logo

ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలన పూర్తి

ఉపాధ్యాయులు బదిలీ కోసం జనవరి 28 నుంచి ఈ నెల 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు హార్డ్‌ కాపీలు సంబంధిత అధికారులకు అందజేశారు.

Published : 07 Feb 2023 05:17 IST

ఉపాధ్యాయుల బదిలీ దరఖాస్తుల పరిశీలనను పర్యవేక్షిస్తున్న డీఈవో గోవిందరాజులు

అచ్చంపేట, న్యూస్‌టుడే : ఉపాధ్యాయులు బదిలీ కోసం జనవరి 28 నుంచి ఈ నెల 1 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడంతో పాటు హార్డ్‌ కాపీలు సంబంధిత అధికారులకు అందజేశారు. బదిలీ దరఖాస్తుల్లో పూర్తి వివరాలను నమోదు చేయడంతో వాటిని ఈ నెల 3 నుంచి సోమవారం వరకు అధికారులు పరిశీలించారు. ప్రస్తుతం పనిచేస్తున్న పాఠశాలలో చేరిన తేదీ, ఉద్యోగంలో చేరిన తేదీని నమోదు చేయడం ద్వారా ఉపాధ్యాయులకు పాయింట్లు కేటాయించి వాటి ఆధారంగా జాబితాలు సిద్ధం చేస్తారు. భార్యభర్తలు ఉద్యోగులుగా (స్పౌజ్‌) ఉన్న వారికి అదనంగా పది పాయింట్లు కేటాయిస్తారు. ఎనిమిదేళ్ల లో ఈ అదనపు పాయింట్లను ఒకసారి మాత్రమే వినియోగించుకునేందుకు అవకాశం ఉంది. మళ్లీ ఎనిమిదేళ్ల గడువు ముగిసిన తరువాతనే మరోసారి  ఉపయోగించుకునేందుకు అవకాశం ఉంది. గుర్తింపు పొందిన ఉపాధ్యాయ సంఘాల జిల్లా, రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు కూడా బదిలీల్లో అదనంగా పది పాయింట్లు కేటాయిస్తారు. వివిధ దీర్ఘకాలిక వ్యాధులు, వితంతువులు, అవివాహిత మహిళా ఉపాధ్యాయినులకు కూడా బదిలీల్లో ప్రాధాన్యం ఉంటుంది. దివ్యాంగులు, వ్యాధుల బాధితులు  వైద్య నిపుణులు జారీ చేసిన ధ్రువీకరణ పత్రాలు జతచేయాల్సి ఉంటుంది. ఇప్పటికే అన్ని విభాగాల ఉపాధ్యాయులు బదిలీ కోసం చేసుకున్న దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 7,093 మంది ఉపాధ్యాయులు బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

10 వరకు అభ్యంతరాల స్వీకరణ : ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన దరఖాస్తులు, సర్వీసు పుస్తకాల పరిశీలన ముగిసింది. పరిశీలన తరువాత రూపొందించిన జాబితాలను మంగళవారం ఆన్‌లైన్‌లో ప్రకటించనున్నారు. పదోన్నతుల కోసం అర్హులైన వారి జాబితాలు, బదిలీల కోసం ఉపాధ్యాయులు పొందిన పాయింట్ల వివరాలతో సీనియార్టీ జాబితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 8 నుంచి 10 వరకు మూడు రోజుల పాటు జాబితాలపై ఆన్‌లైన్‌లో తగిన ఆధారాలతో అభ్యంతరాలను తెలిపే అవకాశం కల్పించారు. పొరపాట్లు ఉంటే  సరిచేయనున్నారు.తప్పుడు సమాచారం నమోదు చేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. అభ్యంతరాలను పరిశీలించి సవరణలు చేసిన తరువాత ఈ నెల 11, 12 తేదీల్లో పదోన్నతులు, బదిలీల కోసం అర్హుల తుది జాబితాలను ప్రకటించనున్నారు. ఆ తరువాత వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవడానికి అవకాశం కల్పించి వరుస క్రమంలో బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

* అపోహలకు తావు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని డీఈవో గోవిందరాజులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని