logo

ప్రజాధనం వృథా

జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు.

Published : 29 Mar 2024 03:47 IST

రూ.90 లక్షల వాహనం నిరుపయోగం

నాగర్‌కర్నూల్‌ : పురపాలక సంఘం కార్యాలయం ఆవరణలో నిరుపయోగంగా నిలిపిన రోడ్డు ఊడ్చే వాహనం

కందనూలు, న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలోని పురపాలక సంఘం అధికారులు పట్టణంలోని ప్రధాన రహదారులు, అంతర్గత దారులను రోజు శుభ్రం చేయడానికి 2023లో రూ.90 లక్షలతో రోడ్డు ఊడ్చే వాహనాన్ని కొనుగోలు చేశారు. డిసెంబర్‌లో రెండు, మూడు రోజులు ప్రధాన రహదారిని శుభ్రం చేశారు. ఈ హడావుడి తరువాత వాహనాన్ని ఉపయోగించుకోకుండా కార్యాలయంలో నిరుపయోగంగా నిలిపారు. వాహనం ద్వారా రోడ్లును ఊడ్చటం వలన డీజిల్‌ వినియోగం ఎక్కువగా ఉంటుందని దీని వలన పురపాలక సంఘంపై ఆర్థిక భారం ఎక్కువగా పడుతుందని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు. అధికారులు ఎలాంటి ప్రణాళిక, అవగాహన లేకుండా రూ. 90 లక్షలు ఖర్చు చేసి రోడ్డు ఊడ్చే యంత్రం ఖరీదు చేయడం, ప్రస్తుతం ఆ యంత్రం వినియోగించుకోకుండా కార్యాలయానికి పరిమితం చేయడంతో ప్రజాధనం వృథా అయ్యిందని పట్టణ ప్రజలు విమర్శిస్తున్నారు.

పారిశుద్ధ్య సిబ్బంది కొరత..

నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని 24 వార్డుల పరిధిలోని సీసీ రహదారులు, ప్రధాన రహదారులు శుభ్రం చేయడానికి 78 మంది పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో దాదాపుగా 15 మంది కార్మికులు రోజు ప్రభుత్వ కార్యాలయాలను శుభ్రం చేస్తున్నారు. మిగిలిన 63 మంది కార్మికులు రహదారులు, మురుగు కాల్వలు శుభ్రం చేయడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పురపాలక సంఘం పరిధిలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్య తక్కువగా ఉండటం వలన నిత్యం పట్టణంలోని ప్రధాన రహదారులు శుభ్రం చేస్తున్నారు తప్పా  కాలనీలోని అంతర్గత సీసీ దారులు శుభ్రం చేయడం లేదు. అంతర్గత సీసీ రహదారులను నెలలో రెండు, మూడు సార్లు మాత్రమే శుభ్రం చేయడం వలన దుమ్ము, దూళీ నివాసాల్లోకి వస్తోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా పురపాలక సంఘం అధికారులు స్పందించి రోడ్డు ఊడ్చే వాహనాన్ని ఉపయోగించి అన్ని కాలనీల్లోని సీసీ రహదారులను శుభ్రం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

చర్యలు తీసుకుంటాం

రోడ్డు ఊడ్చే వాహనాన్ని ఉపయోగించడానికి చర్యలు తీసుకుంటాం. యంత్రం నడపటానికి డ్రైవర్‌ను నియమిస్తున్నాం. ప్రస్తుతం పట్టణంలోని ప్రజలకు ఇబ్బందులు కల్గకుండా ప్రతి రోజు రహదారులను శుభ్రం చేస్తున్నాం.

నరేశ్‌బాబు, పురపాలక సంఘం కమిషనర్‌, నాగర్‌కర్నూల్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని