logo

అడుగంటుతున్న వరదాయని

ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్‌పాడ్‌ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది.

Published : 28 Mar 2024 04:24 IST

రామన్‌పాడ్‌ జలాశయంలో పడిపోయిన నీటి మట్టం

ఆత్మకూరు, న్యూస్‌టుడే : ఉమ్మడి జిల్లా తాగు, సాగునీటి అవసరాలు తీర్చడంలో వరదాయనిగా నిలిచిన రామన్‌పాడ్‌ జలాశయం అడుగంటి పోతోంది. ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో జలాశయంలో నీటి మట్టం అడుగంటింది. ఈ క్రమంలో జలాశయంపై ఆధారపడిన తాగునీటి పథకాలకు నీటి లభ్యత ఇబ్బందికరంగా మారింది. గతంలో మహబూబ్‌నగర్‌, వనపర్తి, జడ్చర్ల, అచ్చంపేట ప్రాంతాలకు తాగునీటిని సరఫరా చేసిన పథకాలకు నీటి లభ్యత కొనసాగుతున్నా.. ఆత్మకూరు మండలంలోని 12 గ్రామాలకు తాగునీటినందించే పథకానికి ఎద్దడి ఏర్పడింది. మిషన్‌ భగీరథ పథకం పరిధిలో ఉన్న ఈ గ్రామాలకు రామన్‌పాడ్‌ జలాశయంలో గరిష్ఠ నిల్వ నీటి మట్టం ఉన్న రోజుల్లోనే పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కాని పరిస్థితి కొనసాగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత వేసవిలో తాగునీటి అవసరాలు తీర్చడం మరింత జఠిలం కానుంది.

  • రామన్‌పాడ్‌ జలాశయం గరిష్ఠ నిల్వ నీటి మట్టం 1021.09 ఫీట్లు. ప్రస్తుతం 1004.02 ఫీట్ల మేరకు నీరు ఉంది. 12 గ్రామాలకు తాగునీటినందించే ఇన్‌టెక్‌ వెల్‌కు పూర్తిస్థాయిలో నీరు సమకూరడం లేదు.
  • పథకం చేపట్టిన రోజుల్లో జలాశయంలో నిల్వనీటి మట్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా దూరంగా ఇన్‌టెక్‌ వెల్‌ నిర్మాణం చేపట్టడం వల్ల ఏటా వేసవిలో నిల్వ నీటిని ఇన్‌టెక్‌ వెల్‌ వరకు తరలించడం సమస్యగా మారుతోంది. అక్కడి వరకు నీరు చేరకపోవడంతో మిషన్‌ భగీరథ అధికారులు కాలువ తవ్వించారు. నీటి మట్టం పడిపోతున్న నేపథ్యంలో పరిస్థితులకు అనుగుణంగా కాలువను పొడిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
  • మండలంలోని జూర్యాల, గుంటిపల్లి, మేడేపల్లి, మోట్లంపల్లి, దేవర్‌పల్లి, తిప్పడంపల్లి, ఆరేపల్లి, కత్తేపల్లి, తూంపల్లి, వీరరాఘవపూర్‌, రేచింతల, బాలకిష్టాపూర్‌ గ్రామాలకు రామన్‌పాడ్‌ జలాశయం నుంచి తాగునీటిని సరఫరా చేయడంలో సమస్యలు ఏర్పడుతోంది. ప్రత్యామ్నాయంగా మిషన్‌ భగీరథ పథకం అమలుకు ముందు ఉన్న తాగునీటి వనరును పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడింది. చేతి పంపుల నిర్వహణ పూర్తిగా విస్మరించిన క్రమంలో గ్రామాల్లోని తాగునీటి బోర్ల నిర్వాహణకు మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
  • రామన్‌పాడ్‌ దిగువన ఉన్న ఈ గ్రామాల శివారులో ఊకచెట్టివాగులోని తాగునీటి బోర్లను తిరిగి ఉపయోగంలోకి తీసుకురాకుంటే వేసవిలో తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. ఆరేపల్లి, తూంపల్లి, కత్తేపల్లిలో సమస్యను పరిష్కరించడంలో గ్రామ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు ఒత్తిళ్లకు గురవుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లపైౖ దృష్టి
- రామకృష్ణ, ఏఈ, మిషన్‌ భగీరథ, ఆత్మకూరు

రామన్‌పాడ్‌ జలాశయంలోని ఇన్‌టెక్‌ వెల్‌కు నీరు సమకూరని పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటికే జిల్లా ఉన్నతాధికారులు స్వయంగా పరిస్థితిని పరిశీలించి ఇన్‌టెక్‌ వెల్‌ వరకు ఎప్పటికప్పుడు కాలువ తీయాల్సిందిగా ఆదేశించారు. గ్రామాల్లోని పాత తాగునీటి సరఫరా పథకాల నిర్వహణకు చొరవ తీసుకోవాల్సిందిగా కోరనున్నాం. జూరాల నుంచి 12 గంటల పాటు రామన్‌పాడ్‌కు నీటిని విడుదల చేయడం వల్ల మరో 10 రోజుల పాటు 12 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడంలో సమస్యలు ఏర్పడబోవని భావిస్తున్నాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని