logo

Hyderabad: కుమారుడిని ఎయిర్‌పోర్టులో వదిలి వస్తూ.. తండ్రి మృతి

థాయిలాండ్‌ వెళ్తున్న కుమారుడు, కోడలిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో వదిలిపెట్టి గ్రామానికి కారులో తిరుగు ప్రయాణమైన ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు

Updated : 06 Jun 2023 08:28 IST

విదేశం నుంచి వెనక్కి వచ్చిన తనయుడు

పరమేశ్వరప్ప

మానవపాడు, న్యూస్‌టుడే : థాయిలాండ్‌ వెళ్తున్న కుమారుడు, కోడలిని శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో వదిలిపెట్టి గ్రామానికి కారులో తిరుగు ప్రయాణమైన ఓ రైతు రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆయన భార్య గాయాలకు గురయ్యారు. విషయం తెలిసి తండ్రి చివరిచూపు కోసం కుమారుడు భార్యతో కలిసి థాయిలాండ్‌ నుంచి వెనక్కి వచ్చారు.  మానవపాడు ఎస్సై రామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం నంద్యాల జిల్లా గడివేముల మండలం గని గ్రామానికి చెందిన పరమేశ్వరప్ప (45) వ్యవసాయం చేస్తారు. ఈయన కుమారుడు సాయి తేజప్ప, కోడలు మౌనిక హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజినీర్లుగా పనిచేసేవారు. వీరికి థాయిలాండ్‌లో ఉద్యోగం చేసేందుకు అవకాశం రావడంతో ఆదివారం రాత్రి పరమేశ్వరప్ప, భార్య శివలక్ష్మి, కొడుకు, కోడలు కారులో శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌కు బయలుదేరారు. వారిని వదిలిపెట్టి డ్రైవర్‌ వెంకటేశ్‌తో కలిసి స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. మానవపాడు మండలంలోని బోరవెల్లి స్టేజీ దాటాక డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా జాతీయ రహదారి పక్కన ఉన్న కిలో మీటర్‌ రాయిని కారు బలంగా ఢీకొట్టి కిందకు దూసుకెళ్లింది. పరమేశ్వరప్ప సీటు బెల్ట్‌ ధరించకపోవడంతో వాహనం నుంచి కిందపడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన భార్య, డ్రైవర్‌కు గాయాలకు గురయ్యారు. క్షతగాత్రుడిని హైవే అంబులెన్స్‌లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందారు. తండ్రి మృతిచెందిన విషయం తెలుసుకున్న సాయి తేజప్ప భార్యతో థాయిలాండ్‌ నుంచి వెనక్కి వచ్చారు. శివలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని