logo

మక్తల్‌ నుంచి భాజపా ఎన్నికల ప్రచారం

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు.

Published : 28 Mar 2024 04:36 IST

సమావేశంలో ముఖ్య నేతలకు సూచనలు చేస్తున్న ఎన్నికల ఇన్‌ఛార్జి కేవీఎల్‌ఎన్‌ రాజు, చిత్రంలో లోక్‌సభ అభ్యర్థి డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు

మహబూబ్‌నగర్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ భాజపా అభ్యర్థి డీకే అరుణ తన ప్రచార కార్యక్రమాన్ని ముమ్మరం చేయబోతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని గ్రామ గ్రామాన విస్తృత పరిచే ప్రక్రియను మక్తల్‌ నియోజకవర్గం నుంచి ప్రారంభించేందుకు కార్యాచరణ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మహబూబ్‌నగర్‌లోని డీకే అరుణ నివాసంలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణ కమిటీ సమావేశం జరిగింది. ఎన్నికల ఇన్‌ఛార్జి కేవీఎన్‌ఎల్‌రాజు అధ్యక్షత జరిగిన సమావేశంలో అభ్యర్థి డీకే అరుణతో పాటు మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి, శ్రీనివాసులు, లోక్‌సభ నియోజకవర్గ కన్వీనర్‌ పవన్‌కుమార్‌రెడ్డి, పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యులు నాగూరావ్‌ నామాజీ, మక్తల్‌, నారాయణపేట, షాద్‌నగర్‌, జడ్చర్ల, కొత్తకోట, దేవరకద్ర, మహబూబ్‌నగర్‌ నియోజకవర్గాలకు చెందిన భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కేవీఎల్‌ఎన్‌రాజు ముఖ్య నేతలకు సూచించారు. ఈ నెల 29న మక్తల్‌ నియోజకవర్గం నుంచి డీకే అరుణ ప్రచారాన్ని ప్రతి గ్రామాన్ని తాకేలా విస్తృత పరుస్తూ కార్యాచరణ సిద్ధం చేయాలని నిర్ణయించారు. మక్తల్‌ నియోజకవర్గం నుంచి మొదలు పెట్టబోయే ప్రచార కార్యక్రమం లోక్‌సభ నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రాన్ని, మండలంలోని ప్రతి గ్రామానికి చేరుకునేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ కమిటీనే చూసుకోవాలన్నారు. ఈ నెల 30న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి షాద్‌నగర్‌, మహబూబ్‌నగర్‌ పట్టణాల పర్యటన ఉంటుందని, షాద్‌నగర్‌లో చేరికల కమిటీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో పాల్గొంటారని, మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో జరిగే భాజపా ముఖ్య నేతల సమావేశానికి హాజరవుతారని ఈ రెండు సమావేశాలు విజయవంతం చేయాలని సమావేశంలో చర్చించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో బూత్‌లో వచ్చిన ఓట్లను బేరీజు వేసుకొని రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ప్రతి బూత్‌లో 370 ఓట్లకు తక్కువ కాకుండా భాజపాకు ఓట్లు పోలయ్యేలా క్షేత్రస్థాయిలో పనిచేయాలని సమావేశంలో సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని