logo

మంజూరు ఒకరికి.. డబ్బు మరొకరికి

అధికారుల నిర్వాకంతో లబ్ధిదారునికి అందాల్సిన రాయితీ రుణం మరొకరి ఖాతాలో పడింది. వారు ఆ డబ్బును వాడుకోవడంతో లబ్ధిదారుడు ఇబ్బందులు పడుతున్నారు.

Published : 04 Feb 2023 05:44 IST

రాయితీ రుణం మంజూరైనట్లు ఉత్తర్వులు చూపుతున్న తిరుపతి

జడ్చర్లగ్రామీణం, న్యూస్‌టుడే : అధికారుల నిర్వాకంతో లబ్ధిదారునికి అందాల్సిన రాయితీ రుణం మరొకరి ఖాతాలో పడింది. వారు ఆ డబ్బును వాడుకోవడంతో లబ్ధిదారుడు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. మండలంలోని మల్లెబోయినపల్లి గ్రామానికి చెందిన డి.తిరుపతి పరిస్థితి ఇది.

వ్యాపార నిర్వహణకు రుణం... : ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా రుణం పొంది వ్యాపారం నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న తిరుపతికి గత ఏడాది జూన్‌ 21న రూ.లక్ష రాయితీ రుణం మంజూరైంది. ఇందుకు లబ్ధిదారుడు రూ.20 వేలు బ్యాంకుకి చెలిస్తే మిగతా రూ.80 వేలు కలిపి రూ.లక్ష అతని ఖాతాలో జమవుతాయి. ఇందు కోసం బ్యాంకు ఖాతా ఉన్న జడ్చర్ల గంజ్‌ నుంచి ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాలకు వెళ్లే దారిలోని బ్యాంకులో రుణం డబ్బులు జమ చేయడంతో పాటు రూ.10వేలు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కూడా లబ్ధిదారుని దగ్గర చేయించుకున్నారు. ఎస్సీ కార్పొరేష£న్‌ ద్వారా రుణం మంజూరైన ధ్రువపత్రం వచ్చినా.. ఖాతాలో డబ్బు జమ కాలేదని ఆరా తీయగా అసలు విషయం తెలిసింది. అదే గ్రామానికి చెందిన మరో మహిళ ఖాతాలో డబ్బులు పడ్డాయి. ఈ విషయం తెలిసి బ్యాంకు, ఎస్సీ కార్పొరేషన్‌ చుట్టూ బాధితుడు తిరగడంతో ఈ నెల 1వరకు పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, జరిగిన పొరపాటును సరిదిద్దకపోవడంతో విషయాన్ని ‘న్యూస్‌టుడే’ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై ఆరా తీయగా లబ్ధిదారునికి బదులు మరొకరి ఖాతాలో పడిన విషయాన్ని  బ్యాంకు అధికారులు ధ్రువీకరించారు. సంబంధిత బ్యాంకు మేనేజర్‌ శేషఫణి మాట్లాడుతూ... బాధితుడితో మాట్లాడామని, ఇతరుల ఖాతాలో పడిన డబ్బు రికవరీ చేసి ఇప్పిస్తామని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని