logo

అకస్మాత్తుగా తెరచుకున్న క్రూయిజర్‌ తలుపు

తలుపు తెరుచుకోగా క్రూయిజర్‌ వాహనంలో నుంచి కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం

Published : 12 Aug 2022 03:16 IST

కిందపడి చిన్నారి మృత్యువాత

వెల్దండ గ్రామీణం, న్యూస్‌టుడే : తలుపు తెరుచుకోగా క్రూయిజర్‌ వాహనంలో నుంచి కిందపడి నాలుగేళ్ల చిన్నారి మృతిచెందిన సంఘటన గురువారం నాగర్‌కర్నూల్‌ జిల్లా వెల్దండ మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. పెద్దకొత్తపల్లి మండలం మారేడ్‌దిన్నెకు చెందిన కేతావత్‌ అనిత, రాజు దంపతులు బతుకుదెరువు కోసం హైదరాబాదుకు వలస వెళ్లారు. మేస్త్రీ, కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడున్నారు. మైసమ్మ ఉత్సవాలు కోసం గురువారం పెద్ద కుమార్తె కేతావత్‌ స్నేహ(4), నానమ్మ శాంతమ్మ, మేనత్త పద్మ సొంతూరుకు హైదరాబాదు నుంచి క్రూయిజర్‌ వాహనంలో బయలుదేరారు. హైదరాబాద్‌- శ్రీశైలం జాతీయ రహదారిపై వెల్దండ మండలం పెద్దాపూర్‌ దగ్గర అకస్మాత్తుగా క్రూయిజర్‌ తలుపు తెరుచుకోవడంతో స్నేహ కింద పడిపోయింది. ప్రమాదంలో బలమైన గాయాలై అపస్మారక స్థితికి చేరడంతో అదే వాహనంలో చికిత్సకు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు.. చిన్నారి స్నేహ అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఎస్సై నర్సింహులును వివరణ కోరగా.. ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


విద్యుదాఘాతంతో కౌలు రైతు మృత్యువాత

వీపనగండ్ల, న్యూస్‌టుడే : విద్యుదాఘాతంతో కౌలు రైతు మృతిచెందిన సంఘటన గురువారం వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలంలోని సంగినేనిపల్లిలో జరిగింది. గ్రామస్థులు తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన అల్లె ఆంజనేయుడు(40) పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్నాడు. వరి నారుమడికి నీరు పెట్టేందుకు పొలానికి వెళ్లాడు. మోటారు మొరాయించడంతో సరిచేసేందుకు విద్యుత్తు నియంత్రిక నుంచి సరఫరాను ఆపేశాడు. మోటారుకు మరమ్మతులు చేశాక నియంత్రికను ప్రారంభించేందుకు వెళ్లగా.. విద్యుదాఘాతానికి గురై పడిపోయాడు. పక్క పొలంలో వ్యవసాయ పనులు చేస్తున్న వారు గమనించి దగ్గరికి వచ్చి చూసేసరికి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. నియంత్రిక దగ్గర ఎర్తింగ్‌ సరిగా లేకపోవడంతోనే విద్యుదాఘాతానికి గురైనట్లు గ్రామస్థులు చెబుతున్నారు. ఆంజనేయుడుకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రామన్‌గౌడు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని