logo

స్వచ్ఛంద గురువులు!

‘గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ఉన్నతంగా రాణించేలా చూడాలి. ఇందుకు అనుగుణంగా చదువుకునేందుకు అవసరమైన సాయం

Updated : 29 Jan 2022 05:47 IST

అక్షరదాన్‌ వేదికగా గ్రామీణ విద్యార్థులకు బోధన

12 సంస్థలకు చెందిన వంద మంది వాలంటీర్లతో సేవలు

ఈనాడు, సంగారెడ్డి

ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌ ఆచార్య బీఎస్‌మూర్తితో విద్యార్థుల ఆన్‌లైన్‌ ముఖాముఖి

‘గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంపొందించాలి. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకుని ఉన్నతంగా రాణించేలా చూడాలి. ఇందుకు అనుగుణంగా చదువుకునేందుకు అవసరమైన సాయం అందించాలి’.. ఈ లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో అక్షరదాన్‌ అనే స్వచ్ఛంద సంస్థ ముందడుగు వేస్తోంది. మూడేళ్ల క్రితం అక్షర సహాయంతో మొదలుపెట్టి అక్షరమాలనూ అందిస్తుండటం విశేషం. హైదరాబాద్‌కు చెందిన విశ్రాంత శాస్త్రవేత్త ఎం.శ్రీరామచంద్రమూర్తి నేతృత్వంలో ఇవి కొనసాగుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల ప్రతిభాపాటవాలను పెంచేలా వీరు ప్రస్తుతం ఆన్‌లైన్‌ ద్వారా ప్రయత్నిస్తున్నారు. ఇందుకు పైలట్‌ ప్రాజెక్టుగా జిల్లాను ఎంచుకున్నారు.

అక్షరదాన్‌కు ఐఐటీ హైదరాబాద్‌తో పాటు ఎన్‌ఐటీ వరంగల్‌, గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం, బిట్స్‌పిలానీ (హైదరాబాద్‌), సీబీఐటీ, బీవీఆర్‌ఐటీ.. ఇలా 12 విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు ప్రధానంగా గణితం, సైన్స్‌ పాఠ్యాంశాలను బోధిస్తున్నారు. అక్షరదాన్‌ కోరడంతో ఇప్పటి వరకు 250 మందికి పైగా వాలంటీర్లు ముందుకొచ్చారు. ప్రస్తుతం వంద మంది సేవలను వినియోగించుకుంటున్నారు.

నలుగురి చొప్పున..

ఒక్కో వాలంటీరుకు సగటున నలుగురి బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఈ మేరకు చిన్నారులతో మాట్లాడి వారికి ఏ ఏ పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉందో తెలుసుకుంటారు. అందుకు తగ్గట్లు పాఠ్యప్రణాళిక రూపొందించుకుంటారు. వారాంతాలు, సెలవు దినాల్లో ఆన్‌లైన్‌ బోధన సాగిస్తారు. కేవలం పాఠాలు చెప్పడమే కాకుండా.. భవితకు దోహదపడే కోర్సులపై అవగాహన కల్పిస్తారు. బాగా చదువుకుంటే ఎలాంటి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చో వివరిస్తున్నారు. నచ్చిన అంశంలో ఎలా ముందుకు సాగాలో వివరించి ప్రోత్సహిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో చదువుతున్న విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది.

1,500 వీడియోలు..

అక్షరదాన్‌ వెబ్‌సైట్‌లో 1,500 వీడియోలు అందుబాటులో ఉంచారు. ఇందులో విద్యార్థులకు సంబంధించిన పాఠ్యాంశాలు, మహనీయుల జీవిత చరిత్రలు ఉన్నాయి. విద్యార్థులు తమకు అనుకూల సమయంలో లాగిన్‌ఐడీతో వెబ్‌సైట్‌లోకి వెళ్లి వాటిని చూడొచ్ఛు విద్యార్థులకు అవసరమైన వీడియోలను ఒక క్రమపద్ధతిలో ఇందులో ఉంచారు. ప్రస్తుతం 100 మంది వాలంటీర్లు సేవలు అందిస్తున్నారు. ఏడాదిలో ఈ సంఖ్య వెయ్యికి పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు.


5వేల మందికి చేరేలా..: ఎం.శ్రీరామచంద్రమూర్తి, విశ్రాంత శాస్త్రవేత్త

గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయాలనే లక్ష్యంతో అక్షరదాన్‌ను ప్రారంభించాం. 2019 నుంచి సంగారెడ్డి జిల్లాలో కార్యక్రమాలు అమలు చేస్తున్నాం. అక్షరసహాయలో భాగంగా దాతల సహకారంతో రూ.5 లక్షల మేర ఇక్కడ వెచ్చించగలిగాం. ప్రస్తుతం జిల్లాలోని 550 మంది ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నారు. ఈ సంఖ్యను 5 వేలకు చేర్చాలని సంకల్పించుకున్నాం. పాఠాలకే పరిమితం కాకుండా ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటుచేస్తున్నాం. విశ్రాంత ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, వైద్యులు, న్యాయవాదులు, సైనికాధికారులతో కూడిన 25 మంది బృందాన్ని ఏర్పాటు చేశాం. పిల్లల్లో పఠనాసక్తిని పెంచేలా ఎంపిక చేసిన బడుల్లో పుస్తకాలు అందిస్తున్నాం.


పదో తరగతి పిల్లలకు..: విజయ్‌కుమార్‌, జిల్లా సైన్స్‌ అధికారి

అక్షరదాన్‌ తొలుత మన జిల్లాను ఎంపిక చేసుకోవడం చాలా సంతోషం. మూడేళ్లుగా వారు చేపడుతున్న కార్యక్రమాలతో విద్యార్థులకు ఆ మేరకు ప్రయోజనం దక్కుతోంది. పిల్లలకు అవసరమైన పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రిని అందిస్తున్నారు. రెండేళ్లుగా ఆన్‌లైన్‌ ద్వారా వాలంటీర్లతో ప్రత్యేకంగా పాఠాలు చెప్పించడం, ప్రముఖులతో మాట్లాడించడం ద్వారా పిల్లలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇటీవల ఐఐటీ డైరెక్టర్‌ మూర్తి అరగంట పాటు వారికి దిశానిర్దేశం చేశారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పుల గురించి వారికి అర్థమయ్యేలా వివరించారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని