద్ధి పనులకోసం రూ.9లక్షలు అప్పు చేసి ఖర్చు చేశారు. ఆ బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడ్డాడరు. రెండేళ్లు వడ్డీలు చెల్లించక తప్పలేదని


ప్రభుత్వం తప్పులు.. మాకు అప్పులు

దేవనకొండ, న్యూస్‌టుడే: ప్రభుత్వం చేసిన తప్పుతో సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులకు అప్పులే మిగిలాయని  జులై 21న ఎంపీడీవో కార్యాలయంలోని మండల సభలో నేలపై కూర్చుని నిరసన తెలిపారు. మండల సర్వసభ్య సమావేశాలను బహిష్కరించారు.


పైసా విలువలేదు

హాలహర్వి, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం నిధులన్నీ దారిమళ్లించి.. సర్పంచులకు పల్లెల్లో పైసా విలువలేకుండా చేశారని 2022 సంవత్సరం సెప్టెంబర్‌ 7తేదీన హొళగుంద ఎంపీడీవో కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశంలో నిరసన తెలిపారు.

  • హాలహర్వి మండల సమావేశంలో సభ్యులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమావేశాన్ని బహిష్కరించారు.

నిధులకు మోకాళ్లడ్డు

ఆలూరు, న్యూస్‌టుడే: పంచాయతీ నిధులు మళ్లించడాన్ని వ్యతిరేకిస్తూ.. ఆలూరు అంబేడ్కర్‌ కూడలిలో ఆలూరు, మొలగవల్లి, మరకట్టు సర్పంచులు, మొలగవల్లి ఎంపీటీసీ సభ్యుడు 2023 అక్టోబరు 2వ తేదీన గాంధీ చిత్ర పటంతో నోటికి నల్ల గుడ్డలు కట్టుకుని, మోకాళ్ల కూర్చుని నిరసన తెలిపారు.


ఖజానా ఖాళీ

గోనెగండ్ల, న్యూస్‌టుడే: గోనెగండ్ల మేజర్‌ పంచాయతీకి రావాల్సిన రూ.1.90 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లించిందని 2022 ఏప్రిల్‌ 7వ తేదీన మేజరు పంచాయతీ సర్పంచి హైమావతి గ్రామంలో భిక్షాటన చేసి నిరసన తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రూ.20 లక్షలు అప్పులు చేసినట్లు చెప్పారు. ఇంతవరకు చేసిన పనులకు బిల్లులు విడుదల కాలేదని వాపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని