logo

ఏడాది గడువివ్వండి

గట్టు మండలంలోని ముంపు గ్రామం చిన్నోనిపల్లిని ఖాళీ చేయడానికి ఏడాది సమయం ఇవ్వాలని గ్రామస్థులు, రైతులు మొర పెట్టుకుంటున్నారు.

Published : 21 Mar 2023 02:07 IST

చిన్నోనిపల్లి గ్రామస్థుల డిమాండు

కలెక్టరేట్‌ ఎదుట చిన్నోనిపల్లి గ్రామస్థుల నిరసన

గద్వాల కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : గట్టు మండలంలోని ముంపు గ్రామం చిన్నోనిపల్లిని ఖాళీ చేయడానికి ఏడాది సమయం ఇవ్వాలని గ్రామస్థులు, రైతులు మొర పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం పునరావాసంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా ఊరును ఖాళీ చేయమనడం సరికాదని, గ్రామస్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గడువు ఇవ్వాలని కోరారు. సోమవారం సాయంత్రం వారు గద్వాలలో జిల్లా కలెక్టర్‌ క్రాంతితో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, సాగునీటి శాఖ అధికారులు హాజరయ్యారు. గ్రామంలో చాలా మందికి ఇళ్ల స్థలాలు అందలేదని, చాలా మంది పునరావాస కేంద్రంలో ఇళ్లు నిర్మించుకోలేదన్నారు. ఈ సమయంలో అధికారులు గడువు ఇవ్వకుండా గ్రామాన్ని ఖాళీ చేయించడానికి బలగాలను మొహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాది గడువు ఇవ్వాలని కోరినా ఎవరు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

వసతులు కల్పిస్తాం : కలెక్టర్‌

చిన్నోనిపల్లి పునరావాస కేంద్రంలో వసతులు కల్పిస్తామని కలెక్టర్‌ గ్రామస్థులకు హామీ ఇచ్చారు. 3 నెలల్లో పనులు పూర్తి చేస్తామన్నారు. ప్రత్యేక నిధులతో పంచాయతీ భవనం, పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, దేవాలయం నిర్మాణాలను పూర్తి చేస్తామని గ్రామాన్ని ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండాలన్నారు.

ప్రభుత్వంతో చర్చిస్తా : ఎమ్మెల్యే

గ్రామంలో మౌలిక వసతుల గురించి ప్రభుత్వంతో చర్చించి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. కలెక్టర్‌తో సమావేశం అనంతరం ఆయన గ్రామస్థులతో చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లనే రిజర్వాయర్‌ నిర్మాణం సకాలంలో పూర్తి కాలేదని విమర్శించారు. రైతుల శ్రేయస్సుకే జలాశయం నిర్మిస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని