logo

ఆన్‌లైన్‌లో మోసం.. కేసు నమోదు

ఆన్‌లైన్‌లో స్టీల్‌ వాటర్‌ ట్యాంకు కొనేందుకు ఓ వినియోగదారుడు గుర్తు తెలియని వ్యక్తికి రూ.1,74,900 ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా చెల్లించాడు.

Published : 03 Feb 2023 03:16 IST

గద్వాల అర్బన్‌ : ఆన్‌లైన్‌లో స్టీల్‌ వాటర్‌ ట్యాంకు కొనేందుకు ఓ వినియోగదారుడు గుర్తు తెలియని వ్యక్తికి రూ.1,74,900 ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా చెల్లించాడు. ఇంకా డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకురావడంతో అప్రమత్తమైన ఆ వినియోగదారుడు తాను మోసం పోయానని సైబర్‌ క్రైంకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు గద్వాల పట్టణ ఠాణాలో గురువారం రాత్రి కేసు నమోదయింది. ఎస్సై అబ్దుల్‌ షుకూర్‌ కథనం మేరకు రాజోలి మండలం పచ్చర్లకు చెందిన లోకేశ్వర్‌రెడ్డి వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు గతేడాది డిసెంబరు 12న స్టీల్‌ వాటర్‌ ట్యాంకు కొనేందుకు ఆన్‌లైన్‌లో వెతికాడు. ఆన్‌లైన్‌లో ఓ వ్యక్తి పరిచయం అవగా నగదు చెల్లిస్తే తన వద్ద ఉన్న ట్యాంకును డెలివరీ చేస్తానని నమ్మించాడు. ఇది నమ్మిన లోకేశ్వర్‌రెడ్డి తన అల్లుడు వెంకట్రామిరెడ్డికి చెప్పగా అతడు సదరు వ్యక్తికి రూ.1,74,900 చెల్లించాడు. ఇంకా సొమ్ము చెల్లించాలని ఆ వ్యక్తి ఒత్తిడి తీసుకొచ్చాడు. వెంటనే అప్రమత్తమైన వెంకట్రామిరెడ్డి ఫోన్‌లో సంప్రదించగా ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాను మోసపోయినట్టు గుర్తించాడు. అదే నెల 28న సైబర్‌ క్రైం 1930 నంబర్‌కు ఫిర్యాదు చేశాడు. సైబర్‌ క్రైం పోలీసుల సూచన మేరకు వెంకట్రామిరెడ్డి గురువారం గద్వాల పట్టణ ఠాణాలో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై షుకూర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని