logo

జీవ జలాలు పైపైకి..!

జిల్లాలో భూగర్భ జలాల లభ్యత, వినియోగం, పెరుగుదల తదితర అంశాలపై భూగర్భజలశాఖ అధికారులు వార్షిక విశ్లేషణ నివేదికను తయారు చేశారు. గత పదేళ్లలో భూగర్భ జలాలు పెరుగుతూ వస్తున్నాయి.

Published : 03 Feb 2023 03:16 IST

భారీగా పెరిగిన భూగర్భ నీటిమట్టం
ఈ ఏడాది 6.45 మీటర్ల లోతులోనే లభ్యత
వార్షిక నివేదికలో వెల్లడి
నాగర్‌కర్నూల్‌, న్యూస్‌టుడే

జిల్లాలో భూగర్భ జలాల లభ్యత, వినియోగం, పెరుగుదల తదితర అంశాలపై భూగర్భజలశాఖ అధికారులు వార్షిక విశ్లేషణ నివేదికను తయారు చేశారు. గత పదేళ్లలో భూగర్భ జలాలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ఏడాది 6.45 మీటర్ల లోతులోనే నీరున్నట్టు అంచనా వేశారు. జిల్లాలో వర్షపాతం కంటే కేఎల్‌ఐ కాల్వ ద్వారా వచ్చిన నీరు, చెరువులు నింపడం ద్వారానే నీటి మట్టాలు పెరిగాయి. అధికారులు జరిపిన సర్వేలో కోడేరు మండలంలోని తుర్కదిన్నె గ్రామంలో కేవలం 4.42 మీటర్ల లోతులోనే నీరు అందుబాటులో ఉండగా, నాగర్‌కర్నూల్‌లో అత్యధికంగా 14.63 మీటర్ల లోతులో ఉన్నట్టు గుర్తించారు. దశాబ్దకాలంలో చూస్తే గత మూడేళ్లలోనే నీటి మట్టాలు ఎక్కువగా పెరిగాయని చెప్పవచ్చు. అయితే  ఇష్టానుసారంగా నీటిని ఉపయోగించడం, వృథాగా కిందికి వదిలేయడంతో తిరిగి ఆ నీరు దుందుభి వాగులోకే వెళ్తున్నాయి. ఎక్కడికక్కడ నీటిని నిల్వ చేసే పద్ధతిని అవలంబించడం లేదు. జిల్లాలో అత్యధికంగా 19 గ్రామాల్లోనే నీటిని వినియోగిస్తున్నట్టు అధికారులు గుర్తించారు.

మొక్కుబడిగా కమిటీ సమావేశం : భూగర్భ జలశాఖ అధికారులు జలాల వినియోగం తదితర అంశాలపై ఇచ్చిన వాటిపై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించి, తీర్మానం చేస్తారు. అయితే ఇది మొక్కుబడిగానే కొనసాగుతోంది. బోర్లు వేసేందుకు అనుమతి పొందాలి. కానీ ఇది  ఎక్కడా అమలు కావడం లేదు. వాల్టా చట్టాన్ని పూర్తిగా మర్చిపోయారు. వ్యవసాయ, ఉద్యాన, పరిశ్రమలు, అటవీ, విద్యుత్తు శాఖలు, డీఆర్‌డీవో, భూగర్భజల,   మైనింగ్‌ శాఖలతో కలిపి కమిటీ ఉంటుంది. ఇందులో చర్చించిన అంశాల అమలు అనేది నామమాత్రమే అవుతోంది.  ఏడాది మొత్తంలో ఒక్కరు కూడ బోరు వేసేందుకు అనుమతి తీసుకోని పరిస్థితి నెలకొంది.


వార్షిక అంచనా

భూగర్భ జలాల లభ్యత : 72,349 హెక్టా మీటర్లు

జలాల వినియోగం : 33,842 హెక్టా మీటర్లు

భవిష్యత్తు నికర భూగర్భ జలాల లభ్యత : 38,507 హెక్టా మీటర్లు


కలుషితం కాకుండా చూడాలి : ప్రస్తుతం భూగర్భ జలాలు కలుషితం కాకుండా చుసుకోవాల్సి ఉంది. పంటల దిగుబడి పెరుగుతుందని ఇష్టానుసారంగా రసాయన ఎరువులు, పురుగుల మందులను ఉపయోగిస్తున్నారు. ఫలితంగా భూగర్భ జలాలు కలుషితం కావడమే కాకుండా నేలలు నిస్సారంగా మారతాయి. దీన్ని రైతులు గమనించడం లేదు. శుద్ధి చేసిన మురుగు నీటిని పరిశ్రామిక అవసరాలకు ఉపయోగించాలి. విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉండే చిరు ధాన్యాలు పండించడం వల్ల నీటి వినియోగం తగ్గుతుంది. జనానికి పౌష్టికాహారం అందుబాటులోకి వస్తుంది.  

రమాదేవి, భూగర్భజలశాఖ అధికారి, నాగర్‌కర్నూల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని