logo

ఊరిస్తున్న ఇంటి సాయం

ఉమ్మడి జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కోసం పలువురు లబ్ధిదారులు ఎదురు చూసిన వేళ సీఏం కేసీఆర్‌ గత డిసెంబరులో ఓ ప్రకటన చేశారు.

Published : 01 Feb 2023 04:48 IST

న్యూస్‌టుడే, గద్వాల

మ్మడి జిల్లాలో రెండు పడక గదుల ఇళ్ల కోసం పలువురు లబ్ధిదారులు ఎదురు చూసిన వేళ సీఏం కేసీఆర్‌ గత డిసెంబరులో ఓ ప్రకటన చేశారు. స్థలం ఉన్న వారికి గృహ నిర్మాణానికి రూ.3 లక్షలు అందిస్తామని, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని ప్రకటించారు. దీంతో మూడేళ్లుగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు దీనిపై ఆశలు పెంచుకున్నారు.

ప్రభుత్వం 2023-24కు సంబంధించి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. దీనికి సంబంధించి రూ.12 వేల కోట్ల వరకు కేటాయింపులు చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. అయితే ముందుగా చెప్పినవిధంగా రూ.5 లక్షలు కాకుండా రూ.3 లక్షలకు కుదించారు. అయితే పూర్తి స్థాయి మార్గదర్శకాలు మాత్రం ఇంకా రాలేదు.

ఉమ్మడి జిల్లాకు 12 వేల యూనిట్లు : ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఒక్కో నియోజవర్గానికి వెయ్యి చొప్పున 12 వేల యూనిట్లు రానున్నాయి. మొదటి దశలో ఉమ్మడి జిల్లా పరిధిలో రూ.360 కోట్లు వీటి నిర్మాణానికి కేటాయించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ప్రకటన వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ప్రభుత్వం ఇంకా మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేదు. ఇప్పటికే దళితబంధు పథకంలో నియోజకవర్గానికి 500 యూనిట్లు మంజూరు చేసినా దాన్ని 300 యూనిట్లకు కుదించాలని అంతర్గతంగా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఇక గృహ నిర్మాణం విషయంలోనూ ఇదే విధంగా చేస్తుందా లేక మొదటి దశకు బడ్జెట్‌ తర్వాత పచ్చజెండా ఊపుతుందా అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై ఎమ్మెల్యేలు సైతం ఎలాంటి హామీలు ఇవ్వటం లేదు.


* ఉమ్మడి జిల్లాలో మొత్తం 1,684 పంచాయతీలున్నాయి. ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున కేటాయిస్తే ఒక్కో పంచాయతీకి పదిలోపే యూనిట్లు రానున్నాయి. పెద్ద పంచాయతీల పరిధిలో వీటిని సర్దుబాటు చేయటం తలకు మించిన భారంగా ఎమ్మెల్యేలకు మారనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని