logo

మెరుగైన వైద్యసేవలు అందించాలి: కలెక్టర్‌

ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు.

Published : 28 Mar 2024 04:27 IST

మాట్లాడుతున్న కలెక్టర్‌ శ్రీహర్ష

నారాయణపేట, న్యూస్‌టుడే : ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వైద్యాధికారులు కృషిచేయాలని కలెక్టర్‌ శ్రీహర్ష అన్నారు. కలెక్టరేట్లో వైద్యశాఖపై బుధవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో సిబ్బంది విధుల నిర్వహణ, ఇళ్ల సందర్శన, ఆరోగ్యఉప కేంద్రాలు, పీహెచ్‌సీల పరిధిలో మందుల పంపిణీపై ఆరా తీశారు. జిల్లాలో స్ట్రెస్‌ మేనేజ్‌మెంటు శిబిరాలుు ఎన్ని నిర్వహించారు? నిర్వహించాల్సిన శిబిరాల గురించి అడిగి తెలుసుకున్నారు. మక్తల్‌లో ప్రైవేటు ఆస్పత్రుల నిర్వహణకు ఎన్ని దరఖాస్తులు వచ్చాయని ప్రశ్నించగా రెండు వచ్చినట్లు అధికారులు తెలుపగా.. పరిశీలించి అనుమతులు ఇవ్వాలని సూచించారు. డీఎంహెచ్‌వో డా.సౌభాగ్యలక్ష్మి పాల్గొన్నారు.

జిల్లాలో తాగునీటి సమస్య ఉండదు : జిల్లాలో తాగునీటి సమస్య ఉండదని కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. భగీరథ ద్వారా జిల్లాలో 172 గ్రామాలకు కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టు నుంచి చందాపూర్‌ కుసుమద్‌పల్లి నీటి శుద్ధికేంద్రం ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. జూరాల వెనుక జలాల నుంచి జిల్లాలోని 59 గ్రామాలకు పారేవుల, నందిమల్ల పథకాల ద్వారా తాగునీటి సరఫరా జరుగుతోందన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మన్యంకొండ నీటిశుద్ధి కేంద్రం ద్వారా 180 గ్రామాలకు సరఫరా నిత్యం జరుగుతుందని చెప్పారు. మొత్తం 280 పంచాయతీల్లో 1,312 బోర్లు ఉన్నాయని, వాటిలో 308 బోర్లకు మరమ్మతులు చేయాల్సి ఉందని, 282 బోర్ల మరమ్మతులు పూర్తయినట్లు తెలిపారు. పేటలోని 24 వార్డుల జనాభా అవసరాలకు ప్రతినిత్యం 7.30 ఎం.ఎల్‌.డీల తాగునీటి అవసరం ఉండగా భగీరథ ద్వారా మన్యంకొండ నీటిశుద్ధి కేంద్రం నుంచి రోజూ 7.30 ఎం.ఎల్‌.డీల నీటి సరఫరా అవుతుందని చెప్పారు. మక్తల్‌, కోస్గి తదితర పురపాలికలకు నీటి సరఫరా చేస్తున్నామని వివరించారు.

నారాయణపేట, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ శాసనమండలి ఉప ఎన్నికల పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు కలెక్టర్‌ శ్రీహర్ష తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు.

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్‌ శ్రీహర్ష ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ(గ్రౌండ్‌) ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి మరమ్మతుల గురించి జిల్లా విద్యాశాఖ సెక్టోరియల్‌ అధికారి శ్రీనివాస్‌, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్‌ను అడిగి తెలుసుకున్నారు. పేట జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో కొత్తగా ఏర్పాటుచేసిన 13 పడకల వార్డును కలెక్టర్‌ పరిశీలించి రోగులకు అందిస్తున్న వైద్యసేవలను అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని