logo

అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట

ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.

Published : 29 Mar 2024 03:38 IST

‘న్యూస్‌టుడే’తో అగ్నిమాపక డివిజినల్‌ అధికారి శ్రీదాస్‌

కొత్తకోట, న్యూస్‌టుడే : ఎండల తీవ్రత పెరిగి.. అక్కడక్కడా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. వాటిని ముందస్తుగా అరికట్టాలంటే అప్రమత్తత, అవగాహన ఎంతో అవసరమని డివిజినల్‌ అగ్నిమాపక అధికారి శ్రీదాస్‌ తెలిపారు. సిబ్బంది కొరత ఉన్నా.. ఉన్న వారితో సేవలు అందిస్తున్నామని పేర్కొన్నారు. బహుళ అంతస్తుల యజమానులు నిబంధనలు పాటించాలని సూచించారు. వేసవిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంటుంది. వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అగ్ని ప్రమాదాలు జరిగితే వెంటనే 101కు డయల్‌ చేసి సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. 108కు లేదా 100కు ఫోన్‌ చేసినా అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందుతుందన్నారు. ఆయనతో ‘న్యూస్‌టుడే’ ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు..

న్యూస్‌టుడే : డివిజన్‌ పరిధిలోని కేంద్రాల్లో వసతులు ఎలా ఉన్నాయి?

అధికారి : గద్వాల, అలంపూర్‌, వనపర్తి, కొత్తకోట, ఆత్మకూరు, నాగర్‌కర్నూల్‌, అచ్చంపేట, కొల్లాపూర్‌, కల్వకుర్తిలో అగ్నిమాపక కేంద్రాలు ఉన్నాయి. అమ్రాబాద్‌లో అవుట్‌ పోస్టు ఉంది. వసతులు బాగానే ఉన్నాయి.

న్యూ : డివిజన్‌ పరిధిలో ఫైర్‌మెన్లు, డ్రైవర్‌ ఆపరేటర్లు, ఇతర సిబ్బంది చాలినంత మంది ఉన్నారా?

అ : ప్రతిస్టేషన్‌లో 16 మంది సిబ్బంది ఉండాలి. డివిజన్‌ వ్యాప్తంగా 90 పైర్‌ మెన్‌లు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 59 ఖాళీలున్నాయి.ప్రస్తుతం కొత్త వారికి శిక్షణ జరుగుతోంది. వచ్చే జూలై నాటికి వీరు అందుబాటులోకి రానున్నారు.

న్యూ : అగ్నిప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

అ : ప్రమాదాలు ఎప్పుడు, ఎలా సంభవిస్తాయో తెలియదు. అందువల్ల ఏప్రిల్‌లో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తాం. మాక్‌డ్రిల్‌ కార్యక్రమాలు చేపడుతున్నాం. ఆసుపత్రులు, పరిశ్రమలు, పాఠశాలల్లో తరచూ అవగాహన కల్పిస్తున్నాం. అగ్నిమాపక సామగ్రిని తప్పని సరిగా ఏర్పాటు చేసుకోవాలి.

న్యూ : గతేడాది వేసవిలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి?

అ :  2023 ఏప్రిల్‌ నుంచి 2024 ఫిబ్రవరి వరకు 376 ప్రమాదాలు జరిగాయి. వాటిలో తీవ్రమైనవి ఏడు ఉన్నాయి. మోస్తరుకు మించినవి 17, చిన్నవి 329 ప్రమాదాలు జరిగాయి. రూ.5.69 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా. సకాలంలో స్పందించడం వల్ల సుమారు రూ.38.34 కోట్ల ఆస్తి కాపాడగలిగాం.

న్యూ : వేసవిలో ఎలాంటి సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతుంటాయి?

అ : తొందరగా నిప్పు రగిలే వస్తువులు ఉన్న చోట అప్రమత్తంగా ఉండాలి. బీడీలు, సిగరేట్లు తాగి ఎక్కడ పడితే అక్కడ విసిరేయడం వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. గడ్డి వాములను ఇళ్ల మధ్య కాకుండా ఊరికి దూరంగా ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి. ఇళ్లలో సిలిండర్లకు వాడే పైపుల్ని, రెగ్యులేటర్లను శుభ్రం చేయించాలి. పైపులను ఎక్కువ నెలలు వాడినట్లు గుర్తిస్తే వాటిని మార్చుకోవడం మంచిది. రాత్రివేళ రెగ్యులేటర్‌ ఆఫ్‌ చేసే అలవాటు చేసుకోవాలి. బహుళ అంతస్తుల యజమానులు నిబంధనలు పాటించాలి. గదుల్లో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. షాపింగ్‌ మాల్స్‌, సముదాయాల్లో తక్షణ చర్యల కోసం బకెట్లలో ఇసుక, డ్రమ్ముల్లో నీరు తప్పని సరిగా పెట్టుకోవాలి. పరిశ్రమల వద్ద ప్రమాద నివారణ ఏర్పాట్లు తప్పనిసరిగా ఉండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని