logo

దర్జాగా కబ్జా

ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి.

Published : 27 Mar 2024 02:32 IST

ఫిర్యాదులున్నా.. భూ ఆక్రమణదారులపై చర్యలు శూన్యం

కల్వకుర్తి, న్యూస్‌టుడే : ప్రభుత్వ భూములు చెరువులను ఆక్రమిస్తున్న దళారులపై చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రూ. కోట్ల విలువ చేసే భూములను అనుసరించి ఉన్న స్థలాలను కొనుగోలు చేసి పక్క భూమిపై కన్నేస్తున్నారు. సెలవు రోజుల్లో సమీపంలోని ప్రభుత్వ భూములను ఆక్రమిస్తున్నారు. పురపాలక పట్టణాలు, జాతీయ రహదారులను ఆనుకొని ఉన్న భూములే లక్ష్యంగా స్థిరాస్తి వ్యాపారం జోరందుకొంది. గతంలో ‘ఈనాడు’లో వచ్చిన కథనాలకు అధికారులు స్పందించారు. క్షేత్రస్థాయిలో ఆక్రమణలను గుర్తించి భూములను స్వాధీనం చేసుకొని హద్దులను ఏర్పాటు చేశారు. అంతలోనే శాసనసభ ఎన్నికలొచ్చాయి. ఎన్నికల సమయంలో రియల్టర్లు, రాజకీయ నాయకులు కుమ్మక్కయ్యారు. అధికారులు గుర్తించిన భూములను మళ్లీ ఆక్రమించి వారి పనులు కొనసాగుతున్నాయి. వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామ ఈదులచెరవు, కుప్పగండ్ల గ్రామ మల్కమయ్యకుంట వెనుక భూములు ఆక్రమణకు గురవగా అధికారులు స్పందించి స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల అనంతరం మళ్లీ భూమిని ఆక్రమించారనే ఆరోపణలున్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, గద్వాల ప్రాంతాల్లో స్థిరాస్తి వ్యాపారుల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది.

ఆక్రమణలు ఇలా..

వెల్దండ మండలం పెద్దాపూర్‌ గ్రామ సమీపంలో జాతీయ రహదారిని అనుసరించి ఉన్న ఈదులచెరవులో హైదరాబాద్‌కు చెందిన ఓ స్థిరాస్తి వ్యాపారి రైతుల వద్ద 16 ఎకరాల భూమి కొనుగోలు చేసి భూమిని చదును చేశాడు. భూమిని అనుసరించి ఉన్న చెరువు శిఖం భూమిని ఆక్రమిస్తూ వచ్చాడు. అనంతరం ఆక్రమించిన భూమిలో ప్రహరీ ఏర్పాటు చేశారు. ‘ఈనాడు’లో కథనం ప్రచురితమవడంతో అధికారులు ప్రహరీని తొలగించి హద్దులు నిర్ధారించారు. తర్వాత తిరిగి ఆ వ్యాపారి స్వాధీనం చేసుకొన్న భూమిని మళ్లీ ఆక్రమించారని రైతులు వాపోతున్నారు.

  • వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామ సమీపంలోని మల్కమయ్య కుంట కరకట్ట వెనకలో ఏర్పాటు చేసిన స్థిరాస్తి వ్యాపారి ఏకంగా చెరవు కరకట్టను తొలగించి భూమిని ఆక్రమించాడని గ్రామస్థులు తెలిపారు. ప్రజల ఫిర్యాదు మేరకు అధికారులు చర్యలు చేపట్టినా.. ఆక్రమణలు తొలగిపోలేదు.
  • కల్వకుర్తి పురపాలిక పరిధిలోని 99 సర్వే నంబరులో ఎర్రకుంట భూమి ఆక్రమణకు గురైంది. రూ.కోట్ల విలువ చేసే భూమిని సమీపంలోని ఇళ్ల వారు ఆక్రమించినా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వదిలేస్తున్నారనే విమర్షలున్నాయి.
  • అచ్చంపేట పట్టణ నడిబొడ్డులోని మల్లమ్మకుంటను ఆక్రమించి దుకాణాలు నిర్మించారు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు అధికారులు యంత్రాలతో కొంత తొలగించి వదిలేశారు.
  • కొల్లాపూర్‌ నియోజకర్గంలోని నార్లాపూర్‌ గ్రామంలో చెంచులకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఇచ్చిన భూమిని ఇతరులు ఆక్రమించారు. బాధితులు ఫిర్యాదు చేసినా చర్యలు లేవు. 5 ఎకరాలు ఆక్రమణకు గురైందని బాధితులు వాపోయారు.
  • మొలచింతలపల్లిలో చెంచుల భూములు ఆక్రమణకు గురయ్యాయి. 4 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేస్తున్నా ఎవరు పట్టించుకోవటం లేదని చెంచులు ఆందోళన చెందుతున్నారు.

కేసులు నమోదు చేయిస్తాం..

- శ్రీకాంత్‌, ఈఈ నీటిపారుదల శాఖ, కల్వకుర్తి

పెద్దాపూర్‌ గ్రామ ఈదులచెరవు నీటిలో మునిగిన ప్రాంతాన్ని గుర్తించి హద్దులు ఏర్పాటు చేశాం. అడ్డుకొన్న ఓ నాయకుడిపై కేసు నమోదు చేయించాం. మల్లీ సర్వే చేసి పూర్తి స్థాయిలో భూమిని స్వాధీనం చేసుకొని ఆక్రమణదారులపై చట్టప్రకారం కేసులు నమోదు చేయిస్తాం.


పరిశీలించి చర్యలు చేపడుతాం..

- ఎస్‌.శ్రీను, ఆర్డీవో, కల్వకుర్తి

ప్రభుత్వ భూముల ఆక్రమణలపై వివరాలు తెప్పించుకొని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించి చర్యలు చేపడుతాం. చెరవులు, ప్రభుత్వ భూములు ఎవరు ఆక్రమించినా వదిలేదు లేదు. రెవెన్యూ చట్టం ప్రకారంగా చర్యలు చేపడుతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని