తెల్లబంగారం.. తేలిపోతుంది సుమా!
నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అడ్డదారిలో విత్తనాలు రైతు చెంతకు చేరుతున్నాయి.
దొంగచాటుగా నకిలీ పత్తివిత్తనాల విక్రయం
పత్తి విత్తనాలు నాటుతున్న కూలీలు
న్యూస్‌టుడే- మద్దూరు, కోస్గి: నకిలీ పత్తి విత్తనాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా అడ్డదారిలో విత్తనాలు రైతు చెంతకు చేరుతున్నాయి. నారాయణపేట, వికారాబాద్, జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాల పరిధిలో ఏటా సుమారు రూ.50కోట్ల నకిలీ పత్తి విత్తనాల వ్యాపారం కొనసాగుతోంది. కర్ణాటక సరిహద్దున ఉన్న ఈ ప్రాంతాల్లో కొందరు వ్యాపారాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు. దౌల్తాబాద్, మద్దూరు, కోస్గి, దామరగిద్ద, ఉట్కూరు, కృష్ణ, మరికల్, నారాయణపేట, మక్తల్, మగనూర్ మండల కేంద్రాల్లో ఉన్న కొందరు వ్యాపారుల ఆధ్వర్యంలో నకిలీల విక్రయాలు విరాజిల్లుతున్నాయి. దౌల్తాబాద్‌లో ఓ వ్యాపారి ఏటా టాస్క్‌ఫోర్స్ పోలీసుల సోదాలో పట్టుబడి వారం, పదిరోజులు జైలుకు వెళ్లి వస్తుంటాడు. ఎన్ని సార్లు వెళ్లొచ్చినా పరిస్థితి మార్పులేదు. ఆ బడా వ్యాపారితో పాటు 9మందిని శుక్రవారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకొని రూ.85లక్షల విలువైన 26.5క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు.. నారాయణపేట మండలంలోని కోటకొండలో విక్రయించినట్లు ఉన్న సమాచారంతో సోదాలు చేశారు.
విత్తన ప్యాకెట్లపై ఉన్న క్యూఆర్ కోడ్
హెచ్‌టీ పత్తి విత్తనాలకు డిమాండ్ : హెచ్‌టీ పత్తి విత్తనాల సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఈ విత్తనాలతో సాగు చేసిన పంటపై గ్లైసిల్ అనే కలుపు మందు పిఛికారి చేయాలి. అలా చేస్తే మనుషులతో పాటు పర్యావరణంపై తీవ్ర దుష్ప్రభావం ఉంటుందని ప్రభుత్వం ఈ మందును నిషేధించింది. జిల్లాకు సరిహద్దున ఉన్న కర్ణాటక మార్కెట్లో గ్లైసిల్ మందును అమ్ముతారు. మన రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఈ మందును ఏడాదిలో 6 నెలలు దిగుమతి చేసుకుంటాయి. ఈ మందు ఎకరా పత్తి పంటలో కలుపు నివారణకు ఒక్క సారి పిఛికారి చేస్తే రూ.450 ఖర్చు అవుతుంది. పంట చివరి దశ వరకు ఐదుసార్లు కలుపు మందు పిఛికారి చేస్తారు. పంట కాలం పూర్తయ్యేసరికి రూ.2250తో కలుపు నివారించుకోవచ్చు. ప్రభుత్వ అనుమతి ఉన్న బీజీ2 పత్తి విత్తనాలు సాగు చేసినా పంటపై గ్లైసిల్ కలుపు మందు పిఛికారి చేస్తే పంట ఎండిపోతుంది. బీజీ2 పత్తి విత్తనాలు వేసిన పొలంలో కలుపు నివారణకు ప్రముఖ పురుగు మందుల కంపెనీలు అందించే కలుపు మందు ఎకరాకు ఒక్క సారి పిఛికారి చేస్తే రూ.1500 ఖర్చు అవుతుంది. ఆ మందు పంట సాగు చేసిన 35రోజులు మాత్రమే పని చేస్తుంది. తర్వాత వచ్చే కలుపును కూలీలను ఉపయోగించుకొని తొలగించాల్సి ఉంటుంది. దీంతో రైతులు తక్కువ ఖర్చు అవుతుందని హెచ్‌టీ పత్తి విత్తనాల సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇదే అవకాశంగా భావించిన కొందరు వ్యాపారులు హెచ్‌టీ విత్తనాలను కర్ణాటక ప్రాంతంలో సాగు చేసి, నారాయణపేట, వికారాబాద్, గద్వాల్, నాగర్‌కర్నూల్ జిల్లాలో విక్రయిస్తున్నారు. హెచ్‌టీ పత్తి విత్తనాలు తయారు చేసే వ్యాపారులు మండలానికి ఐదుగురు ఏజెంట్లను నియమించుకున్నారు. వారి ద్వారా ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో విత్తనాలు సరఫరా చేస్తారు. ఏజెంట్ల చేతికి వచ్చిన ఈ విత్తనాలను కిలో చొప్పున ప్లాక్టిక్ సంచుల్లో ప్యాకింగ్ చేసి, అవసరమైన రైతుల ఇంటికి ముందుగానే చేరవేస్తారు. ఐదేళ్లుగా ఈ తంతు కొనసాగుతున్నా ఎవరూ పట్టించుకునే దాఖలాలు లేవు.
నాణ్యతను గుర్తించాలి : రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడానికి సీడ్ ట్రేసబిలిటీ విధానం ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ మేరకు మార్కెట్‌లో రైతులకు విక్రయించే ప్యాకెట్‌పై క్యూఆర్ కోడ్ తప్పనిసరిగా ముద్రిస్తారు. సీజన్ ప్రారంభంలోనే పలు కంపెనీలు వందల పేర్లతో విత్తనాలను మార్కెట్‌లోకి విడుదల చేశాయి. కంపెనీలు విక్రయించే విత్తన ప్యాకెట్లపై విత్తనాల లాట్ సంఖ్య, మూల విత్తనం, ఎక్కడ పండించారు, వంగడం రకం పేరు, ఎక్కడ శుద్ధి చేశారు. వాటి సాగు కాలపరిమితి, స్వచ్ఛతను ధ్రువీకరించిన సంస్థ పేరు, చిరునామా, జన్యు స్వచ్ఛత తదితర వివరాలు క్యూఆర్ కోడ్‌లో ఉంటాయి. విత్తన సంచులపై ముద్రించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే వివరాలు తెలుసుకునే వీలుంది.
కఠిన చర్యలు తీసుకుంటాం:
నకిలి పత్తి విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా వ్యవసాయ అధికారి జాన్‌సుధాకర్ వెల్లడించారు. కర్ణాటక నుంచి హెచ్‌టీ పత్తి విత్తనాలు వస్తున్నట్లు సమాచారం ఉంది. సరిహద్దున నిఘా పెంచాం. పోలీసులు, వ్యవసాయ అధికారులు నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. ఎవరైనా మాకు సమాచారం ఇవ్వవచ్చు. చర్యలు చేపడతాం.
జాన్ సుధాకర్, జిల్లా వ్యవసాయాధికారి, నారాయణపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1