logo

రుణాలిస్తాం.. రారండోయ్‌

రాజోలి మండల కేంద్రంలోని ఓ మహిళా పొదుపు గ్రూపు వారు మూడేళ్ల కిందట రూ.7 లక్షల రుణం తీసుకున్నారు. రుణ లక్ష్యం ఉండటంతో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామంటూ అధికారులు ఇళ్ల చుట్టూ తిరిగారు.

Updated : 27 Nov 2022 04:53 IST

పెరిగిన బ్యాంకు లింకేజీ లక్ష్యంతో అధికారుల సతమతం

న్యూస్‌టుడే, గద్వాల న్యూటౌన్‌

అలంపూర్‌ మండలంలో రుణాలు పొందడంపై అవగాహన కల్పిస్తున్న ఐకేపీ అధికారులు

రాజోలి మండల కేంద్రంలోని ఓ మహిళా పొదుపు గ్రూపు వారు మూడేళ్ల కిందట రూ.7 లక్షల రుణం తీసుకున్నారు. రుణ లక్ష్యం ఉండటంతో క్రమం తప్పకుండా చెల్లిస్తున్న వారికి రూ.15 లక్షలు మంజూరు చేస్తామంటూ అధికారులు ఇళ్ల చుట్టూ తిరిగారు. దాదాపు వారం రోజులపాటు వారితో చర్చలు జరిపినా భారమవుతుందంటూ ఆ మహిళలు రుణం తీసుకోలేదు.
* అలంపూర్‌ మండలంలోని 308 సంఘాలకు రూ.10.61 కోట్ల రుణం ఇవ్వాలన్నది లక్ష్యం. అధికారులు ఎలాగోలా తిప్పలు పడి మహిళలకు అవగాహన కల్పించి రూ.6 కోట్లకుపైగా ఇప్పించారు. ప్రభుత్వం సంఘాల సంఖ్య పెంచకుండానే రుణ లక్ష్యం మాత్రం రూ.18.64 కోట్లకు చేర్చింది.

వాయిదాలు చెల్లించడం భారం కావడంతో పరిమితికి మించి రుణాలు తీసుకోవడానికి మహిళా సంఘాల సభ్యులు ముందుకు రావడం లేదు. దీంతో బ్యాంకు లింకేజీ రుణాలు అర్హులైన పొదుపు సంఘాలకు ఇప్పించడం ఐకేపీ అధికారులకు తలకు మించిన భారమైంది. ఓ వైపు ఆర్థిక సంఘం ముగింపునకు మరో నాలుగు నెలలే ఉంది. ఈ క్రమంలో లక్ష్యం పూర్తి చేసేందుకు అధికారులు మహిళల చుట్టూ తిరుగుతున్నారు. మళ్లీ లక్ష్యాన్ని పెంచడంతో కష్టంగా మారింది. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి తీవ్రమవుతుండటంతో \దరు చేయలేమంటూ బాహాటంగానే చెబుతున్నారు.

జిల్లాలో ఇదీ పరిస్థితి..

జిల్లాలోని 255 పంచాయతీల పరిధిలో మొత్తం 310 గ్రామైక్య సంఘాలున్నాయి. వీటి పరిధిలో దాదాపు 90 వేల మందికిపైగా మహిళలు స్వయం సహాయక సంఘాలుగా ఏర్పడ్డారు. వీరికి ఏటా బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నారు. 2020- 21 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.100 కోట్లు, 2021- 22లో రూ.148.13 కోట్ల లక్ష్యం కేటాయించారు. అప్పుడు వంద శాతానికి పైగా లక్ష్యం సాధించారు. 2022-23లో రూ.177.97 కోట్ల లక్ష్యం ఉంది. ఇప్పటి వరకు రూ.110 కోట్లకుపైగా పూర్తి చేశారు. మిగిలిన లక్ష్యం ఎలా చేరుకోవాలనే దానిపై సెర్ప్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ఇలాంటి తరుణంలో లక్ష్యాన్ని రూ.216.54 కోట్లకు పెంచారు.
* ప్రతి గ్రామంలో గత ప్రణాళిక ప్రకారం స్వయం సహాయక సంఘాల్లో అర్హులైన వారిక రుణాలు ఇప్పించారు. రుణ లక్ష్యం పెరగడంతో.. ఏం చేయాలో పాలుపోని అధికారులు సక్రమంగా చెల్లిస్తున్న వారికే మళ్లీ ఇప్పిస్తున్నారు. రెండు, మూడేళ్ల కిందట రుణం తీసుకొని సగమైనా చెల్లించని వారి వెంటా పడుతున్నారు. వద్దన్నా వినకున్నా.. ఒత్తిడి తీసుకొచ్చి రుణం అదనంగా ఇస్తున్నారు. దీంతో అక్రమాలకు అవకాశం ఏర్పడుతుందని పలువురు అంటున్నారు. మొండి బకాయిలు పెరుగుతాయనే వాదనా బ్యాంకు అధికారుల్లో వ్యక్తమవుతోంది.

ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి..

పొదుపు సంఘాలకు ఇచ్చే రుణ లక్ష్యం పెరిగిన మాట వాస్తవమే. ఈ మేరకు సెర్ప్‌ నుంచి ఆదేశాలొచ్చాయి. కొన్ని మండలాలకు సాధ్యం కాని విధంగా లక్ష్యం ఉంది. వాటిని ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్ని మండలాలకు విభజించి లక్ష్యం చేరుకునేందుకు చర్యలు చేపడతాం. లక్ష్యం భారమైనా తప్పదు. ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. వీలైనంత మేర పూర్తి చేస్తాం.
- రామ్మూర్తి, బ్యాంకు లింకేజీ డీపీఎమ్‌, గద్వాల

Read latest Mahbubnagar News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు