logo

పెద్దచెరువులో రూ.కోట్లు కొల్లగొడుతూ..

మహబూబ్‌నగర్‌ పెద్ద చెరువు ఒండ్రుమట్టితో దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇట్టుక బట్టీలకు, కర్వేన ప్రాజెక్టుకు తరలిస్తున్నారు.

Updated : 30 Mar 2023 06:17 IST

 నిబంధనలకు విరుద్ధంగా ఒండ్రుమట్టి తరలింపు
ఇటుక బట్టీలకు, ప్రాజెక్టులకు చేరుతున్న వైనం
ఈనాడు డిజిటల్‌, మహబూబ్‌నగర్‌

పెద్ద చెరువులో జోరుగా మట్టి తవ్వకాలు

మహబూబ్‌నగర్‌ పెద్ద చెరువు ఒండ్రుమట్టితో దందా జోరుగా సాగుతోంది. రైతులకు ఉచితంగా మట్టి ఇస్తున్నామని చెబుతూ ఇట్టుక బట్టీలకు, కర్వేన ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. కొన్ని రోజులుగా టిప్పర్లు, ఎక్సవేటర్లు పెట్టి యథేచ్ఛగా ఒండ్రును తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతి రోజు మొత్తం 40 టిప్పర్లలో 9,600 క్యూబిక్‌ మీటర్ల నల్లమట్టి తరలుతోంది. బయట మార్కెట్‌లో క్యూబిక్‌ మీటర్‌ మట్టి ధర రూ.వెయ్యి పలుకుతోంది. ఈ లెక్కన నిత్యం రూ.లక్షల్లో గుత్తేదారులు సొమ్ము చేసుకుంటున్నారు. అధికారులు మాత్రం రైతులకు ఉచితంగా ఒండ్రుమట్టి ఇస్తున్నట్లు చెబుతున్నా ఎక్కడా కూడా అందుతున్న దాఖలాలు కనిపించడం లేదు. అధికారుల కళ్లెదుటే ఈ దందా సాగుతున్నా.. ఒక్కరు కూడా పట్టించుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా వీటిని పర్యవేక్షించాల్సిన జలవనరులశాఖ చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సీనరేజీ ఛార్జీలు ఎక్కడ.. : సాధారణంగా చెరువుల నుంచి ఒండ్రుమట్టిని వ్యాపారులకు తరలించాలంటే జలవనరులశాఖ అనుమతి తప్పని సరిగా ఉండాలి. ప్రైవేటు వ్యాపారులకు ఈ మట్టిని తరలిస్తే సీనరేజీ ఛార్జీలు వసూలు చేయాలి. ఈ చెరువు నుంచి ఎక్కడికి నల్లమట్టిని తరలించాలి? ఏ వాహనంలో తరలిస్తున్నారు? దూరం ఎంత ఉంటుంది? చెరువులో ఎంత లోతు మేర ఒండ్రును తవ్వాలి? ఎన్ని క్యూబిక్‌ మీటర్ల లోతు వరకు తీయాలి? ఇవన్నీ మట్టిని అనుమతిచ్చే పత్రాల్లో ఉండాలి. ఇవేమీ లేకుండానే ప్రాజెక్టులు, ఇటుక బట్టీలకు నల్లమట్టి తరలుతోంది. చెరువును ఇష్టారాజ్యంగా తవ్వి మట్టిని తరలిస్తే భవిష్యత్తులో ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు పూర్తిగా పడిపోతాయి. ప్రస్తుతం పెద్ద చెరువు అభివృద్ధి పనులు సాగుతున్నాయి. అభివృద్ధి పేరుతో ఇష్టారాజ్యంగా తవ్వుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చెరువును కుదించి కట్ట నిర్మాణం చేపడుతున్నారు. ఇక్కడ జరిగే అభివృద్ధి పనులకు ఈ ఒండ్రు ను ఉపయోగించుకోవచ్చు. కానీ కొందరు నేతల జోక్యం ఉంటుండటంతో వ్యాపారులకు ఈ మట్టిని విక్రయిస్తున్నా.. అధికారులు సైతం మౌనంగానే ఉంటున్నారు.  


* పెద్ద చెరువు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇక్కడి నుంచి తీసిన ఒండ్రును రైతులకు ఉచితంగా ఇస్తున్నాం. ఇటుక బట్టీలకు పోతున్న విషయం తెలియదు. తీసిన ఒండ్రుమట్టిని పట్టణ శివారులోని డంపింగ్‌యార్డుకు తరలించి అక్కడ ఉంచాలని చెప్పాం. దీనిపై పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటాం.
చక్రధరం, ఎస్‌ఈ, జలవనరుల శాఖ, మహబూబ్‌నగర్‌


స్థానికుల ఆందోళన

పెద్ద చెరువు నుంచి తీసిన ఒండ్రు మట్టిని పిల్లలమర్రి సమీపంలోని ఇటుక బట్టీలకు తరలిస్తున్నారు. చెరువు నుంచి మహబూబ్‌నగర్‌ ప్రధాన రహదారి మీదుగా మెట్టుగడ్డ నుంచి పిల్లలమర్రికి టిప్పర్లు వెళ్తుండడంతో స్థానికులు ఆందోళన చేస్తున్నారు. రెండు రోజులుగా పిల్లలమర్రి రోడ్డులో ఉంటే స్థానికులు టిప్పర్లను ఆపి తమ నిరసన వ్యక్తం చేశారు. టిప్పర్లలో ఒండ్రు మట్టిని తరలిస్తుంటే దుమ్ము మొత్తం వ్యాపిస్తోంది. రోడ్లపైన టిప్పర్ల వెనుక వచ్చే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 24 గంటలు టిప్పర్లు తిరుగుతుండటంతో రోడ్డు కూడా ధ్వంసమయ్యే పరిస్థితి వచ్చింది. కర్వెన ప్రాజెక్టుకు కూడా ఐదారు వాహనాల్లో మట్టి తరలుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని